గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Jun 14, 2020 , 00:55:02

ఆరో విడుత.. మన ఊరి ‘చింత’

ఆరో విడుత.. మన ఊరి ‘చింత’

ఇంటి ముందో.. వెనుకాలో చెట్టు   

ఎన్నో రకాలుగా ఉపయోగం   

‘పులుపు’తో రుచులెన్నో..

నాటి తరానికి జ్ఞాపకాలెన్నో.. 

ఔషధ గుణాలు మరెన్నో.. 

నేడు అక్కడక్కడే చెట్లు

పెంపకంపై దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కారు   

‘హరితహారం’లో కోటి మొక్కలు నాటాలని నిర్ణయం

చింతచెట్టు ఫాబేసీ కుటుంబంలోని సిసాల్పినాయిడే ఉప కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం టామరిండస్‌ ఇండికా. చింత భారత దేశపు ఖర్జూరాగా ప్రసిద్ధి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాలు చింతకు అనుకూలం. మన రాష్ట్రం అనువైనది. ఎర్రనేలల్లో గింజ పడితే చాలు, మొక్క మొలుస్తుంది. పెరుగుతుంది. మొక్కలను కూడా నాటి పెంచవచ్చు. చింతచెట్టు జీవిత కాలం దాదాపు 200 ఏళ్లు. ఇది చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ చెట్టు ఇంచుమించు 20మీటర్ల ఎత్తు పెరుగుతుంది. వేసవి కాలంలో పచ్చగా చిగురిస్తుంది. చింతచెట్లు నాడు ఊళ్లల్ల ఎక్కడ చూసినా పెద్దసంఖ్యలో కనిపించేవి. ఇంటి ముందో వెనుకాలో ఉండేవి. బాటలకిరువైపులా దర్శనమిచ్చేవి. పెద్దపెద్ద వృక్షాలను తలపించేవి. నీడతోపాటు చల్లని గాలినిచ్చేవి. ఊళ్లోకి వచ్చేవారికి ద్వారపాలకుల్లా స్వాగతం పలుకుతూ కనిపించేవి. చెట్ల కొమ్మలు కిందికి వంగి.. భూమిని తాకేలా ఉండేవి. ఎండకాలం వచ్చిందంటే చాలు.. పిల్లలంతా కోతికొమ్మొచ్చి, రేస్‌ ఆటలు ఆడుకునేటోళ్లు. కొమ్మలను పట్టుకుని ఊగేటోళ్లు. చిన్నా పెద్ద చెట్టు కింద, ముచ్చట్లు పెట్టుకునేటోళ్లు. పంచాయితీలు చేసుకునేటోళ్లు. ఎండపూట ఎడ్లను, పశువులను కట్టేసుకునేటోళ్లు. పగటి పూట చల్లని గాలికి నులక మంచాలు వేసుకుని పడుకునేటోళ్లు. చింత గింజలతో అష్టాచెమ్మా, పులి, మేక ఆటలు ఆడుకునేటోళ్లు. పెనం మీద వేయించిన గింజలు తినెటోళ్లు. చిన్నపిల్లలు చింతగింజలు సేకరించి, అమ్ముకునేవాళ్లు. చింతచెట్టు కింద చదువుకున్నారు. చింత బరిగెతో దెబ్బలు కూడా తిన్నారు. ఆ‘పాత’ జ్ఞాపకాలెన్నో..  - కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ జమ్మికుంట

పులుపు రుచులెన్నో..

చింతకాయ అనే పేరువింటేనే చాలు నోరూరుతది. మనకు తెలియకుండానే లాలాజలం నాలుకమీదకు వస్తది. ఎండకాలంలో వచ్చే చింత చిగురును తెంపుకుని తింటారు. చిగురుతో తొక్కులు నూరుతారు. లేదా వరుగుల్లో (ఎండబెట్టి వాడుకునే కూరగాయలు, చేపలు, రొయ్యలు, తదితర) వేసుకుని వండుకుంటారు. కాయతోపాటు పండుతో తొక్కు నూరుతారు. వేడుకల్లో చారు తయారు చేస్తారు. సాంబారు, చారు, పులిహోరల్లో చింతపండు రసాన్ని వాడుతుంటారు. పచ్చికాయతో పచ్చిపులుసు, పులిహోర కూడా చేస్తారు. ఇంకా దప్పుడం కూడా పెడుతారు. ఎండిన కాయను కొట్టి, ఇండ్లల్లో నిల్వ చేస్తారు. సంవత్సరం పొడవునా వాడుతారు. ఇప్పుడు ఇళ్లల్లో వండుకు తినే గిన్నెలను, ప్లేట్లను సబ్బులతో రుద్దుతున్నారు. కానీ, నాడు చింత పిప్పితో కంచు, రాగి పాత్రలను కడిగితే మెరిసిపోయేవి. ఇదంతా నేటి తరంవాళ్లకు తెలియదు. కానీ, 30ఏళ్ల పైబడినోళ్లందరికీ ఇవన్నీ పులుపు గుర్తులే.

