ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 15, 2020 , 00:44:27

పంట ప్రణాళిక సిద్ధం

పంట ప్రణాళిక సిద్ధం

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ‘ఇన్నాళ్లూ వానలపై ఆధారపడి అంచనాలేని సాగు చేశాం.. కానీ ఇప్పుడు ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లున్నాయి.. బోర్లు, బావుల్లో సమృద్ధిగా జలాలు ఉన్నాయి.. 24 గంటల కరెంట్‌ ఉంది.. ఈ పరిస్థితుల్లో అన్నదాత మూస ధోరణితో వెళ్తే నిండా మునిగే అవకాశం ఉంటుంది.. అందుకే సర్కారు నియంత్రిత సాగు విధానాన్ని ప్రవేశపెట్టింది.. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాం. రైతుల నుంచి సానుకూలత కనిపించింది. ఈ యేడు ఎలాంటి పంటలు వేయాలో నిర్ణయం జరిగింది. ఈ పద్ధతిలోనే పంటలు పండిస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది’ అని వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్‌ స్పష్టం చేశారు. వానకాలం పంటల సాగు ప్రారంభమవుతున్న తరుణంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

నమస్తే : పంటల ప్రణాళిక ఏవిధంగా ఉంది ?

డీఏవో : ఈసారి ప్రభుత్వ సూచనల మేరకు సన్న రకాలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని నిర్ణయించాం. మొత్తంగా 3,41,018 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశాం. ఇందులో ప్రధానంగా 2,22,199 ఎకరాల్లో వరి సాగుకు అవకాశం ఉంది. ఇందులో 25 నుంచి 30 వేల ఎకరాల్లో విత్తనోత్పత్తి జరుగవచ్చు. 40 శాతం వరకు అంటే సుమారు 82 వేల ఎకరాల్లో సన్న రకం (ఫైన్‌ క్వాలిటీ) సాగుకు అంచనా వేశాం. ఈ రకాలను 60 నుంచి 70 శాతం హుజూరాబాద్‌, మానకొండూర్‌, శంకరపట్నం, వీణవంక తదితర ఆయకట్టు ప్రాంతాల్లో ప్రోత్సహిస్తున్నాం. చొప్పదండి, రామడుగు, గంగాధర, గన్నేరువరం, చిగురుమామిడి, తిమ్మాపూర్‌ తదితర మండలాల్లో ముతక రకాలను వేసేలా సూక్ష్మ ప్రణాళికను సిద్ధం చేశాం. గ్రామాలు, ఎకరాల వారిగా లెక్కలు వేశాం. 

 సన్న రకాల నార్లు పోయించడంలో ఎంత వరకు సఫలీకృతులయ్యారు?

 ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో చాలా మంది రోహిణీ కార్తెకు ముందే సన్న రకం వరి నార్లు పోసుకున్నారు. హుజూరాబాద్‌, శంకరపట్నం మండలాల్లో ఇప్పటికే 360 ఎకరాల్లో నాట్లు వేసుకున్నారు. ఇది మంచి పరిణామం. దీర్ఘకాలిక రకాలు సాగు చేసుకోవాలనుకునే రైతులు ఇప్పుడే నార్లు పోసుకోవాలి. 150 రోజులకు పంట చేతికి వస్తుంది. ఇక 130- 135 రోజుల్లో చేతికొచ్చే మధ్య రకానికి జూన్‌ చివరి వారంలో, 120 నుంచి 125 రోజుల్లో వచ్చే పంటకు జూలై మొదటి వారంలో నార్లు పోసుకోవాలి. సన్న రకాల్లో బీపీటీకి మార్కెట్లో డిమాండ్‌ ఉంది. హెచ్‌ఎంటీ, సోనా, జై శ్రీరాం, కేఎన్‌ఎం- 733తో పాటు మరిన్ని సన్నాల, ప్రైవేట్‌ వెరైటీలు జిల్లాలో అనువైనవి. ముత రకాల్లో ఎంటీయూ 1010, కేఎన్‌ఎం 118, జేజీఎల్‌ 2423 లాంటి రకాలను జిల్లాలో ప్రోత్సహిస్తున్నాం. మృగశిర కార్తె మొదలుకుని ఆరుద్ర వరకు నార్లు పోసుకోవచ్చు..

