ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 15, 2020 , 00:49:31

హరితహారానికి సన్నద్ధం

హరితహారానికి సన్నద్ధం

కార్పొరేషన్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఆరో విడుత కార్యక్రమానికి మున్సిపాలిటీల్లో సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పట్టణాలకు హరిత శోభ వచ్చేలా చర్యలు తీసుకోవాలని శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచనలు చేయడంతో ఆ దిశగా అధికారులు దృష్టిసారించారు. ఇప్పటికే జిల్లాలోని కరీంనగర్‌ నగరపాలక సంస్థతో పాటు జమ్మికుంట, హుజూరాబాద్‌, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో మొక్కలు నాటేందుకు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలో ఈనెల 20వ తేదీ నుంచి హారితహారం కార్యక్రమం చేపట్టనున్నారు.  మున్సిపాలిటీల్లో బడ్జెట్‌లో 10 శాతం హరితహారం పనులకు కేటాయించాలని కొత్త మున్సిపల్‌ చట్టంలో పేర్కొనడంతో ఆ మేరకు నిధులు కేటాయించారు.

అలాగే, కొత్త చట్టం ప్రకారం నాటిన మొక్కల్లో 85 శాతం సంరక్షించే బాధ్యత ప్రజాప్రతినిధులు, ఆయా డివిజన్ల, వార్డుల ప్రత్యేకాధికారులపై  ఉండడంతో ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో నగరపాలక సంస్థ పరిధిలో ఆయా డివిజన్ల వారీగా ఏఏ మొక్కలు అవసరం అవుతాయన్న విషయంలో సర్వే చేయించి లెక్కలు తీసుకున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 6.12 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించారు. దీని ప్రకారం వారి పరిధిలో ఎక్కడెక్కడ బ్లాక్‌ ప్లాంటేషన్‌ చేసే అవకాశం ఉందన్న విషయంపై అధికారులు స్థలాలు గుర్తించారు. అన్ని మున్సిపాలిటీల్లో సుమారు 40 శాతం మొక్కలు ఇంటింటికీ పంపిణీ చేసి, మిగతా వాటిని ప్రభుత్వ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా నాటేందుకు మున్సిపల్‌ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

మున్సిపాలిటీల వారీగా లక్ష్యం..

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో 6 లక్షలకు పైగా మొక్కలు నాటాల్సి ఉండగా... కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలోనే 4.30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించారు. హుజూరాబాద్‌లో 57 వేలకు పైగా, జమ్మికుంటలో 30 వేలు,  చొప్పదండిలో 58 వేలకు పైగా, కొత్తపల్లిలో 37 వేలకు పైగా మొక్కలు నాటాలని నిర్దేశించారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థలో ఇప్పటికే డివిజన్ల వారీగా ఏఏ మొక్కలు కావాలన్న విషయంలో సర్వే చేసి, నివేదికలు అందజేశారు. ఈ మేరకు కడెం నుంచి ప్రత్యేకంగా ఎత్తైనా మొక్కలు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు స్థానికంగా నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కలను తీసుకోనున్నారు. కాగా, ప్రతి ఇంటికి మూడు నుంచి 5 మొక్కలు అందించి వాటిని నాటడంతో పాటు సంరక్షించే విధంగా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీధుల్లో నాటే మొక్కలకు జియో ట్యాగింగ్‌ చేయడంతో పాటు ఏ ఇంటి ముందు నాటామో ఆ ఇంటి నంబర్‌ నమోదు చేసి, యజమానిని బాధ్యున్ని చేసే విధంగా బల్దియా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు ఎలాంటి మొక్కలు నాటాలన్న విషయంలో వారి నుంచే సూచనలు తీసుకొని, తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. 

పకడ్బందీగా ప్రణాళికలు

కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం నాటిన మొక్కల్లో 85 శాతం సంరక్షించకుంటే చర్యలు తీసుకునే నిబంధన ఉండడంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఏ డివిజన్లలో ఎన్ని మొక్కలు నాటుతున్నారన్న విషయంలోనూ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకుంటున్నారు. మొక్కలకు ట్రీగార్డులు కూడా అందించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. సంబంధిత కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ ఏరియాల్లో నాటే మొక్కల విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. కరీంనగర పాలక సంస్థ పరిధిలోని శివారు డివిజన్లలో పెద్దమొత్తంలో ప్రభుత్వ స్థలాలు ఉండడంతో ఈసారి ఆయా ప్రాంతాల్లో బ్లాక్‌ ప్లాంటేషన్‌ చేసేందుకు అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. బ్లాక్‌ ప్లాంటేషన్‌కు కంచె, నీటి వసతి ఏర్పాటు చేయనున్నారు. 

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షిస్తాం

నగరంలో హరితహారం లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించాం.  నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా చర్యలు తీసుకుంటాం. అవసరమున్న ప్రాంతాల్లో మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేస్తాం.  ప్రత్యేక ట్యాంకర్లను ఏర్పాటు చేసి, మొక్కలకు నీళ్లు పడుతం. బ్లాక్‌ ప్లాంటేషన్‌ చేసే ప్రాంతాల్లో మొక్కలు సక్రమంగా ఎదిగేందుకు సంబంధిత అధికారులకు బాధ్యతలు అప్పగించి, పనులు చేయిస్తాం. ఈసారి నాటిన మొక్కల్లో అత్యధికంగా బతికేలా చర్యలు తీసుకుంటం. 
  - వై సునీల్‌రావు, మేయర్‌, కరీంనగర్‌


logo