శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 12, 2020 , 03:23:26

కరోనా చికిత్స ఇక ఇక్కడే..

కరోనా చికిత్స ఇక ఇక్కడే..

  • పాజిటివ్‌ కేసులకు జిల్లాల్లోనే వైద్యం
  • l ఏర్పాట్లు చేసిన వైద్య, ఆరోగ్య శాఖ
  • lప్రారంభమైన ఐసోలేషన్‌ వార్డులు
  • lనిర్ధారణ పరీక్షల కోసం కరీంనగర్‌లో 70 లక్షలతో వైరాలజీ ల్యాబ్‌
  • lత్వరలోనే అందుబాటులోకి సేవలు 
  • lపది మంది వైద్యులకు ప్రత్యేక శిక్షణ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై రాష్ట్ర సర్కారు నిరంతర యుద్ధం చేస్తున్నది. అందులో భాగంగా వైరస్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే, బాధితులకు రాష్ట్ర రాజధానిలో మెరుగైన వైద్యం అందిస్తూ భరోసానిస్తున్నది. అయితే లాక్‌డౌన్‌ సడలింపులతో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఎక్కడికక్కడ చికిత్స అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రంగంలోకి దిగిన వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగం జిల్లాల వారీగా అన్ని ఏర్పాట్లూ చేసింది. స్థానికంగానే ట్రీట్‌మెంట్‌ అందించేందుకు కరీంనగర్‌, జగిత్యాల, మెట్‌పల్లి, సిరిసిల్ల, గోదావరిఖని, సుల్తానాబాద్‌ ప్రభుత్వ దవాఖానల్లో ఐసోలేషన్‌ వార్డులను సిద్ధంగా ఉంచింది. ఇటు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా కేంద్రంలో 70 లక్షలతో కొవిడ్‌-19   నిర్ధారణ పరీక్షల కోసం వైరాలజీ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఎక్కడ : కరీంనగర్‌ ప్రభుత్వ దవాఖాన  (70 లక్షలతో వైరాలజీ ల్యాబ్‌ ఏర్పాటు)

పరీక్ష విధానం : ప్రాథమికంగా స్క్రీనింగ్‌ కోసం ‘ట్రూ నాట్‌ మిషన్‌'పై పరీక్షల నిర్వహణ. ఇక్కడ నెగటివ్‌ వచ్చినా సీబీ నాట్‌ మిషన్‌పై మరోసారి టెస్ట్‌. పాజిటివ్‌ వస్తేనే కరోనాగా నిర్ధారణ. 

ఒకేసారి ఎందరికి చేయొచ్చు : ‘ట్రూ నాట్‌ మిషన్‌'పై నలుగురికి, సీబీనాట్‌ మిషన్‌పై 16 మందికి..

పరీక్షకు సమయం : రెండు గంటలు

రోజుకు ఎంతమందికి చేయొచ్చు : 100 మందికి..

చికిత్స ఎక్కడ : అత్యవసరం లేని వారికి హోం ఐసోలేషన్‌లో 17 రోజులు. అయినా తగ్గకుంటే జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖాన ఐసోలేషన్‌. ఆ తర్వాత వరంగల్‌ ఎంజీఎం, అక్కడా తగ్గకుంటే హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు తరలింపు.

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ/కరీంనగర్‌ హెల్త్‌ : లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. జగిత్యాల జిల్లాలో ఇద్దరు, కరీంనగర్‌ జిల్లాలో మరో ఇద్దరు, పెద్దపల్లిలో ఒకరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమున్నది. స్వీయరక్షణ పాటించకుంటే కేసులు మరింతగా పెరగవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరో పక్క కొవిడ్‌-19 సోకిన వారికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో చికిత్స చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఐసోలేషన్‌ వార్డును సిద్ధం చేశారు. ఇప్పటికే ఒకరికి చికిత్స అందిస్తున్నారు. పాజిటివ్‌ కేసుల్లో 80 శాతం మందికి వైరస్‌ లక్షణాలు బయటపడడం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇలాంటి వారికి ఇక ముందు హోం ఐసోలేషన్‌లో 17 రోజుల పాటు చికిత్స అందిస్తారు. అయినా వ్యాధి నయం కాకుంటే ప్రభుత్వ ఐసోలేషన్‌కు మార్చి చికిత్స చేస్తారు. జిల్లాలో ఇప్పటికే ఒకరు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన ఈ నిబంధనలపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నారు.