సన్నరకం విత్తనాలు అందుబాటులో ఉన్నాయా ?

 అవసరానికి మించి ఉన్నాయి. తెలంగాణ సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా సింగిల్‌విండోలు, ఆగ్రో సెంటర్ల ద్వారా ఇప్పటికే గ్రామాలకు తరలించాం. కందులు, పెసళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈసారి పచ్చిరొట్ట విపరీతంగా విక్రయం జరిగింది. జనుము, జీలుగ కలిపి 4,700 క్వింటాళ్లు విక్రయించాం. గతేడాది పచ్చిరొట్ట విత్తనాలు కేవలం 2, 200 క్వింటాళ్లు మాత్రమే అమ్మాం. పత్తి విత్తనాలు అవసరానికి మించి ప్రైవేట్‌ డీలర్ల వద్ద  ఉన్నాయి.

సన్నరకాల సాగుతో రైతులకు ఎలాంటి 

సాంకేతిక సలహాలు ఇవ్వబోతున్నారు..?

సన్నరకాలు సాగు చేసే రైతుల వెన్నంటే ఉంటాం. ఈ రకం వరి పండించే అనుభవజ్ఞులైన రైతులు జిల్లాలో చాలా మంది ఉన్నారు. కొత్తగా సాగు చేసే వారికి తెగుళ్లు, సాంకేతిక సలహాల కోసం వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారు. రైతు వారీగా పొలాలను పరిశీలించి తగిన సలహాలు, సూచనలు చేస్తుంటారు. మెళకువలు పాటించేలా చూస్తాం. సన్న రకాల దిగుబడి తక్కువ వస్తుందనేది కేవలం అపోహ. సస్యరక్షణ చర్యలు తీసుకుంటే ఎకరాకు 50 నుంచి 55 బస్తాల ధాన్యం వస్తుంది.  

 ఇతర పంటల సాగును ఎలా ప్రోత్సహిస్తున్నారు.?

 ఈ సీజన్‌లో వరి తర్వాత పత్తికి ప్రాధాన్యమిస్తున్నాం. గత వానకాలంలో 90,840 ఎకరాల్లో పత్తి సాగయింది. ఇప్పుడు 1.01 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా. ఈ సీజన్‌లో మక్క సాగు చేయడం లేదు. ఎక్కడైనా ఫౌల్ట్రీ రైతులు, వాళ్ల కోసం మక్క వేసుకుంటామంటే అభ్యంతరం లేదు. స్వీట్‌కార్న్‌ కూడా పండించుకోవచ్చు. ఇక నుంచి ప్రతి రెండో సీజన్‌లోనే మక్క సాగుచేయాలని సర్కారు నిర్ణయించింది. ఈసారి కందిని ప్రోత్సహిస్తున్నాం. గతేడాది గంగాధర, రామడుగు, గన్నేరువరం, చిగురుమామిడి, తిమ్మాపూర్‌ మండలాల రైతులు పత్తిలో అంతర పంటగా సాగు చేసి మంచి లాభాలు పొందారు. ఎకరా అంతర పంటకు రూ.10 వేల దాకా వచ్చాయి. కందులను మద్దతు ధరకు కొంటాం. పెసర్లను సైతం ప్రోత్సహిస్తాం.

 నకిలీ పత్తి విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

గతంతో పోల్చితే నకిలీ, లూజ్‌ విత్తనాల బెడద జిల్లాలో చాలా తగ్గింది. ఇలాంటి విత్తనాలు విక్రయించే వారిపై క్రిమినల్‌ కేసులతో పాటు పీడీ యాక్ట్‌ కింద కేసులు పెడుతున్నాం. ఈ సీజన్‌లోనూ ఒకట్రెండు చోట్ల వెలుగు చూసినా తక్కువ. అయినా శాఖా పరంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేశాం. ఇవి దుకాణాలు, సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో చివరికి ట్రాన్స్‌పోర్టు ఆఫీసుల్లో తనిఖీ చేస్తున్నాయి. అనుమానం వచ్చిన పార్సిల్స్‌పై తమకు సమాచారం ఇవ్వకుండా డెలివరీ చేయవద్దని ఆదేశాలు జారీ చేశాం. 