ఎన్నో ఔషధ గుణాలు.. 

చింతలో అనేక ఔషధ గుణాలున్నాయి. చింతపండు శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. సిట్రిక్‌ యాసిడ్‌(పులుపు) గుణాలున్న చింతలో ప్రతి భాగం ఉపయోగపడుతుంది. చింతాకు టీతో మలేరియా జ్వరం మాయమవుతుంది. తేన్పులు, వికారానికి పనిచేస్తుంది. ఆకలి పెరగడం, సులువుగా జీర్ణమ వడం, రక్తహీనత, కామెర్లు, కీళ్ల వాపు, మూత్రకోశాలు వంటి రోగాలను పోగొడుతుంది. గింజల పొడి, పండు గుజ్జు, బెరడును అనేక ఆయుర్వేదం, హోమియోపతి మందుల్లో, టానిక్‌గా, శీతలపానీయాల్లో ఉపయోగిస్తు న్నారు. ముఖ్యంగా ఏ, సీ విటమిన్లతోపాటు ఐరన్‌, తదితర విటమిన్లను అందిస్తుంది. విటమిన్‌ ‘సీ’ చర్మ రోగాలు, దద్దుర్లు, దురదల ను నివారి స్తుంది. పైల్స్‌ ఉన్న వారికి కూడా చింతచిగురు బాగా పని చేస్తుంది. చెడు కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్ప త్తికి దోహదపడు తుంది. క్యాన్సర్‌ రాకుండా చూసే ఔషధ గుణాలు ఉన్నాయి.చెట్టు కర్రను వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు. చింతను అనేక దేశాల్లో మందుల తయారీలో వాడుతున్నారు. తియ్యటి చింతకాయతో జ్యూస్‌లు తయారు చేస్తున్నారు. పులుపు చింతకాయ పచ్చళ్లు పెట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆర్థికంగా ఎదుగుతున్న సంస్థలు ఎన్నో ఉన్నాయి. 

బతుకుదెరువు.. 

చింతచెట్టు కొన్ని వృత్తుల వారికి బతుకుదెరువుగా ఉండేది. ఎండకాలం ఉపాధి దొరికేది. చింత చిగురు, చింత కాయను తెంపి, మార్కెట్లో అమ్ముకునేవాళ్లు. బాటల వెంట ఉన్నవాటిని చింతచెట్టు కాయలను రాలకొట్టేవాళ్లు. కింద పడిన వాటిని ఏరుకుని ఇళ్లకు తీసుకుని పోయేవాళ్లు. కాయను ఎండబెట్టిన తర్వాత కొట్టేవాళ్లు. చింత పండును, గింజలను వేరు చేసి అమ్ముకుని జీవనం సాగించేవాళ్లు. అంతేకాకుండా డబ్బులు ఇస్తే ఇళ్ల ముందుండే చింతచెట్టు కాయను దులిపేవాళ్లు. వేసవిలో ఏ ఇంటికి వెళ్లినా వృద్ధులు, మహిళలు చింతకాయను కొడుతూ కనిపించేవాళ్లు. 30ఏళ్ల క్రితం చెట్టు దులిపినందుకు 10 నుంచి 30 తీసుకునేవాళ్లు. లేదంటే యజమానులకు ఇంత అని ఇచ్చి, చెట్లను గుత్తకు తీసుకునే వాళ్లు. కాయ దులిపితే ఒక్కో చెట్టుకు నాలుగైదు క్వింటాళ్లు అయ్యేది. కాయ కొట్టుకుని చింత పండును విక్రయించేవాళ్లు. మార్కెట్లో చింతకాయ 80 నుంచి 100, చింతపండు 150కిపైగా పలుకుతున్నది.  

