సోమవారం 06 జూలై 2020
Karimnagar - May 30, 2020 , 03:40:45

ఉమ్మడి జిల్లాకే తొలిఫలం.. అడుగడుగునా పారిన గంగ

ఉమ్మడి జిల్లాకే తొలిఫలం.. అడుగడుగునా పారిన గంగ

 • కాళేశ్వర పరవళ్లు..ఊరూరా సిరులు..
 • నాటి ఉమ్మడి జిల్లాలో పుట్టి కొండకేగిన గోదారి
 • సాక్షాత్కరించిన అపరభగీరథుడు కేసీఆర్‌ స్వప్నం
 • పరవళ్లతో తడిసిన మన నేల
 • చరిత్రలోనే మొదటిసారిగా మెట్టను ముద్దాడిన జలాలు
 • నిండుకుండల్లా జలాశయాలు.. గలగలాపారుతున్న కాలువలు
 • మండుటెండల్లోనూ తానమాడుతున్న చెరువులు, కుంటలు
 • ఊరూరా కురిసిన ధాన్యపు సిరులు
 • ఆనందంలో సబ్బండవర్గాలు

ముఖ్యమంత్రికి జేజేలు

అపర భగీరథుడు కేసీఆర్‌ సంకల్ప బలంతో కర్షకుల తలరాతను మార్చేందుకు కదిలిన గోదారి, కాళేశ్వరుడి కటాక్షంతో తన దిశను మార్చుకున్నది. సరస్వతీ, పార్వతీ చూపిన దారిలో పయనిస్తూ.. నందీశ్వరుడి శక్తితో ఉవ్వెత్తున ఎగిసింది. గాయత్రీ దేవి కరుణతో రాజరాజేశ్వరుడి చెంతకు చేరి.. అన్నపూర్ణమ్మ ఆశీర్వాదం తీసుకొని.. రంగనాయకసాగర్‌ను ముద్దాడి కొండపోచమ్మ తల్లి ఒడిలో చేరింది. 

కడలి వైపు పరుగులు తీసే గోదారి, అపర భగీరథుడు కేసీఆర్‌ ప్రయత్నంతో ఎగువకు ఎగబాకింది. మేడిగడ్డ నుంచి ఊర్థముఖంగా ప్రయాణం మొదలు పెట్టి, బరాజ్‌లు, పంప్‌హౌస్‌లు, సొరంగాలు, కాలువలు దాటి వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపోచమ్మ జలాశయాన్ని చేరింది. కేవలం నాలుగేళ్లలోనే లక్ష్యాన్ని ముద్దాడిన కాళేశ్వర ఎత్తిపోతల పథకం, ఉమ్మడి జిల్లాకే తొలిఫలం అందించింది. ప్రతి ఎకరాన్నీ అభిషేకించి, ప్రజల బతుకు చిత్రాన్ని పూర్తిగా మార్చివేసింది. అందుకు ఈ యాసంగిలో వచ్చిన వరిసిరులే నిదర్శనం కాగా, ఇప్పుడు ఏ నోట విన్నా కాళేశ్వరం ముచ్చటే వినిపిస్తున్నది.  

పుట్టినప్పటిసంది ఇన్ని నీళ్లు సూడలె..

నేను నలభై ఏండ్లసంది ఎవుసం జేస్తున్న. నా పుట్టుక నుంచి బాయిల ఇన్ని నీళ్లు సూడలె. యేటా వరి ఏసుడు. బాయిల నీళ్లు ఇంకిపోయి పంట ఎండిపోవుడు. ఇట్ల బాగా నష్టపోయినం. సీఎం కేసీఆర్‌ సారు కష్టపడి ప్రాజెక్టు కట్టి కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చిండు. యాసంగిల మూడెకరాల వరి వేసిన. పక్కనే చెక్‌ డ్యాం కట్టిన్రు. మా ఊరికి నీళ్లు వస్తయని ఎన్నడూ అనుకోలె.

