బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 08, 2020 , 03:08:47

నివురుగప్పిన నిప్పు ఆదమరిస్తే కరోనా కాటే..

నివురుగప్పిన నిప్పు ఆదమరిస్తే కరోనా కాటే..

 • పల్లెల్లోనూ మహమ్మారి విజృంభణ
 • పదుల సంఖ్యలో కేసులు వెలుగులోకి..
 • ఆందోళన కలిగిస్తున్న మరణాలు
 • ముప్పు పొంచి ఉన్నా అలసత్వం
 • ‘మాకేమవుతుంది’లే అనే నిర్లక్ష్యం 
 • లాక్‌డౌన్‌ సడలింపు దుర్వినియోగం
 • అవసరం లేకున్నా రోడ్లపైకి జనం
 • మాస్కులకు మంగళం 
 • ఎవరికీ పట్టని భౌతికదూరం  
 • షాపుల వద్ద కనిపించని నిబంధనలు
 • స్వీయనియంత్రణ అవసరమంటున్నఅధికారులు, వైద్యులు

కరోనా భయంకరమైన వైరస్‌. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా శరవేగంగా విజృంభించే మహమ్మారి. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఉన్నది ఒక్కటే మార్గం. అది స్వీయనియంత్రణ. బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం, ఫిజికల్‌ డిస్టెన్స్‌ (భౌతికదూరం) పాటించడం. హ్యాండ్‌ వాష్‌ చేసుకోవడం. అవసరమైతేనే రోడ్లపైకి రావడం. మొన్నటి వరకు లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేయడంతో ప్రజలంతా నిబంధనలు సరిగ్గానే పాటించారు. అవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. నిత్యావసరాలు, మెడికల్‌ షాపుల్లో మందుల కోసం వచ్చేటప్పుడు మాత్రమే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.  

తమకేమవుతుందిలే అనే నిర్లక్ష్యం..

ఇటీవల లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించగానే.. అంతటా జనాలు పెద్దసంఖ్యలో బయటకు వస్తున్నారు. ఓ భయంకర విపత్తు కరోనా రూపంలో పొంచి ఉన్నా మనకేమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అవసరం లేకున్నా ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వస్తున్నారు. కానీ, ఎక్కడా పెద్దగా నిబంధనలు పాటించడం లేదు. కనీసం మాస్కులు ధరించడం లేదు. ఒకవేళ మాస్క్‌ ధరించినా, దాన్ని గదవ కిందకు పెడుతున్నారు. అలాగే బయట తిరుగుతున్నారు. ఇటు చాలా షాపుల వద్ద యజమానులు కూడా జాగ్రత్తలు పాటించడం లేదు. భౌతిక దూరం అయితే ఏమాత్రం పాటించడం లేదు. ముఖ్యంగా మెడికల్‌ షాపుల వద్ద పట్టించుకునే నాథుడే లేడు. ప్రధానంగా కూరగాయల మార్కెట్‌లోనూ అలాగే ప్రవర్తిస్తున్నారు. మనం బాగానే ఉన్నాం కదా? మనకెందుకు కరోనా వస్తుంది? అన్న ధీమాతో వ్యవహరిస్తున్నారు. మన పక్కన ఉన్నవారు ఆరోగ్యంగానే ఉన్నారన్న భ్రమతో మరికొందరు ఉంటున్నారు. ఇక చాలామంది వ్యాపారులు మాస్క్‌లు లేకుండానే రోజువారీ వ్యాపార కార్యకలాపాల్లో నిగ్నమవుతున్నారు. కొంతమంది గుట్కా, పాన్‌ వంటివి నములుతూ ఇష్టానుసారంగా రోడ్లపైనే ఉమ్మేస్తున్నారు.

హెచ్చరిస్తున్నా పట్టింపు కరువు..

పల్లె, పట్టణం అనే తేడా లేకుండా చాలాచోట్ల సడలింపు దుర్వినియోగం జరుగుతున్నది. ఇప్పటికే పల్లెల్లో కేసులు పెద్దసంఖ్యలో వెలుగు చూస్తున్నవి. ఉమ్మడి జిల్లాలో కేసుల సంఖ్య దాదాపుగా 120 వరకు చేరింది. మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తున్నది. అయినా ప్రజల్లో నిర్లక్ష్యమే కనిపిస్తున్నది. రోడ్లపైకి అనవసరంగా, మాస్కులు లేకుండా వచ్చిన వారిని పట్టుకుని జరిమానాలు వేస్తున్నా మార్పు రావడం లేదు. మరోవైపు వైద్యులు, అధికారులు హెచ్చరిస్తున్నా పట్టింపు కరువైంది. పరిస్థితి ఇలాగే ఉంటే మున్ముందు సమాజం మొత్తం బాధ పడాల్సి వస్తుంది.  

పొంచి ఉన్న మహా ముప్పు..

