ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 15, 2020 , 00:56:56

‘ఎరోబిక్‌'తో లాభాల పంట

‘ఎరోబిక్‌'తో లాభాల పంట

పెట్టుబడులు రాక.. దిగుబడులు లేక దిగాలుపడుతున్న రైతాంగాన్ని లాభాల బాట పట్టించేందుకు సర్కారు వినూత్న సాగు విధానాలకు నాందిపలుకుతున్నది.. మూస పద్ధతులకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో సరికొత్త పంటల సాగుకు అన్నదాతను సమాయత్తం చేస్తున్నది.. ఈ పరిస్థితుల్లో రైతులు వరిని ఎరోబిక్‌ విధానంలో సాగుచేస్తే ఖర్చులు తగ్గడంతో పాటు అధిక లాభాలు ఆర్జించే అవకాశమున్నది. 

జమ్మికుంట: తక్కువ నీరు ఉపయోగించి పొడి దుక్కిలో వరి విత్తుకుని పండించే విధానాన్ని ఎరోబిక్‌ అంటారు. ఈ పద్ధతిలో నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. పొలాన్ని దమ్ము చేయడం, నారు మడి తయారీ, నాట్లు అవసరం లేకుండానే వరి విత్తనాన్ని నేరుగా విత్తుకుని ఆరుతడి పంటగా సాగు చేయవచ్చు.  అడపా దడపా నీరు అందించే సౌకర్యం కలిగిన పరిస్థితుల్లో ఈ విధానం అనుకూలంగా ఉంటుంది. 

రకాలు, భూమి తయారీ..  

ఎరోబిక్‌ పద్ధతిలో సాగు చేయడానికి లోతైన వేరు వ్యవస్థ కలిగి, బెట్టను తట్టుకునే స్వల్ప లేదా మధ్యకాలిక రకాలు అనుకూలం. తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకుని పలుమార్లు దున్ని మెత్తని దుక్కి చేసుకున్నైట్లెతే కలుపు సమస్యలను  కొంతమేర అధిగమించవచ్చు. సేంద్రియ ఎరువుగాని, కంపోస్టుగాని, పచ్చి రొట్ట అవశేషాన్ని గాని ఎరువుగా ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. నేల చదునుగా ఉంటే తేమ సరిగ్గా అంది మొలక సమానంగా వస్తుంది. పంట ఎదుగుదల కూడా సమాంతరంగా ఉంటుంది.  

విత్తే సమయం..

వాతావరణం పొడిగా ఉండి, భూమి తడిగా లేనప్పుడు మాత్రమే నేరుగా విత్తడానికి అనుకూలమైన సమయం.  జూన్‌ మొదటి వారం లేదా జూలై రెండు, మూడో వారంలోగా విత్తనాలను నాటాలి. భూమిలో తేమ శా తం ఎక్కువగా   ఉంటే    నేరుగా విత్తడం సాధ్యం కాదు. ఎకరానికి 10-12 కిలోల విత్తనం సరిపోతుంది. నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల మొలక శాతం పెరిగి, మొక్కల సాంద్రత అనుకున్నట్లుగా చేసుకోవడంతో అనేక రకాలైన తెగుళ్లను అదుపు చేయవచ్చు. కార్పెండిజం మందుతో కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

నేరుగా విత్తడం.. మొక్కలు పలుచన చేయడం

శుద్ధి చేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా గాని, 20 సెం.మీ. దూరంలో నాగటి సాలు వెనుకగాని, గొర్రుతో గాని, ట్రాక్టర్‌తో నడిచే ఎరువులు, విత్తనాన్ని ఒకేసారి వేసే గొర్రుతో గాని విత్తుకోవచ్చు. విత్తనాన్ని ఎక్కువ లోతులో వేస్తే మొలకలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కనుక పై పొరల్లో పడేట్లుగా సుమారు 2.5-5సెం.మీ. లోతులో వేసుకోవాలి. నాగలి సాలుతో గాని లేదా పత్తి అచ్చు సహాయంతో 30 సెం.మీ. దూరంలో విత్తుకుంటే కలుపు నివారణకు అంతర కృషి కూడా చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో అధికంగా ఉన్న మొక్కలను రెండు ఆకుల దశలో తొలగించాలి.