- చింతపూల మల్లయ్య రైతు(ఇందుర్తి)

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణను కోటి ఎకరాల మాగాణిలా మార్చి, తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అపరభగీరథుడి అవతారమెత్తారు. 2016 మే 2న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కీలకమైన లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్‌, లక్ష్మీ (కన్నెపల్లి) పంప్‌హౌస్‌కు పునాదిరాయి వేశారు. దశల వారీగా మిగతా బరాజ్‌లు, పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్ల పనులు ప్రారంభించారు. ఆ సమయంలో ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలినా లెక్కచేయకుండా ముందుకుసాగారు. ‘కాళేశ్వరం నీటితో ఒక్క ఎకరం పారిస్తే మేం దేనికైనా సిద్ధ’మంటూ సవాల్‌ విసిరినా అవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లారు. తరచూ క్షేత్రస్థాయి పర్యటనలతో పనులను పరుగెత్తించారు. అలాగే ప్రగతి భవన్‌ నుంచి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ, వేగవంతం చేశారు. లక్ష్మీ, సర్వస్వతీ, పార్వతీ బరాజ్‌లే కాదు.. ఆసియాలోనే అదిపెద్ద పంప్‌హౌస్‌లను నిర్మించారు. బాహుబలి మోటర్లను వినియోగించారు. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే పూర్తి చేసి, ప్రతి పనిలోనూ రికార్డు సృష్టించారు. సరిగ్గా గతేడాది జూన్‌ 21న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని కన్నెపల్లి పంప్‌హౌస్‌ వేదికగా జాతికి అంకితం చేసి, సాగునీటి రంగ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు.

నాలుగేళ్లలో నెరవేరిన లక్ష్యం..

కాళేశ్వర ఎత్తిపోతల లక్ష్యం నాలుగేళ్లలోనే నెరవేరింది. నిజానికి ఒక ప్రాజెక్టు కట్టాలంటే దతాబ్దాలు గడిచిపోతాయి. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అకుంఠిత దీక్షతో కేవలం నాలుగేళ్లలోనే మూడు బరాజ్‌లు, 19 పంప్‌హౌస్‌లు, 20 రిజర్వాయర్లు పూర్తయ్యాయి. ఇది ప్రపంచ సాగునీటిరంగ చరిత్రలో ఒక రికార్డు. దీని వెనుక అపరభగీరథుడు కేసీఆర్‌ నిరంతర కృషి, తెలంగాణ ఇంజినీర్ల శ్రమ దాగున్నది. తన మానస పుత్రిక అయిన కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత తక్కువ కాలంలో పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్‌ అలుపెరగకుండా శ్రమించారు. శంకుస్థాపన నుంచి ప్రారంభం వరకు పలుసార్లు పర్యటించి అధికారులు, కాంట్రాక్టు సంస్థలను అప్రమత్తం చేస్తూ ముందుకుసాగారు. 2016 మే 2న పూర్వ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, ప్రస్తుత భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఆయన, తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించారు. 2016 డిసెంబర్‌ 7న, 2019 జనవరి 1, 2 తేదీల్లో, 2019 మే 19న, 2019 జూన్‌ 4న ప్రాజెక్టులను సందర్శించి, పనులను పరిశీలించారు. గతేడాది జూన్‌ 21న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి, రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఈ పథకంలో అత్యంత ఎత్తయిన కొండపోచమ్మ రిజర్వాయర్‌ను ప్రారంభించారు.    

ఉమ్మడి జిల్లాకే తొలి ఫలం.. 

కాళేశ్వరం జలాలు తొలి ఫలితాలను కరీంనగర్‌ ఉమ్మడి జిల్లానే అందుకున్నది. మేడిగడ్డ నుంచి తరలివచ్చిన గోదారి ప్రతి ఎకరాన్నీ తడిపింది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద వరద కాలువను నింపడంతో.. మోటర్లు పెట్టుకోవడంతో వేలాది ఎకరాలు సాగయ్యాయి. అలాగే ఈ కాలువ తూములు, ఓటీల ద్వారా వందలాది చెరువులు నిండాయి. ఇటు భూగర్భజలాలు భారీగా పెరిగాయి. గాయత్రీ పంప్‌హౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోసి, శ్రీరాజరాజేశ్వర జలాశయాన్ని పూర్తి స్థాయిలో నింపి, అక్కడి నుంచి దిగువమానేరు జలాశయంలోకి తద్వారా కాకతీయ కాలువ ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టుకు నిరంతరంగా సాగు నీరందించారు. అలాగే వివిధ మార్గాల్లో చెరువులను నింపారు. దీని ద్వారా మెట్ట ప్రాంతంలోనూ జలాలు పరవళ్లు తొక్కా యి. మండుటెండల్లోనూ చెరువులు, కుంటలు మత్తళ్లు దూకుతున్నాయి. కాలువలు గలగలా పారుతున్నాయి. వేలాది ఎకరాలు సస్యశ్యామలమయ్యాయి. రాజన్న సిరిసిల్లలో ఏడాదిలోనే 6 మీటర్ల ఎత్తుకు భూగర్భజలాలు పెరిగిన విషయం యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది. ఏకంగా ముస్సోరిలోని సివిల్‌ సర్వీసెస్‌కు శిక్షణ ఇచ్చే అకాడమీలో ఒక శిక్షణ అంశంగా ఎంపిక చేయడం, కాళేశ్వరం జలాల పుణ్యమే. 

