శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 12, 2020 , 02:20:13

మొక్కుబడి వద్దు.. మొక్కలను రక్షిద్దాం

మొక్కుబడి వద్దు.. మొక్కలను రక్షిద్దాం

  • నగరాన్ని హరితవనంగా మార్చుదాం 
  • నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు 
  • గ్రీన్‌ బడ్జెట్‌ నిధులు పూర్తిగా వినియోగించండి 
  • మంత్రి గంగుల కమలాకర్‌
  • హరితహారంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష

కార్పొరేషన్‌ : హరితహారం కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహించవద్దని, నాటిన మొక్కలన్నింటినీ రక్షించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించారు. కాంక్రీట్‌ జంగల్‌గా ఉన్న కరీంనగర్‌ను హరితవనంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో హరితహారంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హరితహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. జిల్లాలో ఈసారి 43 లక్షల మొక్కలు నాటాలని, నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లా సరిహద్దుల నుంచి జిల్లా కేంద్రం వరకు ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కనూ జియోట్యాగింగ్‌ చేయడంతోపాటు సంరక్షించాలన్నారు. 2 ఫీట్ల వెడల్పు, లోతు ఉండేలా గుంతలు తవ్వి, అందులో ఎర్ర మట్టి వేసి మొక్కలు నాటాలన్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్మృతివనాలను ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీలు 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. ప్రతి మండలంలో 4, 5 ఎకరాల్లో ఒక మంకీ ఫుడ్‌ కోర్టును మీటరన్నర ఎత్తులో ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో గ్రీన్‌, బ్లాక్‌ ప్లాంటేషన్‌ చేసుకొని డివిజన్ల వారీగా మొక్కలునాటి, ట్రీగార్డు ఉండేలా చూడాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, అదనపు జిల్లా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, మేయర్‌ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్రరాజు, జడ్పీ సీఈఓ వెంకటమాధవరావు, డీఆర్‌డీఓ వెంకటేశ్వర్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జనాభాకు అనుగుణంగా పబ్లిక్‌ టాయిలెట్లు

కరీంనగర్‌లో జనాభాకు అనుగుణంగా అధునిక హంగులతో స్మార్ట్‌ పబ్లిక్‌ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌ఆర్‌ రిజర్వాయర్‌ వద్ద పీపీపీ పద్ధతిలో నిర్మించిన స్మార్ట్‌ పబ్లిక్‌ టాయిలెట్‌ను మంత్రి ప్రారంభించారు. నగరంలో పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు) భాగస్వామ్యంతో 40 వరకు పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మిస్తామన్నారు. కలెక్టరేట్‌, బస్టాండ్‌, కూరగాయాల మార్కెట్‌, షాపింగ్‌ మాల్స్‌, టవర్‌ సర్కిల్‌ ఏరియాల్లో స్థలాలను గుర్తించి ఏర్పాటు చేస్తామన్నారు. రద్దీ ప్రాంతాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్స్‌ను నిర్మించే విషయంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, మేయర్‌ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్రరాజు, కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్‌ బండ సుమ, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. logo