బుధవారం 30 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 06, 2020 , 00:29:52

ఆయిల్‌ పామ్‌తో ఆమ్దానీ

ఆయిల్‌ పామ్‌తో ఆమ్దానీ

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సాగుకు యోగ్యంగా నేలలు

గోదావరి, పెన్‌గంగా, ప్రాణహిత నదుల పరీవాహకంలో అమలు

మొక్కలు నాటిన ఐదేళ్ల తర్వాత నుంచి చేతికి పంట 

రైతులకు ఆర్థిక భరోసా.. సబ్సిడీపై పరికరాలు.. 

50 ఏళ్ల పాటు దిగుబడులు.. ఏటా ఎకరాకు రూ.లక్షకు పైగా ఆదాయం

అశ్వరావుపేటలో తోటలను పరిశీలించిన విప్‌ సుమన్‌

జైపూర్‌, కడెం ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీలు

మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్‌/నిర్మల్‌, నమస్తే తెలంగాణ : వేరుశనగ, పొద్దు తిరుగుడు, కుసుమ తదితర నూనె గింజల సాగు క్రమంగా తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో పామాయిల్‌ వాడకం నానాటికీ పెరుగుతున్నది. ఆయిల్‌ పామ్‌ ఉత్పత్తులు మన ప్రాంతంలో అంతంత మాత్రమే. ఈ క్రమంలో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ఆయిల్‌ పామ్‌ సాగు వైపు మళ్లించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సంప్రదాయ సాగు చేస్తున్న రైతాంగాన్ని.. అధిక లాభాలు వచ్చే ఆయిల్‌ పామ్‌ తోటల వైపు మళ్లించే దిశగా ప్రోత్సహిస్తున్నది. గోదావరి, పెన్‌గంగా, ప్రాణహిత నదుల పరీవాహక ప్రాంత నేలలు సాగుకు యోగ్యంగా ఉన్నాయని ఆయిల్‌ ఫెడ్‌ గుర్తించింది. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలమైన నేలల కోసం ఉద్యానవన విశ్వవిద్యాలయ బృందం సభ్యులు సర్వే కూడా నిర్వహించారు. ఇక్కడి నేల స్వభావం, వాతా వరణ పరిస్థితులు, గత 15 ఏళ్ల నుంచి వర్షపాతం, గాలిలో తేమ, నీరు ఆవిరయ్యే రేటు, ఉష్ణోగ్రత, భూగర్భ జలాలు తదితర అంశాలతో ఉద్యానశాఖ అధికారులు నివేదికలు పంపించారు. వీటి ఆధారంగా ఇక్కడి భూములు ఆయిల్‌ పామ్‌ తోటల సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయిల్‌ ఫెడ్‌ వారు తొలి విడుత నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని భూములు అనుకూలం అని నిర్ణయించారు. ఈ సాగు వల్ల రైతులను పంట మార్పిడి వైపు ప్రోత్సహించినట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

రైతుకు ఆర్థిక భరోసా..