యాసంగిలో ఊరూరా ధాన్యపు రాశులు..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాళేశ్వరం జలాలు సిరులు కురిపించాయి. యాసంగి సీజన్‌లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 60 టీఎంసీల నీటిని లిఫ్ట్‌ చేసి శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయం నుంచి దిగువమానేరు ప్రాజెక్టు (ఎల్‌ఎండీ) ద్వారా సాగుకు నీరందించారు. ఇదే సమయంలో ఎస్సారెస్పీ పునర్జీవం పథకం కింద వరద కాలువను నింపారు. దీంతో భూగర్భ జలాలు పెరగడం, కాలువలో మోటర్లు ఏర్పాటు చేయడం, తూముల ద్వారా వందలాది చెరువులు నింపడం వల్ల సుమారు లక్ష ఎకరాల వరకు సాగయింది. గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 180 రోజుల పాటు కాకతీయ కాలువ నిరంతరంగా పారింది. అంతేకాదు, ఈ కాలువ ద్వారా 6,100 క్యూసెక్కుల వదలడం కూడా ఈసారే సాధ్యమైంది. ఇవేకాదు, ఉమ్మడి జిల్లాలోని 4,365 చెరువుల కింద ఈ సారి 70,461 ఎకరాల్లో వరి సాగయింది. గత యాసంగి సీజన్‌లో ఈ చెరువుల కింద 29,454 ఎకరాలు మాత్రమే సాగు కాగా, ఈ సారి 41,007 ఎకరాలు అదనంగా సాగైంది. మొత్తంగా నాలుగు జిల్లాల్లో 7,92,576 ఎకరాలు వరి వేశారు. గత వానకాలంతో పోలిస్తే యాసంగిలో 1.07 లక్షల ఎకరాల్లో అదనంగా సాగు కాగా, 2.62 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అదనంగా వచ్చే అవకాశమున్నది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం నిండుకుండలా మారడంతో కరువునేల అయిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగు పెరిగింది. అలాగే, కరీంనగర్‌ జిల్లాలో విత్తనోత్పత్తి పెరిగింది. సుమారు 1.60 లక్షల మెట్రిక్‌ టన్నుల సీడ్‌ వస్తుందని అంచనా వేయగా, పెద్దపల్లి జిల్లాలోనూ పెద్ద ఎత్తున సీడ్‌ ఉత్పత్తి జరిగింది. 

బహుళ ప్రయోజనాలు..

కాళేశ్వరం జలాలను ఎగువకు ఎత్తిపోసి నిల్వ చేసేందుకు లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ బరాజ్‌లు, రిజర్వాయర్లు నిర్మించారు. వీటితోపాటు బహుళ ప్రయోజనాలు కలుగనున్నాయి. బరాజ్‌లపై రెండు వరుసల రహదారులను నిర్మించారు. లక్ష్మీ బరాజ్‌ మీదుగా తెలంగాణ- మహారాష్ట్ర మధ్య రాకపోకలు సాగనున్నాయి. సరస్వతీ బరాజ్‌తో జయశంకర్‌ భూపాలపల్లి- మంచిర్యాల జిల్లాలకు, పార్వతీ బరాజ్‌తో పెద్దపల్లి- మంచిర్యాల జిల్లాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడి ఆయా ప్రాంతాలకు దూరం తగ్గింది. 

మారిన బతుకుచిత్రం..

