సోమవారం 21 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 07, 2020 , 01:57:31

‘డబుల్‌' ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

‘డబుల్‌' ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

జిల్లాకు 6,494 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు

సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ శశాంక

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: జిల్లాకు మంజూరైన 6,494 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్‌ శశాంక అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ కమిషనర్‌, డీఆర్డీవో, మిషన్‌ భగీరథ, సీపీవో లతో అర్బన్‌ డబుల్‌ బెడ్‌రూం గృహ నిర్మాణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్బన్‌లో 1,660, రూరల్‌లో 4,834 గృహాలు మంజూరయ్యాయన్నారు. ఇప్పటికే 2,741 ఇండ్ల  నిర్మాణం ప్రారంభమైనట్లు తెలిపారు. 784 ఇండ్ల నిర్మాణాలు పూరయ్యాయని చెప్పారు. 1,957 ఇండ్ల పనులు అక్టోబర్‌ వరకు పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఈ గృహాలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్‌, మిషన్‌ భగీరథ, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను సమీకరిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాఘవాచారి, ఈఈ నరసింహచారి, ముఖ్య ప్రణాళికాధికారి పూర్ణచంద్రరావు, ఎస్సీ కార్పొరేషన్‌ డీడీ బాలసురేందర్‌, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల పరిశీలన

కార్పొరేషన్‌: నగరంలోని అంబేద్కర్‌ స్టేడియంలో చేపడుతున్న కాంప్లెక్స్‌ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ శశాంక అన్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను, సర్కస్‌ గ్రౌండ్‌లో సాగుతున్న పనులను శనివారం నగర మేయర్‌ సునీల్‌రావుతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. సర్కస్‌ గ్రౌండ్‌లో వాకింగ్‌ ట్రాక్‌, గ్రీనరీ, బస్‌ బే  తదితర పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఇండోర్‌ స్టేడియంలో రీ సౌండ్‌ రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్‌ సౌకర్యం, టాయిలెట్స్‌ నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. స్టేడియంలో బాస్కెట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌ కోర్టు పనులు నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో నగర కమిషనర్‌ క్రాంతి, స్మార్ట్‌సిటీ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


logo