సాగుకు ఎకరానికి 21,205 ఖర్చు కానుండగా, జాతీయ ఆహార భద్రతా పథకం కింద ప్రభుత్వం మొక్కల కోసం 12,500 సబ్సిడీ ఇవ్వనున్నది. సమగ్ర యాజమాన్యానికి 20 వేలు, అంతర పంటల సాగుకు 20 వేలు రాయితీని కల్పిస్తుంది. డ్రిప్‌ ఇరిగేషన్‌ తప్పని సరి. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తి సబ్సిడీపై, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలను అందించబోతున్నది. ఈ పంట సాగు చేసిన రైతులకు కట్టర్‌ మిషన్‌, మినీ ట్రాక్టర్లను 60 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నది. మొక్కల సరఫరా నుంచి దిగుబడి వచ్చిన తర్వాత మార్కెటింగ్‌ వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఇందుకు ఒక్కో మండలానికి ఒక్కో కం పెనీతో మార్కెటింగ్‌ అగ్రిమెంట్‌ చేయనున్నది. ఐదో సంవత్సరం నుంచి పంట దిగుబడి మొదలై.. 50 ఏళ్ల వరకు దిగు బడి వస్తుంది. ఎకరానికి 60 మొక్కలు నాటుకోవచ్చు. ఒక ఎకరంలో 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుత మార్కెట్‌లో టన్నుకు 9 వేల నుంచి 10 వేల ధర ఉంది. ఒక ఎకరం సాగుచేసిన రైతు ఏటా రమారమి లక్షకు పైగా ఆదాయం పొందవచ్చు. ఆయిల్‌ఫెడ్‌ వారే రైతుల తోటల నుంచి తీసుకెళ్తారు. ఎక రం వరి సాగు అయ్యే నీటితో మూడెకరాల పామాయిల్‌ పంట సాగవుతుంది. అంతర పంటల సాగుతో అధిక లాభాలు కూడా వస్తాయని అధికారులు చెబుతున్నారు. కూరగాయలు, పూలు, అరటి, పసుపు, మిరప, అల్లం, వెల్లుల్లి, కంద, నువ్వులు వంటి తోటలను వేసుకోవచ్చు. మూడేళ్ల తర్వాత సాగు చేయడానికి అనుకూలంగా ఉండదు. ఆయిల్‌పామ్‌ తోట చుట్టూ కంచె వెంబడి వెదురు, శ్రీగంధం మొక్కలు పెంచడం వల్ల నిరూపయోగంగా ఉన్న స్థలాన్ని వాడుకలోకి తెచ్చుకోవచ్చు. దీంతో అదనపు ఆదాయం పొందవచ్చు.

జైపూర్‌, కడెంలలో ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీల ఏర్పాటునకు నిర్ణయం!

నిర్మల్‌ జిల్లా కడెం వరి విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఆయిల్‌ఫెడ్‌కు అప్పగించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం ఇకపై ఆయిల్‌ పామ్‌ సాగు క్షేత్రంగా మారనుంది. ఇక్కడ రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాగజ్‌నగర్‌ మండలం జంబుగాం నర్సరీలో ఆయిల్‌ పామ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మదర్‌ సీడ్‌ కోసం ఐదెకరాల్లో 315 చెట్లను గతంలోనే ఐటీడీఏ ద్వారా పెంచుతున్నారు. మొక్క దగ్గర నుంచి మార్కెటింగ్‌ వరకు అన్ని రకాలుగా రైతులకు ప్రభుత్వ సాయం అందనుంది. రైతులకు ఆయిల్‌ పామ్‌ మొక్క రూ.25కే అందిస్తారు. మొక్కలను కూడా ఈజీఎస్‌ కింద అధికారులు నాటిస్తారు. ఈ మొక్కలను పెంచడానికి అధికారులు నర్సరీ కూడా ఏర్పాటు చేయనున్నారు. మార్కెట్‌ సౌకర్యం కోసం.. 5 వేల నుంచి 10 వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ తోటలు సాగైతే స్థానికంగా పరిశ్రమ ఏర్పాటు చేస్తారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌, నిర్మల్‌ జిల్లా కడెంలో ఆయిల్‌ ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చెన్నూరు ఎమ్మెల్యే, విప్‌ బాల్క సుమన్‌ చెన్నూరు నియోజకవర్గ రైతులను భద్రాది కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట్‌లోని ఆయిల్‌ పామ్‌ తోటలకు తీసుకెళ్లి అవగాహన కల్పించారు. మిగతా ప్రాంత రైతులను కూడా అశ్వరావుపేట్‌లోని ఆయిల్‌ పామ్‌ తోటలకు తీసుకెళ్తామని వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

మొదటి విడుతలో మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలు..