కాళేశ్వర జలాల రాకతో ఉమ్మడి జిల్లాలో ప్రజల బతుకు చిత్రం మారిపోయింది. అన్నదాతలు, మత్స్యకారులు అన్న తేడా లేకుండా.. దాదాపు అన్ని వృత్తులు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. వివిధ వృత్తుల్లో ఉన్నవారు తిరిగి సాగుబాట పట్టారు. నాడు ఉన్న ఊళ్లో ఉపాధి లేక ఎడారిదేశాలకు వలసపోయిన వాళ్లంతా తిరిగి వస్తూ, సేద్యం చేస్తున్నారు. నాడు నీళ్లు లేక బీళ్లుగా వదిలేసిన భూములను తిరిగి సాగులోకి తెచ్చారు. పుష్కలమైన జలాలకు తోడు సర్కారు రైతుబంధు, 24 గంటల నాణ్యమైన కరెంట్‌, సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇస్తుండడంతో ప్రతి ఒక్కరూ మళ్లీ రైతులుగా మారుతున్నారు. ఈ సారి పెరిగిన ఉమ్మడి జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం, పండిన వరిసిరులే అందుకు నిలువెత్తు నిదర్శనం. అలాగే చెరువులపై ఆధారపడిన మత్స్యకారులకు ఇప్పు డు చేతినిండా పనిదొరుకుతున్నది. ఒకప్పుడు నీళ్లు లేక జీవం కోల్పోయిన చెరువులను మిషన్‌ కాకతీయ కింద పునరుద్ధరించడంతో చేపల పెంపకం ఉత్సాహంగా సాగింది. ఈ సారి మత్స్యసంపద మంచిగా ఎదగడంతో మంచి ఆదాయం వస్తున్నది. ఇలా ఎన్నో వర్గాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతున్నది. 

నా ప్రాణం పోయినా సరే. రాబోయే ఐదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరందించి తీరుత. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిరూపిస్త. ఆరు నూరైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే హరిత తెలంగాణను సాధించే వరకు విశ్రమించ. మమ్మల్ని ఎవరైనా ఆపుదామనుకుంటే అది భ్రమే. నాకు ఎల్లప్పుడు అండదండగా ఉంటూ దీవిస్తున్న నా ప్రజల సహకారంతో ప్రాజెక్టులు కట్టి తీరుత.2016 మార్చి 31న శాసనసభా వేదికగా చేసిన ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన చెప్పినట్లుగానే ఏటా వానకాలంలో వృథాగా పోయే నీటికి అడ్డుకట్ట వేశారు. సరిగ్గా మూడేళ్ల వ్యవధిలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని దశల వారీగా పూర్తి చేసి, లక్షలాది ఎకరాలకు గోదారి జలాలు పారిస్తున్నారు. ప్రాజెక్టులు కట్టాలంటే దశాబ్దాలు కావాలి అన్నమాటలను పక్కన పెట్టి, చిత్తశుద్ధి ఉంటే ఏ ప్రాజెక్టునైనా సరే రెండు మూడేళ్లలో పూర్తి చేయచ్చని నిరూపించారు. కేవలం నాలుగేళ్లలో గోదారిని మేడిగడ్డ నుంచి 253 కిలోమీటర్ల దూరం, 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు జలాలను తీసుకెళ్లి, రికార్డు సృష్టించారు.

కేసీఆర్‌ సారుతోనే సాధ్యం

ఎక్కడో కాళేశ్వరంలో ఉన్న నీటిని మావూరిలోని పంప్‌హౌస్‌ ద్వారా ఎత్తిపోసి, వరద కాలువను నిండుకుండలా నింపారు. ఎక్కడి గంగా.. ఎక్కడి నీరు .. ఇక్కడికి చేరి మా ఊరి రైతులందరిని సంతోష పెడుతున్నది. రోహిణి కార్తెలో సైతం నిండుగా నీరు కనిపించడంతో నార్లు పోయడం, పచ్చిరొట్ట విత్తనాలు అలకడం, పనులు ప్రారంభమవుతున్నయి. కేసీఆర్‌ సారుతోనే ఇదంతా సాధ్యమైంది.  

- బద్దం ఎర్రన్న, రైతు, రాంపూర్‌ (మల్యాల) 

చెర్లు నిండుగా ఉన్నయి..