లాక్‌డౌన్‌ సమయంలో కరోనా అనుమానిత లక్షణాలున్న వారు ఇండ్లలో ఉండడంతో వ్యాప్తి చెందలేదు. లక్షణాలు ఉన్న వారిని వెంటనే క్వారంటైన్‌కు పంపించగా.. రక్తనమూనాలను సేకరించి నివేదికలు తెప్పించేవారు. పాజిటివ్‌ వచ్చిన వారిని గాంధీ దవాఖానకు చికిత్స కోసం పంపించేవారు. ప్రస్తుతం కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారు కూడా ఇండ్లలో ఉండకుండా రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కంటే ప్రస్తుతం మహా ముప్పు పొంచి ఉన్నది. ఎవరికి వారు కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా బారిన పడే ప్రమాదమున్నది. ఇప్పటికే కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. వర్షాకాలం ప్రారంభంకావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశమున్నది. సీజనల్‌ వ్యాధులు, కరోనా కలిస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.  

తనిఖీలు చేస్తున్నాం

వివిధ సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌స్టేషన్లకు వచ్చే ప్రజలకు, విధులకు వచ్చే పోలీసులకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తనిఖీలు చేస్తున్నాం. కమిషనరేట్‌ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్లు, వివిధ విభాగాల్లో థర్మల్‌ స్కానర్లు, పల్స్‌ ఆక్సీమీటర్లను వినియోగిస్తున్నాం. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు అన్ని స్థాయిలకు చెందిన పోలీసులకు నాలుగు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నాం. ఇందులో యోగా, ధ్యానం, ప్రాణాయామం అంశాలపై దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్నది. అతి త్వరలో శిక్షణ ప్రారంభం కానుంది. - కమలాసన్‌రెడ్డి, కరీంనగర్‌ సీపీ

కరోనా వస్తే ఇంటికే పరిమితం.. 

కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం 

దేశంలో రోజుకు 10 వేల దాకా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.

వైరస్‌ సోకితే ఇంట్లోనే చికిత్స చేయించుకోవాలి.

వైద్యుల పర్యవేక్షణలో వారిచ్చే సలహాలతో 17 రోజుల పాటు చికిత్స ఉంటుంది.

చిన్నారులు, వృద్ధులను వైరస్‌ బాధితులకు దూరంగా ఉంచాలి. ఇదే సమయంలో ఇంట్లోని వారంతా పోషకాహారం తీసుకోవాలి.

ఇంట్లో చికిత్స పొందే కొవిడ్‌-19 బాధితులను ఎక్కువగా గాలి వీచే గదిలో ఉంచాలి. ప్రత్యేక బాత్‌రూం కేటాయించాలి. ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నవారితో సేవలను పొందవచ్చు.

అనుమానితులు వైద్యుల సలహా మేరకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ టాబ్లెట్లు వేసుకోవచ్చు. వీటి కోసం స్థానిక అరోగ్య కేంద్రంలోసంప్రదించాలి.

ప్రతి ఒక్కరూ ఫోన్‌లో‘ఆరోగ్య సేతు’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

తప్పని సరిగా మాస్క్‌ను ధరించాలి.

రోజుకు రెండు లీటర్ల చొప్పున గోరు వెచ్చని నీటిని తప్పని సరిగా తాగాలి.

ఏ వస్తువును చేతితో తాకినా దాన్ని వెంటనే శానిటైజ్‌ చేయాలి. వైరస్‌ బాధితుడు తన గదిని తానే స్వయంగా శుభ్రం చేసుకోవాలి.

బాధితుల గదిలోకి ఇతరులు వెళ్తే మూడు పొరలున్న మాస్క్‌ను ధరించాలి. దాన్ని ముట్టుకోరాదు. వినియోగం తర్వాత కాల్చివేయాలి.

బ్రౌన్‌ రైస్‌, గోధుమలు, చిరుధాన్యాలు, బీన్స్‌, చిక్కుడు, ఓట్స్‌, తదితర ప్రొటీన్స్‌ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

పండ్లు, క్యారెట్‌, బీట్‌రూట్‌, నిమ్మ, బత్తాయి, క్యాప్సికమ్‌ అధికంగా తీసుకోవాలి.

నిల్వ ఉంచిన పదార్థాలు తీసుకోవద్దు.

మైదా, వేపుళ్లు, జంక్‌ఫుడ్‌, కూల్‌ డ్రింక్స్‌, పామాయిల్‌, బటర్‌కు దూరంగా ఉండాలి.

రోగి వాడే అన్నిరకాల వస్తువులను 30 నిమిషాలు వేడి నీటిలో ఉంచి అపై శుభ్రం చేసి తానే వాడుకోవాలి.

మరింత కట్టడి అవసరం..

లాక్‌డౌన్‌ ఉన్న సమయంలో కేసుల సంఖ్య కేవలం పదుల సంఖ్యలో ఉండేవి. సడలింపుతో ముంబై నుంచి వలస కూలీల రాకతో పాజిటివ్‌ కేసులు పెరగడం మొదలైంది. ఈ మేరకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వలస కూలీలు వచ్చిన వారిని వచ్చినట్టే క్వారంటైన్‌లో ఉంచుతూ ప్రతి రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి వ్యాపార సముదాయాలు, మార్కెట్లలో భౌతిక దూరం పాటించేలా, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 


logo