బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 01, 2020 , 03:50:01

మేలైన విత్తనంతోనే మంచి దిగుబడి

 మేలైన విత్తనంతోనే మంచి దిగుబడి

 • అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
 • అనుమతి ఉన్న, నాణ్యమైన వాటినే కొనాలని సూచన
 • 100కు సమాచార మివ్వాలని విజ్ఞప్తి
 • కట్టడికి జిల్లాల వారీగా తనిఖీ బృందాలు
 • కరీంనగర్‌, చొప్పదండి వ్యవసాయ డివిజన్లు7288894115, 9533484446 

వానకాలం సీజన్‌లో తెల్లబంగారం పండించేందుకు సిద్ధమవుతున్న రైతన్నా జర పైలం! సర్కారు అన్ని రకాలుగా సాయం అందిస్తున్నా, చాపకింద నీరులా దళారుల నుంచి ముప్పు ఉన్నది జాగ్రత్త! తక్కువ ధరకే పత్తి విత్తనాలు వస్తున్నాయని ఆశపడితే అసలుకే ఎసరు రావచ్చు. అన్నీ కలిసొచ్చినా ‘నిషేధిత’, ‘లూజ్‌' సీడ్‌తో నిండా మునిగే ప్రమాదమున్నది. అందుకే అప్రమత్తంగా ఉండండి! ప్రభుత్వం, అధికారులు సూచించినట్లు ‘మేలైన విత్తనం’ ఎంచుకొని, మంచి దిగుబడి పొందండి. ఎక్కడైనా నాసిరకం విత్తనాలు అమ్ముతున్నట్లు మీకు తెలిస్తే, వెంటనే డయల్‌ 100కు సమాచారమిచ్చి, తోటి రైతులను కాపాడండి. - కరీంనగర్‌, నమస్తే తెలంగాణ/ గంగాధర

వానకాలం వచ్చిందంటే నకిలీ, ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు ఏదో రూపంలో జిల్లాకు చేరుతున్నాయి. ఏటా పెద్దసంఖ్యలో పట్టుబడుతున్నాయి. గతేడాది హుజూరాబాద్‌లో లూజ్‌ విత్తనాలు పెద్ద సంఖ్యలో దొరికాయి. అంతకుముందు సంవత్సరం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లోనూ భారీగా చిక్కాయి. తాజాగా తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లి వద్ద నకిలీ సీడ్‌ను పట్టుకోవడం కలకలం రేపింది. ఏటా వ్యవసాయ అధికారులు, పెద్ద ఎత్తున పట్టుకొని, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తూ జైలుకు పంపుతున్నా ఈ దందా ఆగడం లేదని తెలుస్తున్నది. 

అగ్గువని ఆశపడితే అసలుకే మోసం..

ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. మార్కెట్‌లో 450 గ్రాముల బీటీ-2 పత్తి విత్తనాలు, అనుబంధంగా మరో 120 గ్రాముల కంది లేదా నాన్‌ బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్‌ ధర 730. కానీ, గ్రామాల్లో తిరుగుతున్న దళారులు లూజ్‌ విత్తనాలను 550, 600కే అమ్ముతున్నట్లు వెలుగులోకి వస్తున్నది. హెర్బిసైడ్‌ టొలరెంట్‌ (హెచ్‌టీ) ఉన్న బీటీ-3 విత్తనాలను కూడా కట్టబెడుతున్నట్లు తెలుస్తున్నది. మూడు నాలుగేళ్లుగా ఉమ్మడి జిల్లా పరిధిలోని అనేక మండలాల్లో ఈ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇవి సాగు చేస్తే పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అయినా ఏదో రూపంలో ఈ విత్తనాలు పల్లెలకు చేరుతున్నట్లు తెలుస్తుండగా, రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమున్నది. అగ్గువకు వస్తున్నాయని ఆశపడితే అసలుకే మోసం వస్తుంది. నకిలీ విత్తనాలతో పూత, కాత సరిగ్గా లేక, దిగుబడి రాక నిండా మునిగే ప్రమాదమున్నది.

సిరిసిల్ల జిల్లాలో రెండు బృందాలు.. 

వేములవాడ నియోజకవర్గంలో ఒక బృందం, సిరిసిల్ల నియోజకవర్గంలో మరో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఏడీఏ (అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌)తోపాటు ఏవో ఉంటారు. ప్రతి మండలంలో పర్యటించే సందర్భంగా ఆయా మండలాల వ్యవసాయాధికారులు ఈ బృందంలో ఉంటారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏడీఏ భాస్కర్‌ను, వేములవాడ నియోజకవర్గంలో ఏడీఏ వాణిని టాస్క్‌ఫోర్స్‌ బృందంలో నియమించారు. వీరు సోమవారం నుంచి విత్తన దుకాణాలను తనిఖీ చేయనున్నారు.

పెద్దపల్లి జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ టీం.. 