హరితహారంలో పెంపకానికి ప్రాధాన్యం

ఓ ఇరవైఏళ్ల క్రితం వరకు తెలంగాణ పల్లెల్లో ఎక్కడ చూసినా చింత చెట్లు విరివిగా కనిపించేవి. ఏ ఇంట చూసినా పుష్కలమైన చింత పండు ఉండేది. కానీ, గడిచిన పదేళ్లలో చెట్ల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. ఇంటి వద్ద ఉంటే మంచిది కాదన్న నమ్మకంతో కొందరు, నగరీకరణ పెరుగుతున్న నేపథ్యంలో మరికొందరు చెట్లను నరుకుతున్నట్లు కనిపిస్తున్నది. ఫలితంగా చింతపండుకు కరువొచ్చింది. ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలకు అవసరమైన ఉత్పత్తులను పెంచే విధంగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ఈ నెల 20 నుంచి చేపట్టే ఆరోవిడుత హరితహారంలో ఆక్సిజన్‌ ఎక్కువగా విడుదల చేసే వేప, రావితోపాటు కోటి చింతమొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇస్తున్నది. ఇప్పటికే ఊరూరా ఏర్పాటు చేసిన నర్సరీల్లో పెద్దసంఖ్యలో ఈ మొక్కలను పెంచుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్‌ జిల్లాలో 10లక్షలకుపైగా, జగిత్యాలలో 50వేలు, పెద్దపల్లి జిల్లాలో 15లక్షలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5లక్షలు మొక్కలు నాటనున్నారు.

చెట్లను పెంచాలి.. 

చింతను దేశ ఖర్జూరాగా పిలుస్తారు. ఆరోగ్యానికి మంచిది. ఈ చెట్టుకు చాలా ఔషధ గుణా లున్నాయి. మందుల తయారీలో వాడు తున్నారు. చింత ఆకు, పూత, కాయ, పండు, గింజలకు మార్కెట్లో డిమాండ్‌ ఉంది. ప్రభుత్వం చెట్లను పెంచాలని పిలుపునిస్తున్నది. అందరూ చింత మొక్కలను నాటాలి. వాటిని సంరక్షించాలి. పంటగా కూడా సాగు చేయాలి. మొక్కలను పెంచడంతో పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.- వెంకటేశ్వర్‌రావు, కేవీకే శాస్త్రవేత్త అండ్‌ హెడ్‌(జమ్మికుంట)

చింత బరిగెలతో బుద్ధులు.. 

నాడు బళ్లకు ఎక్కువగా తరగతి గదులు లేకుంటుండె. ఊళ్లల్ల చింతలెక్కువ ఉండేటియి. చల్లటి గాలికి చెట్ల కింద పిల్లలను కూర్చోబెట్టి, చదువు చెప్పెటోళ్లం. చదువులో వెనుకబడిన పిల్లలకు చింత బరిగెలతో బుద్ధులు చెప్పెటోళ్లం. చింతకాయ వట్టిగనే గ్రామస్తులు పెట్టెటోళ్లు. చింతచిగురు తెంపి ఇచ్చెటోళ్లు. ఆ రోజులే వేరు. మళ్లీ రావాలి. ప్రభుత్వం చింతలు పెంచాలంటోంది. అది జరగాలి. పచ్చని చెట్లు ఊళ్లల్ల కనిపించాలి.    

- కంభంపాటి ప్రభాకర్‌, విశ్రాంత ఉపాధ్యాయుడు

మేమే చెట్లు దులిపెటోళ్లం..

ఎన్కట చింతచెట్లు మేమే ఎక్కెటోళ్లం. ఎండకాలం వచ్చిందంటే చాలు.. మా కుటుంబాలతో ఊళ్లల్లకు పోయెటోళ్లం. బాటలపొంటి చింతచెట్లుంటే అవి మావే అనుకునెటోళ్లం. ఆ చెట్లను మేమే దులుపుకునెటోళ్లం. ఎక్కడైనా ఇళ్ల ముందుంటే పైసలు తీసుకుని దులుపుడు పని పెట్టుకునెటోళ్లం. ఒక్క చింతకు కాసిన కాయను బట్టి దులిపితే 10 నుంచి 30 వరకు ఇచ్చెటోళ్లు. కింద పడిన కాయను ఏరి సంచులల్ల నింపి ఇచ్చెటోళ్లం. గింజలను కూడా అమ్ముకునెటోళ్లం. అలా ఎండకాలమంతా చింత దులిపి ఉపాధి పొందెటోళ్లం. ఎంత దూరమైనా సైకిళ్ల మీద పోయి వస్తుండె. బాగా దూరమై పొద్దుపోతే బువ్వ తిని అక్కడే ఉండెటోళ్లం.             

- నెల్లి రాజయ్య, ముదిరాజ్‌ (రామన్నపల్లి)


logo