గతంలో మల్యాల, కొడిమ్యాల మండలాల్లో కరువు ఛాయలు ఎక్కువగా కనిపించేవి. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టిండు. మెట్ట ప్రాంతాల్లోకి గోదావరి జలాలు చేరి భూములన్నీ సస్య శ్యామలం అవుతున్నయి. ఈ ఎండల్ల కూడా తాటిపెల్లి, పోతారం చెర్లు నిండుగా ఉన్నయి. రాబోయే తరానికి సైతం సీఎం కేసీఆర్‌ సారు రోల్‌ మోడల్‌గా ఉంటడు. 

- ఇట్టిరెడ్డి అంజిరెడ్డి, యువ రైతు, గుడిపేట (మల్యాల)

ఎండకాలంల మత్తడి దుంకుడు సూడలె..

నాకు 55 ఏండ్లు ఉంటయి. నా పుట్టుకల సంది మా ఊరి చెరువు ఎండకాలంల అలుగు దుంకుడు సూడలె. ఎప్పుడో 16 ఏండ్ల కింద అదీ ఆనకాలంల మత్తడి దుంకింది. ఇగ అప్పటి సంది మళ్ల అలుగు పారలేదు. తెలంగాణ సర్కారు అచ్చినంకనే మూడేండ్లల్ల ఐదుసార్లు మత్తడి దుంకింది. ఎండకాలంల చెరువులు నిండి మత్తడి దుంకుడు ఇప్పుడే మొదటిసారి చూస్తున్న. 

దండుగన్న నోటితోనే పండుగంటున్న..

నేను కండక్టర్‌ ఉద్యోగం చేసి నాలుగేండ్ల కిందట రిటైరయిన. మొదట్ల బాయిల నీళ్లు లేక ఎవుసం చేయడానికి ఇబ్బందైంది. ఒక మక్క వేసేవా డిని. పెద్దగ లాభాలు వచ్చేవి కావు. కాళేశ్వరం నీళ్లు వచ్చినంక మా ఊరు, పక్క ఊళ్ల చెరువులు నింపడంతో నా బావి, బోర్ల నీళ్లు పైకి వచ్చినయ్‌. యాసంగిలో మూడెకరాలు సాగు చేసిన. 120 బస్తాల వడ్లు పండించిన. ఎకురంన్నరల బొప్పాయి సాగు చేస్తున్న. అప్పుడు ఎవుసం దండుగన్న నోటితోనే ఇప్పుడు పండుగ అంటున్న. నేనే ఎంతో మంది ఇదే మాట అంటున్నరు. కేసీఆర్‌ను పొగుడుతున్నరు.  

- కొమ్మెర సుధాకర్‌రెడ్డి, గుండ్లపల్లి (గన్నేరువరం)

మాకు కాళేశ్వరమే ఆధారం..

నాకు రెండెకరాలు ఉన్నది. మరో నాలుగెకరాలు మా దోస్తుతో కలిసి కౌలుకు చేస్తున్నం. మా పొలాలు కాలువకు 300 మీటర్ల దూరంల ఉంటయి. కాలువ నుంచి పైపులైన్‌ ఏసుకొని రెండెకరాలు పొలం జేసినం. ఇంకో రెండెకరాలు కందగడ్డ వెట్టినం. రెండెకరాలల్ల పత్తేసినం. అన్ని పంటలు మంచిగనే పండినయి. లాగోడి పోను మంచి లాభం వచ్చింది. అచ్చిన పైసలకు మరిన్ని కలుపుకొని ట్రాక్టర్‌ కొనుక్కున్నం. ఇయ్యాళ్ల మాకు కాళేశ్వరం ప్రాజెక్టే ఆధారమైంది. నీళ్లకైతే రందిలేదు. మా ఊరు నుంచి మస్తుమందిమి కాలువకోసం భూములిచ్చినం. మా పొలాలు పోయిన బాధలేదు. ఎందుకంటే కాలువల మస్తు నీళ్లు ఉంటున్నయి. ఇంతకంటె ఏంగావాలె.

- మామిడి కుమారస్వామి, రైతు (రామడుగు)

నా ఎరుకల ఇన్ని నీళ్లస్తయినుకోలె..

మాది మెట్ట ప్రాంతం. వానకాలంలనే బావులల్ల నీళ్లుండేవి. యాసంగికి కరువుండేది. బోర్లు, బావుల మీదనే ఆధారపడి ఎవుసం జేసేటోళ్లం. నాట్లు గూడ తక్కువ ఏసెటోళ్లం. పోయిన యాసంగికి ముందు మా ఊరి చెరువులకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లచ్చినయి. గతంల ఎప్పుడూ ఇట్ల నీళ్లు రాలె. కేసీఆర్‌ సారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బీళ్లకు నీళ్లిస్తున్నడు. నా ఎరుకల నేనెప్పుడూ ఇన్ని నీళ్లు వస్తయనుకోలె. ఈ ఎండకాలంల కూడ మా ఊరి చెరువుల నీళ్లుండుడు చూస్తె సంబురమనిపిస్తంది.