 ఎరువుల పరిస్థితి ఎలా ఉంది..?

సీజన్‌కు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అవసరాన్ని బట్టి తెప్పిస్తున్నాం. 45,800 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉంటే 15 వేల మెట్రిక్‌ టన్నులు ఉంది. 9,500 మెట్రిక్‌ టన్నుల డీఏపీకి 5,673మెట్రిక్‌ టన్నులు, 12,800 మెట్రిక్‌ టన్నుల ఎంఓపీకి 1,232 మెట్రిక్‌ టన్నులు, 21,500 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులకు 28,167 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంది. 

పథకాలు రైతులకు ఎలా అందుతున్నాయి..?

 పథకాల ఫలాలను అర్హులందరికీ అందేలా చూస్తున్నాం. ఈసారి రుణమాఫీ కింద రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులను గుర్తించాం. జిల్లాలో 1,00,352 మంది అర్హులు ఉన్నారు. రూ.25 వేల లోపు రుణాలు తీసుకున్న 6,702 మంది రుణాలకు సంబంధించి రూ.10.46 కోట్లను ఏక మొత్తంలో మాఫీ చేసింది. రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 24 బ్యాంకులకు సంబంధించిన 310 శాఖల్లో 99.85 శాతం మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. 154 మందికి ఆధార్‌ లింక్‌ లేని కారణంగా జమ చేయలేదు. సర్కారు ఆదేశాల మేరకు రైతు బంధు అకౌంట్లు అప్‌డేట్‌ చేస్తున్నాం. ఇప్పటి వరకు 75.21 శాతం రైతుల ఖాతాలు పరిశీలించాం. 1,48,785 మంది రైతుల ఖాతాలు అప్‌డేట్‌ చేశాం. పట్టాదారు పాసు పుస్తకాలు, బ్యాంకు ఖాతాల్లో తేడాలు ఉంటే సరి చేస్తున్నాం. ఈ యేడు రాయితీ విత్తనాలు ఇవ్వడం లేదు.. 

 నియంత్రిత సాగుతో కలిగే ప్రయోజనాలు?

 కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత జిల్లాలో సాగునీటి వసతి పెరిగింది. దీంతో ఏ పంట సాగు చేసినా చేతికి వస్తుందనే నమ్మకం రైతుల్లో కలుగుతోంది. ఒకే రకమైన పంటల సాగుతో నష్టాలు వచ్చే అవకాశం ఉన్నది. దొడ్డు రకం ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. అందుకే సన్నాల వైపు మళ్లిస్తున్నాం. దొడ్డు రకాలను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసే మనం, మన అవసరాల కనుగుణంగా ఇతర రాష్ర్టాల నుంచి సన్న రకాలు దిగుబడి చేసుకుంటున్నాం. సన్నరకాల సాగుతో మన తినే గాసాన్ని మనమే పండించుకోవచ్చు. ఈ నేపథ్యంలో నియంత్రిత విధానంలో పంటలు సాగును ప్రోత్సహిస్తున్నాం. 

 ఆత్మ నిర్భర భారత్‌ గురించి వివరించండి..?

 ఇదీ కేంద్రం అమలు చేస్తున్న పథకం. ఇప్పటికే రుణాలు తీసుకుని కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఉన్న రైతులకు 10 శాతం అదనంగా రుణాలు ఇస్తున్నారు. బ్యాంకర్లు పూర్తిగా సహకరించాలని ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలో 1.05 లక్షల మంది రైతులు సుమారు రూ.1,400 కోట్లు పంట రుణాలు తీసుకున్నారు. తీసుకున్న రుణాలు చెల్లించకున్నా ఎలాంటి షరతులు లేకుండా వీరికి తిరిగి 10 శాతం రుణాన్ని అందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన జిల్లా రైతులకు రూ.140 కోట్లు పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయ యంత్రాలు, పరికరాల కొనుగోలుకు కూడా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ట్రాక్టర్లు, హార్వెష్టర్లు వంటి భారీ యంత్రాలతోపాటు చిన్న చిన్న పరికరాలకు కూడా రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది.logo