బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 13, 2020 , 01:50:19

దొంగ దీక్షలు.. డొల్ల మాటలు..

దొంగ దీక్షలు.. డొల్ల మాటలు..

 •  కాంగ్రెస్‌ నాయకుల్లారా ఎవరిని మోసం చేసేందుకీ కపట నాటకాలు?
 •  ఎగువమానేరు ప్రాజెక్టుకు అన్యాయం చేసిందెవరు? 
 •  పైలాన్‌ ఆవిష్కరించి పత్తా లేకుండా పోయిందెవరు? 
 •  60 ఏళ్లలో మీ ప్రభుత్వం చేసిందేమిటి? n మధ్యమానేరుపై మొసలికన్నీరు కార్చలేదా? 
 •  సిరిసిల్లలో అరవైఏళ్ల అభివృద్ధి కనిపించడం లేదా? 
 •  కళ్లముందు ఫలాలు కనిపిస్తుంటే మీకెందుకు కళ్ల మంట 
 •  ముందుగా సమాధానాలు చెప్పండి
 • సిరిసిల్ల ప్రజల అల్టిమేటం

కాంగ్రెస్‌ నాయకుల్లారా మేము గుర్తున్నామా? సిరిసిల్ల ప్రజలం. ఎగువమానేరు వద్దకు జలదీక్ష పేరుతో వస్తున్న మీరు ముందుగా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. మీ పాలనలో మా ప్రాంతంలో సాగు, తాగునీటి గోస తీర్చడానికి ఏనాడైనా చిత్తశుద్ధితో పనిచేశారా? మీ హయాంలోనే కదా.. నెర్రెలు బారిన నేలలు.. అడుగంటిన భూగర్భ జలాలు.. చుక్కనీరు లేక సాగు చేయలేక అప్పులపాలై మా జీవితాలు అంగడి కాలేదా? ఎటు చూసిన ఆత్మహత్యలు జరగలేదా..? ప్రాణహిత చేవేళ్ల అంటూ గొప్ప గొప్ప మాటలు చెప్పారు. ఒక్క చెరువైనా నింపారా..? మా ఎగువమానేరు వద్ద పైలాన్‌ వేసినప్పుడు మేం సంబురపడ్డాం. మూడేళ్లలోనే నీరు తెస్తమనిజెప్పితే.. ఇక కష్టాలు దూరమవుతాయని అనుకున్నం. కానీ, ఏం జరిగింది? ఆరేండ్లు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. నామమాత్రపు పనులు చేసినట్లు నటించి, కంటికి కనిపించకుండా పోలేదా.. మీ పాలనలో పడని గోస ఏదైనా ఉందా..? కానీ, తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా తీరు మారింది. ఒక్కో ఊరు జలసిరులతో జలకాలాడుతున్నది. మండుటెండల్లో చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి. 60ఏళ్లుగా బీడు వడ్డ భూములు సస్యశ్యామలమవుతున్నాయి. ఆనాటి పాలనకు నేటి పాలనకు ఎంత తేడా కనిపిస్తున్నది. ఇవేకాదు., మా ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిపై మేం వేసే ప్రశ్నలకు మీరు నిజాయతీగా సమాధానం చెప్పి, జలదీక్ష చేయండి. 

సమాధానం చెప్పండి. 

 • ఆనాడు కరువుతో అల్లాడుతున్నా కనీసం చెరువులను బాగు చేయాలన్న ఆలోచన మీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు చేయలేదు. కానీ, కేటీఆర్‌ చొరవతో జిల్లాలోని 666 చిన్న నీటి చెరువుల్లో 335 చెరువులకు మరమ్మతులు పూర్తి చేయడమే కాదు, మిగిలిన వాటికి పనులు నడుస్తున్నా మీకు కనిపించడం లేదా..? 
 • చుక్కనీటికోసం అల్లాడుతున్నా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. జిల్లాకు అతి ముఖ్యమైన మానేరు, మూలవాగుల్లో నీటి నిల్వ చేయాలన్న కనీస ఆలోచన కాంగ్రెస్‌ చేయలేదు. కానీ, ఎగువమానేరు నుంచి మధ్యమానేరు వరకు 11 చెక్‌ డ్యాంలు, మూలవాగుపై 13 చెక్‌డ్యాంలను 155 కోట్లతో చేపట్టడానికి తెలంగాణ సర్కారు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే మర్రిమడ్లతోపాటు మరో రెండు ప్రాంతాల్లో పనులు ప్రారంభమైన తీరు మీ కండ్లకు కనపడడం లేదా..? 
 • జిల్లాలో 666 చెరువుల్లో 385 చెరువులను ఎల్లంపల్లి, శ్రీరాజరాజేశ్వర, కాళేశ్వరం ప్రాజెక్టు (ప్యాకేజీ 9,10,11,12) ద్వారా నింపడానికి ప్రణాళికలు సిద్ధం చేయడమే కాదు, ఇప్పటికే వందలాది చెరువులు నింపుతున్నది వాస్తవం కాదా? ఇది మా ప్రాంత ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నది కదా..?  
 • కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ- 9లో భాగంగా ఎగువమానేరును నింపే పనులు జరుగుతున్నా కనిపించడం లేదా? వచ్చే దసరా నాటికి నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నది కదా! ప్రపంచమంతా కనిపిస్తున్నా మీకు అగుపించడం లేదా? 