- పరుకాల నారాయణ, రైతు, దుద్దనపల్లి (సైదాపూర్‌) 

బీడు భూములను దున్నుకున్నం..

అసంపల్లి వద్ద వరద కాల్వ తవ్వినప్పటి నుంచి వరద రాక మాకు నీళ్లు రాలె. భూములను ఎండబెట్టుకున్నం..గ్రానైటోళ్లకు అమ్ముకున్నం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల మా ఊరు చెరువు నిండింది. ఈ సంవత్సరం బీడు పడ్డ భూములను దున్ని పంటలు పండించుకున్నం.  - పెద్ది వెంకన్న, ఆసీఫ్‌నగర్‌(కరీంనగర్‌రూరల్‌)

రంది లేకుంట వోయింది..

నాకు నందిమేడారంల 30 గుంటల భూమి ఉన్నది. కాలువలున్నా నీళ్లు పారక వానకాలంల మాత్రమే సాగు చేసేది. లేదంటే పడావే. ఏదో ధైర్యం చేసి పంటలేసినా నీళ్ల కోసం ఆగమయ్యేది. కేసీఆర్‌ సార్‌ దేవుని లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రంది లేకుంట చేసిండు. మా నందిమేడారం చెరువును పెద్దగా చేసినంక నా భూమికి మస్తు నీళ్లత్తన్నయ్‌. ఏడాదికి మూడు పసళ్లు పండిత్తున్న. నా ఒక్కని పొలమే కాదు మా ఊరు పొంటి ఉన్న 600 ఎకరాలకు నీళ్లచ్చి బంగారం పండుతున్నది.  

- బోరకుంట రాజయ్య, రైతు నంది మేడారం (ధర్మారం)

బతుకునిచ్చిన గంగమ్మ

 • గోదారి నీళ్లతోనే ఎవుసానికి ప్రాణం
 • చెరువులు నిండినయ్‌.. మత్తళ్లు దుంకినయ్‌
 • బీళ్లన్నీ సాగైనయ్‌.. పొలాలు పండినయ్‌.. 
 • సంబురపడుతున్న అన్నదాతలు

కాళేశ్వరం నుంచి ఎదురెక్కిన గంగమ్మ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నకు.. చుక్క నీరు లేక నెర్రెలు బారిన చెరువులకు.. తుమ్మలు మొలిచి బీళ్లు వారిన పొలాలకు బతుకునిచ్చింది.. ఒకప్పుడు దండుగలా మారిన ఎవుసానికి పంపుల ద్వారా ఉబికి వచ్చి ప్రాణం పోసింది. అపరభగీరథుడు సీఎం కేసీఆర్‌ చేసిన కృషితో చెరువులు నిండినయ్‌.. మత్తళ్లు దుంకినయ్‌.. బీళ్లన్నీ సాగైనయ్‌.. పొలాలు పండినయ్‌.. ఇప్పుడు మెట్ట, మాగాణి అని తేడా లేకుండా బంగారు పంటలు పండించిన అన్నదాత మోములో నవ్వులు విరుస్తున్నయ్‌.. రైతు కుటుంబాలు సంతోషంతో గడుపుతున్నయ్‌.               - నెట్‌వర్క్‌

నీళ్ల కోసం తల్లడిల్లినం.. 

తాగు, సాగు నీళ్ల కోసం తల్లడిల్లినం. చుక్క నీళ్ల లేని శెర్లను, కుంటలను ఇట్ల గోదావరి నీళ్లతో నింపి ఒర్రెలు పారించుడు ఎన్నడూ సూడలె. మా నీళ్ల గోసను ముఖ్యమంత్రి తీర్చిండు. ఊరిలోని బర్లోని కుంట, వెన్న కుంట, పెద్ద చెరువులు అలుగు పారుతున్నది. మస్తు సంబురంగా ఉన్నది. ఇగ అందరికీ చేతి నిండా పని ఉంటది. నీళ్లు లేక పొలాలు జేయని రైతులు ఇప్పడు కొత్తగా అచ్చుకట్టుకుంటున్నరు. మాకు నీళ్ల కరువు రాకుండా చేసిన కేసీఆర్‌ సారుకు దండాలు.