 రోగి సేవకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

 మూడు పొరల మాస్క్‌ తప్పనిసరిగా వేసుకోవాలి. మాస్కు ముందు భాగాన్ని ముట్టుకోకుండా, పైకి కిందకి కదపకుండా ఉండాలి. అరగంటకి మించి వాడరాదు. వాడిన మాస్కులను ప్రతి రోజూ కాల్చి వేయాలి. 

రోగికి సేవలు అందిస్తున్నపుడు కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకొద్దు. సేవలు అందించిన తర్వాత చేతులను సబ్బు నీటితో 40-60 సెకన్ల పాటు కడుక్కోవాలి. 

ఆహారం తినేముందు, మరుగుదొడ్డి వాడిన తర్వాత వెంటనే సబ్బుతో నీటిని 40-60 సెకన్ల వరకు కడుక్కోవాలి. 

రోగి శరీరం నుంచి వచ్చే చెమట, నోటి నుంచి వచ్చే ఉమ్మి, ముక్కు నుంచి కారే నీటిని తాకవద్దు. ఒకవేళ తాకాల్సి వస్తే వెంటనే సబ్బుతో 40-60 సెకన్ల వరకు చేతులను శుభ్రంగా కడుక్కుని పైకెత్తి గాలికి ఆరబెట్టాలి.

రోగి ఉన్న గదిలో ఏ వస్తువూ ముట్టుకోకూడదు. రోగి వాడిన బెడ్‌ షీట్స్‌, టవల్స్‌, పల్లెం, గిన్నెలు, గ్లాసులు వేరుగా పెట్టాలి. వీటిని ముట్టుకున్నా వెంటనే చేతులు కడుక్కోవాలి. రోగి వాడిన ఏ వస్తువునైనా 30 నిమిషాలు వేడి నీటిలో ఉంచిన తర్వాత శుభ్రం చేసి వాడుకోవచ్చు.

రోగికి ఆహారం, ఇతర అవసరాలను కేటాయించిన గదిలోనే ఉంచండి. రోగి వాడిన వస్తువులు, బట్టలు శుభ్రపర్చేటపుడు మూడు పొరల మాస్కులు ధరించాలి. 

రోగిని రోజూ గమనించాలి. జ్వరం, ఇతర లక్షణాలు పెరిగినట్లయితే హెల్ప్‌లైన్‌, టోల్‌ ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేయాలి.

సామూహికంగా ఉన్నవారు తీసుకోవాల్సినవి.. 

కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతంలో ఉండే వారు భయపడాల్సిన పని లేదని వైద్యులు చెబుతున్నారు. పలు జాగ్రత్తలు తీసుకుని కుటుంబాన్ని రక్షించుకోవాలని సూచిస్తున్నారు.

ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. 

అపార్ట్‌మెంట్‌, ప్లాట్స్‌లో ఉంటే కామన్‌ ప్రాంతాన్ని రోజులో రెండుసార్లు పురుగుల మందులతో శుభ్రం చేసుకోవాలి. తరుచూ తాకే మెట్ల, గోడలను లిఫ్ట్‌ బటన్స్‌ పలు మార్లు శుభ్రం చేయాలి.

పాజిటివ్‌ కేసు కుటుంబ సభ్యులు ఇంటిలోనే ఉంటే ఇతరులకు సోకే ప్రమాదం ఉండదు. 

మీ చుట్టు పక్కల స్టాంప్‌ వేసిన వారు బయట తిరిగినట్లు కనిపిస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలి. 

ప్రతిసారి ఇంటి నుంచి బయటికి వెళ్లినపుడు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తెచ్చిన వస్తువులను కూడా శుభ్రం చేయాలి. 

కొవిడ్‌ సోకిన వ్యక్తులకు సహకరించాలి. వారిని బాధించ కూడదు. కొంత మందికి ఈ లక్షణాలున్నా బయటికి కనిపించవు. సామాజిక దూరం పాటించాలి.

ఇంట్లో తగ్గకుంటే ఐసోలేషన్‌కు.. 

హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందే బాధితుల ఆరోగ్య పరిస్థితిని సంరక్షకులు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తుండాలని వైద్యులు సూచిస్తున్నారు. అస్వస్థత లక్షణాలు తీవ్రమైనా, కొత్త లక్షణాలు తలెత్తినట్లు గమనించినా వెంటనే ప్రభుత్వ ఐసోలేషన్‌కు తరలించాలని చెబుతున్నారు. ముఖ్యంగా దగ్గు, గొంతు నొప్పి, చాతిలో నొప్పి లేదా నొక్కినట్లు ఉండడం, పెదాలు, ముఖం నీలం రంగులోకి మారడం, తికమక లేదా లేవలేక పోవడం, విపరీతమైన జ్వరం, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే చికిత్స అందిస్తామని చెబుతున్నారు. అయితే ప్రతి రోజూ రోగిని గమనించాలని, శరీర ఉష్ణోగ్రత చూడాలని రోగి సంరక్షకులకు వైద్యులు సూచిస్తున్నారు. 

అవసరాన్ని బట్టి ఏర్పాట్లు చేస్తాం 

జిల్లాలో ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు లేవు. ఒక వేళ వస్తే వారికి ఇక్కడే ప్రత్యేక వైద్యుడి పర్యవేక్షణలో వైద్యం అందిస్తాం. దవాఖానలో ప్రస్తుతం 10 ప్రత్యేక (ఐసోలేషన్‌) గదులు ఉన్నాయి. అవసరాన్ని బట్టి మరో 40 ఏర్పాటు చేస్తాం. కరోనా బాధితులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయి. దవాఖానలో వెంటిలెటర్లు సిద్ధంగా ఉన్నాయి.

- డాక్టర్‌ మురళీధర్‌రావు, సూపరింటెండెంట్‌, సిరిసిల్ల ప్రభుత్వ దవాఖాన

హోం ఐసోలేషన్‌లో పాటించాల్సినవి.

హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ వైద్యులు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు. 

రోగికి కేటాయించిన గదిలోనే ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే మాస్క్‌ ధరించాలి. దగ్గినపుడు రుమాలు లేదా టిష్యూ పేపర్‌ అడ్డు పెట్టుకోవాలి.

రుమాలు తడిసినట్లయితే పాలిథీన్‌ కవర్‌లో వేసుకోవాలి. టిష్యూ పేపర్‌ మూతగల చెత్తబుట్టలో వేయాలి. గోరువెచ్చని నీరు రోజుకు కనీసం రెండు లీటర్లు తాగాలి.

రోగికి ప్రత్యేకంగా మరుగు దొడ్డి ఏర్పాటు చేయాలి. వెళ్లినపుడల్లా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. వాడిన మరుగుదొడ్డిని, తాకిన పరికరాలను శుభ్రం చేయాలి.

రోగి తన గదిని తానే శుభ్రం చేసుకోవడం మంచిది. అలా చేయలేనపుడు సేవలు అందించే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పురుగుల మందు లేదా బ్లీచింగ్‌ పౌడర్‌ లీటర్‌కు మూడు స్పూన్ల చొప్పున వేస్తూ కావాల్సినన్ని లీటర్లు తయారు చేసుకోని గదిని శుభ్రం చేసుకోవాలి. 

ఇంటిలో వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు, ఇతర అస్వస్థతలు ఉన్న వారి నుంచి రోగి కనీసం రెండు మీటర్లు దూరంగా ఉండాలి.

పొగతాగడం ఆపేయాలి. దీని ఊపిరితిత్తులపై మరింత ప్రభావం చూపి ఆరోగ్యం మరింత దిగజారుతుంది. 

రోగి వాడిన వస్తువులను ఇతరుల వస్తువులతో కలపరాదు. బెడ్‌ షీట్లు, రుమాలు, టవల్‌, వేడి నీటిలో రసాయనాలు వేసి అరగంట పా టు నానబెట్టాలి. ఉతికిన తర్వాత ఎండలో ఆరవేయాలి. రోగి వాడిన మాస్కు లేదా గుడ్డ బ్లీచింగ్‌లో 20-30 నిమిషాలు నానబెట్టి ఉతకాలి.

రోగి వైద్యుల సలహా మేరకు మందులు తప్పనిసరిగా వాడాలి. ప్రతి రోజు జ్వరం పరిశీలించాలి. తీవ్రమైతే వెంటనే వైద్యులకు ఫోన్‌ చేసి చెప్పాలి. దగ్గు, గొంతు నొప్పి, చాతిలో నొప్పి లేదా నొక్కినట్లు ఉండడం, పెదాలు, ముఖం నీలం రంగులోకి మారడం, తికమక పడటడం, లేవలేక పోవడం, విపరీతమైన జ్వరం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు పడితే వెంటనే ప్రభుత్వ ఐసోలేషన్‌కు వెళ్లి చికిత్స పొందాలి.



logo