మధ్యమానేరు ప్రాజెక్టు..

 • ఫిబ్రవరి 2006 నుంచి 2014 జూన్‌ వరకు మధ్యమానేరు ప్రాజెక్టుపై మీరు కేవలం 838 కోట్లు వెచ్చిస్తే.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తదుపరి 1587 కోట్లు వెచ్చించి.. డిసెంబర్‌ 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసింది వాస్తవం కాదా..? 
 • నిజానికి 2009 మార్చి నాటికి పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు 2019 వరకు కొనసాగడానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా..? 
 • మీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తే.. తిరిగి టెండర్లు పిలువడానికి రెండేళ్ల సమయం తీసుకోలేదా? ఇది మీ జాప్యానికి నిలువెత్తు నిదర్శనం కాదా? 
 • 2012 ఏప్రిల్‌ 23న మధ్యమానేరు వద్ద భూమిపూజ చేసిన సందర్భంగా జరిగిన సభలో 2012 జూన్‌లోగా నిర్వాసితులకు అన్ని రకాల పరిహారం చెల్లిస్తామని అప్పటి రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన హామీ నిజం కాదా? మీ టెంటును కూల్చివేసింది వాస్తవం కాదా? అంత జరిగినా అక్కడ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా..? 
 • ఈ ప్రాజెక్టు ద్వారా 2,32,814 ఎకరాలకు కుడి, ఎడ మ కాలువల ద్వారా కరీంనగర్‌ వరంగల్‌ జిల్లాలకు నీ రు ఇవ్వాలని తెలిసినా.. నిర్లక్ష్యం చేసింది మీరే కదా..? 
 • తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వార్‌ఫుట్‌ మీద ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, ప్రస్తుతం వాటర్‌ హబ్‌గా మార్చింది మీకు తెలియదా..? 
 • వాటర్‌ హబ్‌గా మార్చడమేకాదు, ఈ ప్రాజెక్టు నుంచి ప్యాకేజీ -9 నుంచి 14 వర కు గల రిజర్వాయర్ల వరకు నీటిని పంపిస్తున్న ది కనిపించడంలేదా? దీని ద్వారా కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో 8,75,430 ఎకరాలకు నీరందించేందుకు చేస్తున్న పనులు మీకు కనిపించడం లేదా..? 
 • ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 466 గ్రామాలకు మిషన్‌ భగీరథ కింద నీరు ఇస్తున్న విషయం మీకు అగుపించడం లేదా..? 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ -9 

ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకం కింద 714 కోట్లతో మధ్యమానేరు జలాశయం నుంచి 6 టీఎంసీల నీటి ని 120రోజులపాటు ఎగువమానేరు జలాశయం వరకు ఎత్తిపోయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది మీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే కదా..? ఆ మేరకు ఎందుకు పని చేయలేకపోయారు? అక్కడక్కడా చిన్న చిన్న పనులు చేసి చేతులు దులుపుకున్నది వాస్తవం కాదా..? టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రాజెక్టు రీడిజైన్‌లో భాగంగా ఈ ప్రాంతానికి తాగు, సాగునీటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు నిర్ణయం తీసుకున్నది. ప్యాకేజీ -9 కింద 120 రోజుల్లో 11.635 టీఎంసీల నీటిని మధ్యమానేరు జలాశయం నుంచి ఎగువమానేరు జలాశయం వరకు ఎత్తిపోయాలని నిర్ణయించింది. దీంతోపాటు మల్కపేట జలాశయం సామర్థ్యం 0.35 టీఎంసీల నంచి 3 టీఎంసీలకు పెంచడమే కాదు, సర్జ్‌పూల్‌, పంపుహౌస్‌ల సామర్థ్యం పెంచింది మీరు గమనించలేదా? ప్యాకేజీ -9 పనులకు 911.32కోట్లు, మల్కపేట జలాశయానికి 553.10 కోట్లతో తెలంగాణ సర్కారు పరిపాలన మంజూరు చేసింది. దీని ద్వారా సిరిసిల్ల నియోజకవర్గంలో 86,150 (60వేల ఎకరాలు నూతన ఆయకట్టు, 26,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ) ఎకరాలకు సాగునీరు, ప్యాకేజీ -9 పరిధిలోకి రాని కోనరావుపేట, వీర్నపల్లి, మండలాల్లోని మెట్ట ప్రాంతాల్లో 10వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరు అందించేందుకు 166 కోట్లతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలు చేపట్టేందుకు పరిపాలన మంజూరునిచ్చిన మాట వాస్తవం కాదా? పూర్తయిన ఆడిట్‌ సొరంగం, అప్రోచ్‌ చానల్‌, 12.035 కిలోమీటర్ల ప్రధాన సొరంగం పనులు మీకు కనిపించడం లేదా..? అనుమానముంటే నిర్భయంగా వెళ్లి చూడండి. 24.921 కిలోమీటర్ల గ్రావిటీ కాలువల పనులు పూర్తి చేయడమే కాదు, లైనింగ్‌ పనులు వేగంగా జరుగుతున్నవి. అక్కడకు వెళ్లి చూస్తే పనులెలా నడుస్తున్నాయో మీకే అర్థమవుతుంది. అక్టోబర్‌ 2020 నాటికి ఈ పనులన్నీ పూర్తి చేసి ఎగువమానేరు జలాశయం నింపుతారన్న నమ్మకం మా ప్రాంత ప్రజలందరికీ ఉన్నది. ఎన్నో పనులు కళ్లముందు జరుగుతోంటే, ఇక మీరొచ్చి ఏంచేస్తారో చెప్పాలి? 