జిల్లాలో ముగ్గురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ టీంను నియమించారు. అందులో పెద్దపల్లి సహాయ వ్యవసాయ సంచాలకుడు విజయభాస్కర్‌, సుల్తానాబాద్‌ ఎస్‌ఐ లింగారెడ్డి, సీడ్‌ సర్టిఫికేషన్‌ ఆఫీసర్‌ నాగరాజు ఉన్నారు. రైతుల ఫిర్యాదులు, తదితర సమాచారం కోసం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో 7288894148 టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు డీఏవో తిరుమల్‌ ప్రసాద్‌ చెప్పారు.

చట్టాలు ఏం చెబుతున్నాయి? 

 • నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై విత్తన నియంత్రణ ఉత్తర్వులు, 1983 (3), పత్తి విత్తన చట్టం 5(1) నిబంధనల విత్తన చట్టం 2007 క్లాజ్‌ 7, అత్యవసర సరుకుల చట్టం 1955 సెక్షన్‌ 7, విత్తన చట్టం 2007 సెక్షన్‌ 12 ప్రకారం జరిమానా విధించవచ్చు.
 • విత్తన డీలర్లు లైసెన్స్‌లు తప్పని సరిగా తమ దుకాణాల్లో ప్రదర్శించాలి. ఈ నిబంధనలు అతిక్రమిస్తే ఉత్తర్వుల సంఖ్య 1993 (15) ప్రకారం డీలర్‌ లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు. 
 • ధరల పట్టిక, స్టాక్‌ బోర్డును విధిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే అమ్మకాలు నిలిపివేసి ఉత్తర్వుల సంఖ్య 1993 (15) ప్రకారం డీలర్‌ లైసెన్స్‌ రద్దు చేయవచ్చు.. 
 • అమ్మకం రసీదు విధిగా ఇవ్వాల్సి ఉంటుంది. రైతులు కూడా తప్పనిసరిగా అడిగి తీసుకోవాలి. ఈ నిబంధన పాటించని డీలర్‌కు విత్తన నియంత్రణ ఉత్తర్వుల సంఖ్య 1993 (9), విత్తన నిబంధనలు 2007 (21) ప్రకారం నోటీసు జారీ చేస్తారు. తప్పును సరిచేసుకోనట్లయితే లైసెన్స్‌ రద్దు చేస్తారు. tలేబుల్‌ లేని ప్యాకెట్లు విక్రయిస్తే డీలర్‌ శిక్షార్హుడు. విత్తన ప్యాకెట్‌ కంపెనీ లేబుల్‌ ఉన్నదా? లేదా? అనేది రైతు చూసుకోవాలి. లేబుల్‌ పూర్తిగా లేక పోయినా, సక్రమంగా లేక పోయినా? విత్తన చట్టం 1966(7), విత్తన నియత్రణ ఉత్తర్వులు 1983 (8), నిబంధనలు 2007 సెక్షన్‌ 3,4,5,6 ప్రకారం ఆ విత్తనాలు జప్తు చేస్తారు. డీలర్‌ లైసెన్స్‌ రద్దు చేస్తారు. అత్యవసర సరుకుల చట్టం 1955 సెక్షన్‌ 7, విత్తన చట్టం 2007 సెక్షన్‌ 12 ప్రకారం జరిమానా విధిస్తారు.
 • కాలం చెల్లిన విత్తనాలు అంటగడితే విత్తన చట్టం 1966 సెక్షన్‌ 7, విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983 (8) (ఆ), పత్తి విత్తన నిబంధనలు 2007 సెక్షన్‌ 4, 5 ప్రకారం విత్తనాలు జప్తు చేస్తారు. డీలర్‌ లైసెన్స్‌ రద్దు చేసి అత్యవసర సరుకుల చట్టం 1955 సెక్షన్‌ 7 పత్తి విత్తన చట్టం 2007 సెక్షన్‌ 12 ప్రకారం జరిమానా విధిస్తారు. tప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పత్తి విత్తనాలు విక్రయించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే విత్తన చట్టం 2007 సెక్షన్‌ 11, నిబంధన 22 ప్రకారం ఆ విత్తనాలను జప్తు చేసి, విత్తన చట్టం 2007 సెక్షన్‌ 12 ప్రకారం జరిమానా విధిస్తారు.
 • పత్తి పంట సాగు చేసి, నిర్ణీత కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు నిర్ణయించిన నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే విత్తన చట్టం 2007 సెక్షన్‌ 7, నిబంధన 28 ప్రకారం విత్తన లైసెన్స్‌ రద్దు లేదా సస్పెండ్‌ చేస్తారు. విత్తన చట్టం 2007 సెక్షన్‌ 12 ప్రకారం జరిమానా విధిస్తారు.

వ్యవసాయ శాఖ డేగకన్ను..