2019-20 సంవత్సరానికి 2,500 ఎకరాల్లో తెలంగాణ ఉద్యానవన శాఖ ప్రయోగాత్మకంగా ఆయిల్‌ పామ్‌ సాగు ప్రారంభించింది. తెలంగాణలో 246 మండలాలు ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. రాబోయే రెండేళ్లలో తెలంగాణలో 42,250 ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.  దీంతో ఉమ్మడి జిల్లాలోనూ తోటలు సాగు చేయాలని భావిస్తోంది. గోదావరి నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లోని బాసర నుంచి చెన్నూర్‌ మండలం వరకు సుదీర్ఘ దూరం ప్రవహిస్తుండగా.. ఈ పరీవాహక ప్రాంత భూములు అనుకూలమని గుర్తించారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని పెన్‌గంగా సహా బోథ్‌ ప్రాంత కరత్వాడ ప్రాజెక్టు, తాంసి మత్తడి ప్రాజెక్టు, భీంపూర్‌ మండల జెండాగూడ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంత భూములు, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పెన్‌గంగా, ప్రాణహిత నదుల పరీవాహక ప్రాంతం అనుకూలమని సర్వే బృందం నివేదించింది. కేంద్ర ప్రభుత్వ రీ అసెస్‌మెంట్‌ కమిటీ కూడా సర్వే చేసింది. ఆయిల్‌ పామ్‌ సాగుకు గోదావరి పరీవాహక ప్రాంతాన్ని ముందుగా తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లోని ఆయా మండలాల్లో తోటల సాగును ప్రోత్సహించేందుకు నిర్ణయించారు. రెండో విడుతలో ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలను తీసుకోనున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లాలో అధికంగా పత్తి, వరి, సోయాబీన్‌, మక్కజొన్న వంటి పంటలను సాగు చేస్తారు. రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించేందుకు తాజాగా ఆయిల్‌ పామ్‌ తోటలను సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. నీటి వసతి ఉన్న రైతులను ఆయిల్‌ పామ్‌ పంట వైపు మళ్లించేందుకు రైతులకు అవగాహన కల్పించారు.  మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో క్లస్టర్లవారీగా ఏఈవోలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ తదితర నూనె గింజల సాగు క్రమంగా తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో పామాయిల్‌ వాడకం నానాటికీ పెరుగుతున్నది. ఆయిల్‌పామ్‌ ఉత్పత్తులు మన ప్రాంతంలో అంతంత మాత్రమే. నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతంలోనే ఇది పండుతుంది. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడం, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా వాటర్‌ హబ్‌గా మారడంతో ఆయిల్‌పామ్‌ సాగుకు అనువైనదిగా ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌) తేల్చింది. ఇటీవల జిల్లాలో పర్యటించిన ఐసీఏఆర్‌ శాస్త్రవేత్తలు ఆయిల్‌పామ్‌ సాగుకు జిల్లా అనువైన ప్రాంతమని గుర్తించారు. ఏ మండలంలో ఎన్ని హెక్టార్లలో సాగు చేయవచ్చో ఉమ్మడి జిల్లాల ఉద్యాన శాఖ అధికారులకు సూచించారు. ఐసీఏఆర్‌ శాస్త్ర వేత్తల సూచనల మేరకు జిల్లాలో 11,900 హెక్టార్లలో సాగు చేయవచ్చని ప్రణాళికలు వేశారు. ఈ మేరకు కేంద్రం అనుమతి కోసం ప్రతిపాదించారు. 

యాభై ఏండ్లపాటు దిగుబడులు..

ఆయిల్‌పామ్‌ ఒక్కసారి సాగు చేస్తే 30 నుంచి 50 ఏండ్ల సుదీర్ఘ కాలం దిగుబడులు ఇస్తుంది. మురుగు నీరు పోయే సౌకర్యంగల లోతైన ఒండ్రు నేలలు అనుకూలం. మురుగు నీరుపోని చదునైన నల్ల నేలలు, ఉప్పు నేలలు కూడా అనువైనవే. ఇలాంటి నేలలు జిల్లాల్లో పుష్కలంగా ఉన్నాయని ఐసీఏఆర్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. టెనెరా హైబ్రీడ్‌ రకం మొక్కలను ప్రపంచ వ్యాప్తంగా సాగు చేస్తున్నారు. ఈ రకం మొక్కలనే జిల్లాలకు అందించే అవకాశాలున్నాయి. మొక్కల్లో ఆడ, మగ రెండు రకాలు ఉంటాయి. ఈత చెట్లలా ఉండే ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటిన మూడు నుంచి ఐదేళ్లలో దిగుబడులు ఇస్తాయని అధికారులు చెబుతున్నారు. మంచి నీటి యాజమాన్య పద్ధతుల్లో సాగు చేస్తే మూడు నుంచి ఐదేళ్లలో హెక్టారుకు 30 టన్నుల వరకు దిగుబడి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఆయిల్‌పామ్‌ టన్ను ధర 9 వేల నుంచి 10 వేల వరకు ఉంది. ప్రతి సీజన్‌లో ఎకరాకు లక్షకుపైగా ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు.