ప్యాకేజీ -10 

ఇల్లంతకుంట మండలంలో నిర్మాణమైన 3.5 టీఎంసీల సామర్థ్యం గల అన్నపూర్ణ రిజర్వాయర్‌ మీకు కనిపించడం లేదా? ఈ ప్రాజెక్టు ద్వారా సిరిసిల్ల జిల్లాలోని 35 చెరువులకు నీటిని నింపేందుకు పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే ఎనిమిది చెరువులకు నీళ్లు వచ్చింది మీరు చూడలేదా? స్థానికంగా ఉన్న మీ కాంగ్రెస్‌ నాయకులను అడిగితే చెబుతారు కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 11 కింద రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణమైంది. దీని ద్వారా సిరిసిల్ల జిల్లాలో 58 చెరువులను నింపేందుకు అనుసంధాన పనులు సాగుతున్నాయి. ఇప్పటికే 7 చెరువులకు నీళ్లొచ్చాయి. ఈ ప్యాకేజీ కింద ముస్తాబాద్‌ మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో 2,279 ఎకరాలు, ఇల్లంతకుంట మండలంలోని 11 గ్రామాల పరిధిలో 9,730 ఎకరాలకు, తంగళ్లపల్లి మండలంలోని 14 గ్రామాల పరిధిలో 21,375 ఎకరాల ఆయకట్టు మొత్తం 33, 384 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి పనులు జరుగుతున్నాయి కదా.. వేల కోట్లు పెట్టి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పనులు జరుగుతుంటే.. మీకు కనిపించడం లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 12 కింద కొమురవెల్లి మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణమైంది. దీని ద్వారా సిరిసిల్ల జిల్లాలోని 29 చెరువులకు నీళ్లు ఇవ్వడానికి పనులు జరుగుతున్నాయి. ఇందులో ముస్తాబాద్‌ మండలంలోని 11 గ్రామాల పరిధిలో 12,929 ఎకరాలు, గంభీరావుపేట మండలంలోని 5 గ్రామాల్లో9,047 ఎకరాలు మొత్తం 21,976 ఎకరాల ఆయకట్టుకు సస్యశ్యామలం కానుంది కదా.. 

చివరిగా ఒక్క మాట 

డొల్ల మాటలు మీరు వచ్చి చెప్పినా మేం నమ్మం. ఎందుకంటే గతంలో మీ పాలన చూశాం. ఇప్పుడు తెలంగాణ సర్కారు పనితీరు చూస్తున్నాం. చెప్పిన పనులన్నీ మా కళ్లముందే జరుగుతున్నాయి. ఫలాలు అందుతున్నాయి. తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే అప్పర్‌మానేరుకు గోదావరి నీళ్లు వస్తాయన్న నమ్మకం నూటికినూరు శాతం ఉంది. మా మంత్రి కేటీఆర్‌పై మాకు పూర్తి విశ్వాసం ఉంది. అసాధ్యం అనుకున్న ఎన్నో పనులను సుసాధ్యం చేసి చూపించిన కేటీఆర్‌కు ఎగువమానేరుకు నీళ్లు తేవడం పెద్ద లెక్క కాదు. అందుకే డొల్లమాటలు, దొంగదీక్షలు మానుకోవాలని చెబుతున్నాం. 

- ఇక ఉంటాం.  ఇట్లు సిరిసిల్ల ప్రజలు logo