మంగళవారం 07 జూలై 2020
Karimnagar - Jun 05, 2020 , 00:25:15

పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు

పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు

ఈ నెల 20 నుంచి ఆరో విడుత హరితహారం!

సర్వసన్నద్ధంగా అధికారయంత్రాంగం 

ఊరూరా నర్సరీల్లో మొక్కలు సిద్ధం

(కరీంనగర్‌, నమస్తే తెలంగాణ)

అడవుల విస్తీర్ణాన్ని పెంచి, తెలంగాణను పచ్చగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా 2015లో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగం గా ఏటా వానకాలం ప్రారంభంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నది. నాటడంతోపాటు సంరక్షణ చర్యలు చేపడుతున్నది. ఇప్పటి వరకు ఐదు విడుతల్లో కార్యక్రమం నిర్వహించింది. ప్రస్తుతం ఈ నెల 20 నుంచి ఆరో విడుత ప్రారంభించనుండగా, జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది.

అందుబాటులో 81.41 లక్షల మొక్కలు

పంచాయతీ రాజ్‌ చట్టం -2018లో పొందుపర్చిన విధంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. ఈ లెక్కన జిల్లాలోని 313 పంచాయతీల్లో ఏర్పాటయ్యాయి. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ నర్సరీల్లో ప్రస్తుతం 70.37 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పది నర్సరీల్లో మరో 10.39 లక్షల మొక్కలు ఉన్నాయి. ఇవే కాకుండా కరీంనగర్‌ మున్సిపాలిటీ పరిధిలో 30 వేలు, చొప్పదండిలో 6 వేలు, కొత్తపల్లిలో 24 వేలు, జమ్మికుంటలో 5,080 చొప్పున మొత్తం 65,080 మొక్కలు అందుబాటులో ఉన్నాయి. గతంలో లక్ష్యానికి తగిన మొక్కలు దొరకని పరిస్థితి ఉండగా, ఇప్పుడు లక్ష్యానికి మించి ఉన్నాయి. అన్నీ కలుపుకుంటే జిల్లాలో 81,41,124 మొక్కలు ఉన్నాయి.

43.27 లక్షలు లక్ష్యం..

జిల్లాలో 43,27,923 మొక్కలు నాటాలని  వివిధ శాఖలు లక్ష్యాలు విధించుకున్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ సమన్వయంతో కార్యక్రమం నిర్వహిస్తుండగా.. కమ్యూనిటీ, అవె న్యూ, బెన్‌ఫిషరీ ప్లాంటేషన్‌ పేరిట మూడు రకాలుగా నాటుతున్నారు. కమ్యూనిటీ ప్లాంటేషన్‌ కోసం 207, అవెన్యూ ప్లాంటేషన్‌ కోసం 102, బెన్‌ఫిషరీ ప్లాంటేషన్‌ కోసం 58 ప్రదేశాలను ఇప్పటి వరకు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో 37,06,805 మొక్కలు, పట్టణ ప్రాంతాల్లో 6, 21,118 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు మూడు రోజులుగా రోజుకు సగటున 700 చొప్పున గుంతలు తవ్వుతున్నా రు. ఇప్పటివరకు 2,270 తవ్వారు. పూలు, పండ్లు, అటవీ అభివృద్ధి మొక్కలను నర్సరీల్లో ఎక్కువగా పెంచారు. ముఖ్యంగా కానుగ, ఉసి రి, అల్లనేరేడు, చింత, టేకు, నల్లమద్ది, నారేప, సీమ తంగేడు, వేప, గన్నేరు, గులాబీ, మం దార వంటి మొక్కలను ఆయా నర్సరీల్లో పెం చారు. వర్షాలు అనుకూలిస్తే ఈ నెల 20 నుంచి జూలై 31 వరకు ఆరో విడత హరితహారం కా ర్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది.


logo