- జోగు చంద్రయ్య, రైతు, రేపాక (ఇల్లంతకుంట)

సాగునీటికి ఢోకా లేదు..

దేశాయిపల్లి వరద కాలువ పక్కన నాకు పదెకరాల భూమి ఉన్నది. పత్తి, మక్క వేస్తుండె. నీళ్లు లేక గోసయ్యేది. ఇప్పుడు వరద కాలువలో ఎప్పుడూ నీళ్లుంటున్నయి. సాగు నీటికి ఢోకా లేదు. వరి, ఇతర పంటలు వేస్తున్న. సీజన్‌ బట్టి కూరగాయలు పండిస్తున్న. ఇంతకముందు కాంగ్రెస్‌, టీడీపీ గవర్నమెంట్లు రైతులను పట్టించుకున్న పాపాన పోలెన. సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి, చివరి మడికీ కాలువల ద్వారా సాగునీరందిస్తున్నడు.  

- పెండ్యాల మహిపాల్‌రెడ్డి, రైతు, దేశాయిపల్లి (బోయినపల్లి)

సాగు ప్రాంతం జేసిండు.. 

నా చిన్నప్పటి సంది జూత్తున్న. అంతా కరువే ఉండేది. వర్షాలు పడి, శెర్లకు నీళ్లత్తే ఆ కట్ట కింద కొన్ని నీళ్లు పారుతుండె. ఇప్పడు కేసీఆర్‌ సారు మా ప్రాంతాన్ని పచ్చగ జేసిండు. సుర్రుమనే ఎండల్ల గుడ మత్తడి దుంకిపిచ్చిండు. వానకాలం లెక్క ఎక్కడ జూసినా ఒర్రెలు వారుతున్నయి. నేను మా పెద్ద చెరువు అలుగు దుంకంగ చూడక 10 ఏైండ్లెతాంది. గిప్పుడు అలుగు దుంకుడు కండ్ల జూసిన. ఇసోంటి రోజులు వస్తయనుకోలె. ఇప్పటి నుంచి ఏమేసినా పండుతది. గోదారమ్మ నీళ్లను సూసి సంతోషమైతంది.     

- చెలిమెల బలరాం రెడ్డి, రైతు, రేపాక (ఇల్లంతకుంట)

కొత్త ట్రాక్టర్‌ కొనుక్కున్న.. 

తెలంగాణ రాకముందు నెర్రెలు బారిన చెరువునే నేను జూసిన. అసలు మా ఊరి చెరువు మత్తడి దుంకుతదని కలలగూడ అనుకోలె. అసొంటిది ఆర్నెళ్లలో రెండు సార్లు అలుగు దుంకింది. ఇది మామూలు ముచ్చట గాదు. నాకు పదెకరాల ఎవుసం భూమి ఉన్నది. గతంల ఎండకాలం బీడువడి ఉండేది. సీఎం కేసీఆర్‌ సార్‌ కాళేశ్వరం ప్రాజెక్టుతోని వరద కాలువకు నీళ్లు ఇచ్చిండు. అక్కడి నుంచి మా ఊరి చెరువును నింపిన్రు. ఎండకాలంల చెరువు అలుగు దుంకుడు చూస్తనని అనుకోలె. మొన్న యాసంగికి ఎనిమిదెకరాల పొలం పారింది. 200 క్వింటాళ్ల వడ్లు పండినయి. అచ్చిన పైసలతోని కొత్త ట్రాక్టర్‌ కొనుక్కున్న. వానకాలం.. ఎండకాలం అని సూడకుంట పంటలు వేసుకునేలా జేసిన కేసీఆర్‌ సారు నిజంగ రైతు కుటుంబాలకు దేవుడు.

- ముదుంగటి శ్రీనివాస్‌రెడ్డి, రైతు, గట్టుభూత్కూర్‌(గంగాధర) 

భూములిచ్చినందుకు గర్వపడుతున్ననం..

కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కొండ పోచమ్మకు చేరినయని తెలిసి మస్తు సంతోషమైతంది. ప్రాజెక్టు కోసం భూములిచ్చినందుకు గర్వపడుతున్నం. సీఎం కేసీఆర్‌ లేకపోతే రైతుల పరిస్థితి ఘోరమయ్యేది. ఈ ప్రాజెక్టుతోనే ఇయ్యాల మస్తు పంటలు పండుతున్నయ్‌. సార్లు కావాలంటే నందిమేడారం రిజర్వాయర్‌ కోసం మా ముగ్గురు అన్నదమ్ముల పొత్తుల భూమి 21 ఎకరాలు ఇచ్చినం. ఇంకా కావాలంటే మళ్లో తొమ్మిదెకరాలు ఇచ్చినం. ఆ పైసలతో జగిత్యాల జిల్లాల పదిన్నర ఎకరాలు కొనుకున్నం. కాళేశ్వరం నీళ్లతో రందిలేని ఎవుసం చేస్తున్నం. 

- మిట్ట సత్తయ్య, రైతు, నంది మేడారం (ధర్మారం)

పదేళ్లు దుబాయి వోయిన..

ఊళ్లె ఉపాధి లేక పదేళ్లు దుబాయి వోయిన. అక్కడా పని దొరక్క శానా ఇబ్బందులు వడ్డ. మళ్లీ ఇంటికచ్చిన. హోటల్‌ నడుపుకుంటున్న. కాళేశ్వరం జలాలతో కోరెంలోని కిష్టమ్మ చెరువు నిండింది. ప్రభుత్వం ఉచితంగనే ఇచ్చిన చేప పిల్లలను ఆ చెరువులో వేసి పెంచుకుంటున్నం. మత్స్యకారులమంతా కలిసి మొన్ననే పట్టినం. హోల్‌సేల్‌గా, లేదా రిటైల్‌గా అమ్మినం. మాకు చేతి నిండా ఉపాధి దొరికింది. సీఎం కేసీఆర్‌ సారుకు కృతజ్ఞతలు.

- జెట్టి ఐలయ్య, కోరెం మత్స్య కార్మిక సంఘం అధ్యక్షుడు (బోయినపల్లి)

రికార్డుల మోత 

 • మేడిగడ్డ బరాజ్‌ వద్ద ఒకే రోజులో 16,722 క్యూబిక్‌ మీటర్ల కాంక్రిట్‌ పనులు చేశారు. 
 • లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి సరస్వతీ పంప్‌హౌస్‌ దాకా నిర్మించిన గ్రావిటీ కాలువ నిర్మాణ పనుల్లో ఒకే రోజు 1.50 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని వెలికి తీశారు. బరాజ్‌ నిర్మాణం చరిత్రలో ఇదే తొలిసారి. 
 • కేవలం నాలుగు నెలల్లో 1.80 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి వెలికి తీసిన రికార్డు కూడా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోనే ఉంది. 
 • వివిధ బరాజ్‌ల నిర్మాణం జరిగినప్పుడు రోజుకు 2.50 లక్షల సిమెంట్‌ బస్తాలను వినియోగించారు. 
 • ప్రతిపక్షాలు వేసిన కేసులను దీటుగా ఎదుర్కొంటూ.. అన్ని అనుమతులు సాధించడంలోనూ రికార్డు ఉంది. 
 • లక్ష్మీ బరాజ్‌ నుంచి కొండపోచమ్మ జలాశయం వరకు.. ప్రతి పనిలోనూ ఒక రికార్డు సాధించింది. 
 • బాహుబలి లాంటి మోటార్ల బిగింపు.. సొరంగాలు పూర్తి చేయడంలోనూ రికార్డులున్నాయి. 
 • ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో మూడు పంప్‌హౌస్‌లను నిర్మించి, 120 కిలోమీటర్ల పొడవునా వరదకాలువను నాలుగు రిజర్వాయర్లుగా చేశారు. 
 • ఎల్‌ఎండీ నుంచి చరిత్రలోనే దిగువకు 55 టీఎంసీలకుపైగా నీటి విడుదల 
 • సుమారు 155 రోజుల పాటు కాకతీయ కాలువకు నిరవధికంగా నీటి విడుదల  
 • ఎస్సారెస్పీ స్టేజ్‌-2 పరిధిలోని అన్ని చెరువులను నింపడం, పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరందించడం ఎస్సారెస్పీ చరిత్రలో మొదటి సారి.

ప్రాజెక్టులో విశేషాలు.. logo