బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 10, 2020 , 04:00:26

ముగిసిన ధాన్యం కొనుగోళ్లు

ముగిసిన ధాన్యం కొనుగోళ్లు

lగోదారి పరవళ్లతో ఊరూరా వరి సిరులు

lదండిగా యాసంగి దిగుబడులు

lకరోనా నేపథ్యంలో కొనుగోళ్లకు సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు

lఊరికో కొనుగోలు కేంద్రంతో తప్పిన తిప్పలు

lవిక్రయించిన వారంలోపే ఖాతాల్లో డబ్బులు 

lఆనందంలో అన్నదాతలు

కాళేశ్వర జల ఫలితం కళ్లముందు కనబడింది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాను వాటర్‌హబ్‌గా మార్చడమే కాదు,  పుట్ల కొద్దీ వడ్లను పండించింది. దిగువ నుంచి ఎగువకు ఉప్పొంగిన గోదారి నీళ్లతో ప్రాజెక్టులు, చెరువులు నిండి భూగర్భ జలాలు ఉబికి రావడంతో యాసంగి బంగారమైంది. గతంలో ఎన్నడూ లేనంతగా ధాన్యం దిగుబడి వచ్చింది. ఇదే సమయంలో కరోనా లాక్‌డౌన్‌తో ఆర్థిక పరిస్థితులు తలెత్తినా, రాష్ట్ర సర్కారు అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగింది. ఊరికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రైతన్న పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 13,67,991.706 మెట్రిక్‌ టన్నులు సేకరించి, వారంలోపే 189,466 మంది రైతుల ఖాతాల్లో 1853.70 కోట్లు జమచేయడంతో అన్నదాత ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 

 (కరీంనగర్‌, నమస్తేతెలంగాణ)

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో వరి రైతుల పంట పండింది. కాళేశ్వరం నీళ్లు రావడంతో అంచనాకు మించి సాగులోకి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఎక్కడా రాజీ పడకుండా కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించారు. కరోనా వైరస్‌ ప్రభావం ఉన్నప్పటికీ ప్రత్యేక చర్య లు తీసుకుని ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లే కుండా కొనుగోళ్లు ముగించారు. కరోనా నేపథ్యం లో రైతులందరూ ఒకేసారి కేంద్రాలకు రాకుండా టోకెన్‌ విధానం అమలు చేశారు. టోకెన్లు ఇచ్చి పరిమిత సంఖ్యలో రైతులకు అవకాశం కల్పించారు. కొద్ది మందినే కేంద్రాలకు రప్పించి ధాన్యం కొనుగోళ్లు జరిపారు. గతంలో నాలుగైదు గ్రామాలకు ఒక కొనుగోలు కేంద్రం ఉండేది. ఈసారి గ్రా మానికి ఒకటి చొప్పున, అవసరమైన చోట రెండు మూడు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు జరిపారు. కేంద్రాలకు వచ్చే రైతులు తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలని అధికారులు, కొనుగోలు ఏజెన్సీలు విస్తృత ప్రచారం చేయడంతో రైతు కొవిడ్‌-19 నిబంధనలు పాటించారు. కేంద్రాల వద్ద శానిటేషన్‌ ఏర్పాట్లు కూడా చేశారు. కాగా,  మద్దతు ధర ఏ గ్రేడ్‌ రకం క్వింటాల్‌కు రూ.1,835, సాధారణ రకానికి రూ.1,815 చొప్పున రైతుల ఖాతాల్లో జమచేశారు.

  చొప్పదండిలో అత్యధికం..

కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి మండలంలో ఈ యేడు అత్యధికంగా కొనుగోళ్లు జరిగాయి. ఈ మండలంలో 35,366.860 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. 35,244.280 మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లతో గంగాధర మండలం రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో మానకొండూర్‌ (31,769.500) తిమ్మాపూర్‌ (31,113.860) మెట్రిక్‌ టన్నులు కొనుగోళ్లు జరిగాయి.

ప్రణాళికా బద్ధంగా కొనుగోళ్లు జరిపాం.. 

- శ్యాంప్రసాద్‌లాల్‌,  అదనపు కలెక్టర్‌.. 

ఈసారి కరోనా వైరస్‌ ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోళ్లు జరిపాం. కేవలం 60 రోజుల వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిపిన అధికారులకు అభినందనలు. ఐకేపీ, ప్యాక్స్‌, డీసీఎమ్మెస్‌, హాకా ఏజెన్సీలు కూడా సమర్ధవంతంగా పనిచేశాయి. ఇక ప్రజాప్రతినిధులు, రైతులు కూడా మాకెంతో సహకారం అందించారు. వారందరికీ ధన్యవాదాలు. త్వరలోనే ధాన్యం అమ్మిన రైతులకు  చెల్లింపులు కూడా పూర్తి చేస్తాం.

 ఎక్లాస్‌పూర్‌ పంట పండింది..

ఈ చిత్రంలో కనిపిస్తున్నది మంథని మండలం ఎక్లాస్‌పూర్‌. గోదావరి ఒడ్డునే ఉంటుంది. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుగా ఉన్న ఈ గ్రామంలో 2,297 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, ఎన్నడూ సగం కూడా సాగయ్యేది కాదు. కాలువలున్నా నీరు రాకపోయేది. గోదావరి ఎడారిగా మారడంతో భూగర్భ జలాలు అడుగంటి ఒక్క తడీకూడా అందేది కాదు. గత రెండేళ్లుగా 600 ఎకరాలకు మించి సాగుకాలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ యేడు గోదావరి సజీవంగా మారి, భూగర్భజలాలు పుష్కలంగా పెరిగాయి. బోర్లు, బావుల్లో పాతాళగంగ పైపైకి రావడం, అలాగే ఎస్సారెస్పీ జలాలు అందడంతో ఈ యాసంగిలో 1550 ఎకరాల్లో వరి సిరులు పండాయి. గతేడాది గ్రామం లో 29,650 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రాగా, ఇప్పుడు 43వేల క్వింటాళ్ల ధాన్యం చేతికందింది.

-పెద్దపల్లి, నమస్తేతెలంగాణ

అన్ని సౌలతులు చేసిండ్రు..

నా పేరు తిరుపతి. నాకు మూడెకరాలు భూమి ఉంది.  రెండెకరాల్లో వరి వేసిన. మా ప్రాంతానికి గోదావరి జలాలు రావడంతో చెరువుల్లోకి నీళ్లు వచ్చినయ్‌. భూగర్భ జలాలు పెరగడంతో వరి సాగు చేసిన. 58 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. సనుగుల సింగిల్‌ విండో పరిధిలోని రామారావుపల్లిలో గల కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసిన. కేంద్రంలో మాకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని సౌలతులు చేసింది. తేమ శాతం రాగానే రైతులకు టోకెన్లు ఇచ్చి క్రమపద్ధతిలో ధాన్యం కొన్నరు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న కేసీఆర్‌ సర్కారుకు రుణపడి ఉంటం. - నగార్ల తిరుపతి, రైతు రామారావు పల్లి, చందుర్తి మండలం


logo