 ఎరువులు, కలుపు, నీటి యాజమాన్యం

సిఫారసు చేసిన భాస్వరం ఎరువు పూర్తి మోతాదుకు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పొటాష్‌ ఎరువును ఆఖరి దుక్కిలో సగభాగం, మిగిలిన ఎరువును నత్రజనితో పాటు అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. నత్రజని ఎరువును సాధారణంగా వేసే మాగాణి వరికంటే సుమారు 25 శాతం అధికంగా వేయాలి. విత్తిన 15 రోజులకు, పిలక దశలో, అంకురం దశలో నత్రజనిని మూడు దఫాలుగా వేయాలి. ఎరోబిక్‌ వరిలో ఇనుపధాతు జింక్‌ లోపం కనిపిస్తుంది. లక్షణాలను గుర్తించిన వెంటనే లీటరు నీటికి 2గ్రా. అన్నభేది, 2గ్రా. నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. అలాగే జింక్‌ సల్ఫేట్‌ కూడా పిచికారీ చేయాలి. ఎరోబిక్‌ సాగులో నీరు నిల్వ ఉండకపోవడం వల్ల కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కలుపు మొక్కలు పైరుతో పోటీపడి పంట దిగుబడులను తగ్గిస్తాయి. సమగ్ర నివారణ చర్యలు సకాలంలో చేపట్టాలి. పొలం ఎండిపోకుండా తేమ ఉండేలా నీటి తడులు పెడుతూ పంట కీలక దశల్లో బెట్టకు గురికాకుండా చూడడం ప్రధాన అంశం. పొలంలో ఎప్పుడూ నీరు ఉంచాల్సిన అవసరం లేదు. పంటకు 6-7 రోజులకు ఒకసారి నీటి తడులు పెట్టాలి. అధిక వర్షాలు నమోదైనప్పుడు నీటి తడులు అవసరం ఉండదు. దీనివల్ల 40-50 శాతం నీటిని ఆదా చేసుకోవచ్చు. 

దిగుబడి, లాభాలు

సాధారణంగా చేసే మాగాణి వరి దిగుబడులతో పోల్చినప్పుడు ఎరోబిక్‌ సాగు ద్వారా సుమారు 80-90 శాతం అధిక దిగుబడులు పొందవచ్చు. నారు పోసుకోవడం, నాటు వేసుకోవడం అవసరం లేదు. సమయానుకూలంగా విత్తుకోవచ్చు. తక్కువ విత్తనం సరిపోతుంది. వర్షాధారంగా పండించవచ్చు. మిథేన్‌ వాయువు విష ప్రభావాన్ని తగ్గించవచ్చు. చీడ, పీడల సమస్య తక్కువగా ఉంటుంది. మాగాణి పంట కంటే 7-10 రోజుల ముందుగా కోతకు వస్తుంది.

సాగులో ముఖ్యాంశాలు

విత్తడానికి 10-15 రోజుల ముందు తేలిక పాటి నీటి తడి ఇవ్వడం ద్వారా మొలకెత్తిన కలుపును దున్ని వేయడం వల్ల 25-30 శాతం కలుపును ముందుగానే నివారించవచ్చు. మొక్కలను రెండు ఆకుల దశలో తప్పనిసరిగా పలుచన చేసుకోవాలి. సమయానుకూలంగా కలుపు నివారణ చేయాలి. ఇనుము, జింక్‌ పోషకాల లోపాన్ని గుర్తించిన వెంటనే తగిన చర్యలు చేపట్టాలి. పంట తొలి దశలో దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితులు సంభవిస్తే పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి అవసరం మేరకు తేలికపాటి నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుందని కేవీకే విజ్ఞానకేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త అండ్‌ హెడ్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. వివరాలకు 9848573710లో సంప్రదించాలని కోరారు.


logo