బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 15, 2020 , 00:53:35

నారు నాణ్యమైనదేనా?

నారు నాణ్యమైనదేనా?

కూరగాయలు పండించే రైతులు గతంలో తమ చేన్లలోనే నారు పోసుకుని మొక్కలు నాటే వారు. అయితే, కొన్ని సార్లు నారు దక్కకపోవడం, దక్కినా నాటిన తర్వాత వాడిపోవడం, దిగుబడి సరిగా రాకపోవడం వంటి కారణాలతో నర్సరీలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో నర్సరీల్లో లభించే నారు నాణ్యమైనదా?, కాదా? పూర్తిగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు.

 తిమ్మాపూర్‌ రూరల్‌: వానకాలం వస్తున్న తరుణంలో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా పంటల్లో మార్పు చేసుకునేందుకు అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి.. ఆధునిక పంటలపై ఆసక్తి పెడుతున్నారు. ఈ క్రమంలో కూరగాయల మొక్కలను పెంచే నర్సరీల నిర్వాహకులు నకిలీ నారు పెంచే అవకాశం ఉంది. రైతులు జాగ్రత్తగా నారును కొనుగోలు చేసుకోవాలి. లేదంటే ఒక పసలు నష్టపోవాల్సి వస్తుంది. నర్సరీ వాళ్లు నకిలీ నారు పెంచితే నష్టపోయిన రైతులు ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. నర్సరీ నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన కూరగాయలు, పూల మొక్కల నార్లను పెంచాలి. అలాకాకుండా ఎదుగుదల లేని మొక్కలను, కల్తీ నారు ను రైతులకు అంటగడితే జైలు కెళ్లాల్సిందే. రైతులకు నారుపోసే సమయం లేక ఎక్కువగా నర్సరీలపైనే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో నర్సరీలు ఎక్కువగా వెలుస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం 7 నర్సరీలకే రిజిస్ట్రేషన్‌ ఉంది. కానీ, అంతకు రెట్టింపు ఉంటాయి. వీరందరూ నాణ్యతతో కూడిన మొక్కలనే విక్రయిస్తున్నారా? అనేది ప్రశ్నార్థకమే.

నిబంధనలు పాటించాల్సిందే..

గతంలో నర్సరీల్లో అమ్మిన మిర్చి నారు కాపునకు రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొందరు రైతులు మందులు, వేసి కూలీలను పెట్టి కలుపు తీయించి వేచి చూసినా కూడా ఎలాంటి ప్రతిఫలం లేకపోవడంతో ఒక పసలు పంటతో పాటు పెట్టుబడి నష్టపోయారు. నర్సరీ నిర్వాహకులు నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనేది ఉద్యానశాఖ అధికారులు పర్యవేక్షించాలి. నారు ఎవరికి అమ్మారో  వారి వివరాలు కూడా నర్సరీ నిర్వాహకులు రిజిస్టర్‌లో న మోదు చేసి అధికారులు వచ్చినప్పుడు చూపించాలి. 

రైతుల వివరాలు నమోదు చేయాలి

నర్సరీ నిర్వాహకులు జిల్లా ఉద్యానశాఖ కార్యాలయంలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. రోజువారీ విక్రయాలకు సంబంధించి రికార్డులు నిర్వహించాలి. రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తుదారు ఫొటో, నర్సరీ పూర్తి పేరు, చిరునామా, నర్సరీ ఏర్పాటు చేసే భూమి పత్రాలు, లీజు అగ్రిమెంట్‌, లే అవుట్‌ మ్యాపు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, నర్సరీలోని వసతులు, భూసార పరీక్షలు, నీటి నాణ్యతా పరీక్షలు, తదితర వివరాలను తప్పనిసరిగా ఉద్యానశాఖ అధికారులకు అందించాలి. రికార్డులో కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి పంపిణీ వివరాలు, లాట్‌ నెంబర్‌, మొలక శాతం, విత్తనం ప్యాకింగ్‌ తేదీ, విత్తనం వాడే ముగింపు తేదీలను పొందుపరచాలి. నారును పెంచేందుకు వాడే ట్రేలు, కొబ్బరి పీచు, నారు పెరుగుదలకు పిచికారీ చేసే రసాయనిక ఎరువులు,  క్రిమిసంహారక మందులు ఏమేమి ఉపయోగించారో? రికార్డులో నమోదు చేయాలి. నారు విత్తనం ఏ రకం, నారు పోసిన తేదీ, తదితర వివరాలతో పాటు కంపెనీ పేరును నర్సరీలో బోర్డు ఏర్పాటు చేసి దానిపై రాయాలి.

నిబంధనలు పాటించకుంటే చర్యలు

జిల్లాలో నర్సరీ నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. విత్తనాలను ఎక్కడి నుంచి సేకరించారో వాటి వివరాలు రైతులకు తెలపాలి. నర్సరీ ట్రేలో విత్తిన తేదీతో పాటు నారు మొక్కలను రైతులకు అమ్మిన తేదీని రికార్డుల్లో పొందుపర్చాలి. కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలి. ఎక్కువ ధరకు అమ్మకూడదు. రైతులు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. నర్సరీ ద్వారం వద్ద ఆ నర్సరీ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి అక్కడ లభించే నారు వివరాలు పేర్కొనాలి. నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయి.   


logo