రైతులను నట్టేట ముంచుతున్న దళారులపై వ్యవసాయాధికారులు దృష్టి సారించారు. విత్తనాల పంపిణీపై పర్యవేక్షణ, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు జిల్లాల వారీగా తనిఖీ బృందాలను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే డేగకన్ను పెట్టారు. నకిలీ విత్తనాలు  అమ్మినా, సరఫరా చేసినా పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని నిర్ణయించారు. విత్తన దుకాణాలు, గోదాములు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఇతర అనుమతి లేని ప్రదేశాల్లో నకిలీ, లూజ్‌ విత్తనాలు, నిషేధిత హెచ్‌టీ విత్తనాలు విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సీడ్‌ ఎంపికలో జాగ్రత్తలు

 • సాధారణంగా విత్తనంలో 13 శాతం తేమ ఉన్నప్పుడు విత్తనం బాగా మొలకెత్తుతుంది. ఒకవేళ విత్తనంలో తేమశాతం 14 శాతం కంటే ఎక్కువ ఉంటే విత్తనం బాగా మొలకెత్తదు. నిల్వ చేయడానికి కూడా ఉపయోగపడదు. అందుకే సీడ్‌ కొనేముందు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలి.
 • పరిశోధనా సంస్థ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ గుర్తింపు పొందిన డీలర్ల వద్దే సీడ్‌ కొనాలి. మేలైన విత్తనాలతో అధిక దిగుబడి వస్తుంది. లేకుంటే మోసపోయే ప్రమాదమున్నది. అందుకే రైతులు జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. లూజ్‌గా ఉన్న సంచులు పగిలిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాలు, గడువుదాటిన విత్తనాలను కొనవద్దు. 
 • విత్తనం గట్టితనం, మంచి రంగు కలిగి ఉండాలి. విత్తనానికి నిర్దేశిత మొలక శాతం ఉండాలి. విత్తనాలు అమ్మే డీలర్‌ నుంచి ప్యాకెట్‌ను చెక్‌చేసుకోవాలి. కంపెనీకి సంబంధించిన గుర్తులు ఉన్నాయో? లేదో? చూసుకోవాలి. విత్తనాలకు చెందిన లాట్‌నంబర్‌, బ్యాచ్‌నంబర్‌, తయారీ తేదీని పరిశీలించాలి. 
 • ఎమ్మార్పీకి మించి కొనవద్దు. బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. విత్తన రకం, గడువు తేదీ, కొనుగోలు తేదీ బిల్లులో ఉండాలి. బిల్లుపై రైతుతోపాటు ఆధీకృత డీలర్‌తో కూడా సంతకం ఉండాలి. ఆ బిల్లులను పంట కాలం పూర్తయ్యే దాకా దాచిపెట్టాలి.
 • tవిత్తనాన్ని నాటినప్పుడు వచ్చే పంట కూడా ఒకే విధంగా ఉండాలి. విత్తనానికి ఉండాల్సిన సహజరంగుతోపాటు తాలు, సగం నిండిన గింజ ఉండకూడదు. విత్తనంలో మట్టి పెళ్లలు, దుమ్ము, ధూళి వంటి పదార్థాలు ఏమీ ఉండద్దు. కలుపు, ఇతర విత్తనాలు కూడా లేకుండా ఉండాలి.
 • విత్తనాలు మొలకెత్తే దశలో, పూత దశలో ఏమైనా లోపాలుంటే అధికారులను సంప్రదించాలి. సూచనలు, సలహాలు తీసుకోవాలి.  
 • లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతుల ఇండ్ల వద్దకే వచ్చి విత్తనాలు అమ్మే అవకాశం ఉన్నది. వీరిపై జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి.
 • బీటీ-3 పేరిట విక్రయించే విత్తనాలపై తెలంగాణలో నిషేధం ఉన్నది. ఇలాంటి విత్తనాలు అమ్మినా, కొన్నా కేసులు నమోదు చేస్తారు. నకిలీ విత్తన విక్రేతల వివరాలను 100కి గానీ,        స్థానిక పోలీసులకు గానీ, వ్యవసాయ అధికారులకు తెలియజేయాలి.

కరీంనగర్‌లో రెండు తనిఖీ బృందాలు..

జిల్లాలో నాలుగు వ్యవసాయ డివిజన్లు ఉండగా అధికారులు రెండు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ కమిషనరేట్‌ ఉత్తర్వుల మేరకు ఏర్పాటు చేసిన ఈ బృందంలో ఇద్దరు ఏడీఏలు, ఇద్దరు ఏవోలు ఉన్నారు. కరీంనగర్‌, చొప్పదండి వ్యవసాయ డివిజన్లకు ఏడీఏ (ట్రైనింగ్‌) ఎన్‌ అంజనీ (7288894115), ఏవో సంజీవరెడ్డి (9533484446) స్కాడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక హుజూరాబాద్‌, మానకొండూర్‌ డివిజన్లకు గంగాధర ఏడీఏ జే రామారావు (7288894088), ఏవో బీ సంతోష్‌ (9502593746) స్కాడ్‌గా ఉన్నారు. వీరంతా ఇప్పటికే రంగంలోకి దిగారు.logo