రైతుకు ఆర్థిక భరోసా..

సాగుకు ఎకరానికి 21,205 ఖర్చు కానుండగా, జాతీయ ఆహార భద్రతా పథకం కింద ప్రభుత్వం మొక్కల కోసం 12,500 సబ్సిడీ ఇవ్వనున్నది. సమగ్ర యాజమాన్యానికి 20 వేలు, అంతర పంటల సాగుకు 20 వేలు రాయితీని కల్పిస్తుంది. డ్రిప్‌ ఇరిగేషన్‌ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తి సబ్సిడీపై, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలను అందించబోతున్నది. ఈ పంట సాగు చేసిన రైతులకు కట్టర్‌ మిషన్‌, మినీ ట్రాక్టర్లను 60 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నది. మొక్కల సరఫరా నుంచి దిగుబడి వచ్చిన తర్వాత మార్కెటింగ్‌ వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఇందుకు ఒక్కో మండలానికి ఒక్కో కంపెనీతో మార్కెటింగ్‌ అగ్రిమెంట్‌ చేయనున్నది. 

అంతర పంటలతో అదనపు ఆదాయం.. 

ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటిన మూడేళ్ల తర్వాతి నుంచే దిగుబడి మొదలవుతుంది. అయితే ఈ ఐదేళ్లలోపు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. కూరగాయలు, పూలు, అరటి, పసుపు, మిరప, అల్లం, వెల్లుల్లి, కంద, నువ్వులు వంటి తోటలను వేసుకోవచ్చు. మూడేళ్ల తర్వాత సాగు చేయడానికి అనుకూలంగా ఉండదు. ఆయిల్‌పామ్‌ తోట చుట్టూ కంచె వెంబడి వెదురు, శ్రీగంధం మొక్కలు పెంచడం వల్ల నిరూపయోగంగా ఉన్న స్థలాన్ని వాడుకలోకి తెచ్చుకోవచ్చు. దీంతో అదనపు ఆదాయం పొందవచ్చు.

ప్రతిపాదనలు పంపించాం..

ఐసీఏఆర్‌ శాస్త్రవేత్తల పరిశీలన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. కరీంనగర్‌ జిల్లాలోని 10 మండలాల్లో 11,900 హెక్టార్లు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే సాగు ప్రణాళికలు అమలు చేస్తాం. ఆయిల్‌పామ్‌ సాగుతో మంచి లాభాలు ఉంటాయి. ఒకసారి నాటిన మొక్క జీవిత కాలం 50 ఏండ్ల వరకు ఉంటుంది. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఇంకా ఎక్కువ కాలం జీవిస్తుంది. రైతులకు మంచి లాభాలు ఆర్జించి పెడుతుంది. ప్రభుత్వ అనుమతి రావాలంటే ఐదారు నెలలు పడుతుంది. ఒక్కో కంపెనీకి ఒక్కో మండల రైతులతో అగ్రిమెంట్‌ చేయిస్తారు. మొక్కల సరఫరా మొదలుకుని దిగుబడుల కొనుగోలు వరకు ఆయా కంపెనీలే చూసుకుంటాయి.

- శ్రీనివాస్‌, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి (కరీంనగర్‌)

సర్వే చేశాం 

ఆయిల్‌పామ్‌ సాగుకు సంబంధించి జిల్లాలో సర్వే చేశాం. అనుకూల వాతావరణం, అనువైన భూములు ఉన్నట్లు గుర్తించాం. పలు మండలాల్లో ఆసక్తి ఉన్న రైతులను సైతం గుర్తించాం. ఇంకా ఎవరైనా చేయదలుచుకుంటే ఉద్యానవన శాఖకు దరఖాస్తు చేసుకోవాలి.  ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా సాగుకు సబ్సిడీ అందిస్తాం. 

- ఎం జ్యోతి,

 జిల్లా ఉద్యానవన అధికారి 

(పెద్దపల్లి)logo