శుక్రవారం 10 జూలై 2020
Karimnagar - May 30, 2020 , 03:17:43

తల్లిని ఇంట్లోకి రానివ్వని కన్నకొడుకు

తల్లిని ఇంట్లోకి రానివ్వని కన్నకొడుకు

  • కరోనా లేదన్నా కనికరించలేదు..
  • వైరస్‌ లేదన్నా వినని తనయుడు 
  • స్క్రీనింగ్‌ పరీక్షల తర్వాత.. అధికారుల కౌన్సెలింగ్‌
  • ఆ తర్వాత ప్రత్యేక గదిలోకి అనుమతి 

కార్పొరేషన్‌ :  కరోనా వైరస్‌ విజృంభిస్తున్న మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఉన్న బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళ్లి వచ్చిన ఓ వృద్ధురాలిని ఇంటి గేటు బయటే నిలబెట్టాడో కొడుకు.. ‘పరీక్షలు చేయించుకున్న తర్వాతనే ఇక్కడికి పంపించారు బిడ్డా.. నాకు కరోనా లేదురా’ అన్నా వినకుండా, గంటల తరబడి ఎండలో నిలబెట్టి కర్కషంగా వ్యవహరించాడు. ఆ వృద్ధురాలి దుస్థితిని కండ్లారా చూసిన స్థానికులు ఆదరించి అల్పాహారం అందించగా, వైద్యాధికారులు వచ్చి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించిన తరువాతే ఇంట్లో ఆమెను ప్రత్యేకంగా ఉన్న గదిలో రానిచ్చాడు.

కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన ఎనభై ఏళ్ల కట్ట శ్యామల అనే వృద్ధురాలు మార్చిలో లాక్‌డౌన్‌కు ముందు షోలాపూర్‌లోని ఆమె బంధువుల ఇంట్లో శుభకార్యం జరిగితే వెళ్లింది. మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ విధించడంతో అక్కడే చిక్కుకుపోయింది. ఇన్నాళ్లూ బంధువుల ఇంటిలోనే ఉంటూ ప్రతి రోజూ ఇక్కడి తన కొడుకుల గురించి తలుచుకుంటూ గడిపింది. వారు ఎలా ఉన్నారో అనే ఆందోళనతో క్షణ క్షణం గడిపిన శ్యామల, లాక్‌డౌన్‌ సడలింపు ఇవ్వడంతో గురువారం షోలాపూర్‌ నుంచి ఓ ప్రైవేటు వాహనంలో హైదరాబాద్‌కు చేరుకుంది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఆర్టీసీ బస్సులో కరీంనగర్‌లోని తన ఇంటికి చేరుకుంది. దాదాపు మూడు నెలల తర్వాత ఇంటికి చేరుకున్న తనను చూసి కొడుకులు సంతోషిస్తారని అనుకుంది. అమ్మా వచ్చావా.. అంటూ అక్కున చేర్చుకుంటారని ఆశపడింది. కానీ, తన పెద్దకొడుకు కట్ట నర్సింహాచారి ఇంటి గేటు ముందే నిలిపేశాడు. తన ఇంటికి రావద్దని గేటుకు తాళం వేశాడు. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న భయం తన తల్లి అన్న మమకారం కూడా లేకుండా చేసింది. తనకు వైద్య పరీక్షలు చేశారని, ఎలాంటి రోగమూ లేదని తేలిన తర్వాతనే పంపించారని ఎంత మొత్తుకున్నా ఆ కొడుకు కనికరించలేదు. వృద్ధురాలన్న దయ చూపకుండా ఎర్రటి ఎండలో నిలబెట్టాడు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్‌ కంసాల శ్రీనివాస్‌ నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బంది ద్వారా వృద్ధురాలికి టిఫిన్‌ అందించారు. నగరపాలక అధికారులకు సమాచారం అందించారు. వీరితోపాటు టీఆర్‌ఎస్‌ నాయకుడు ఎడ్ల అశోక్‌ స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైద్యాధికారులు వచ్చి వృద్ధురాలికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. జ్వరం, కరోనా లక్షణాలు లేకపోవడంతో హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. తల్లిని రానివ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు కంసాల శ్రీనివాస్‌, ఎడ్ల సరిత అశోక్‌ శ్యామల కొడుకు నర్సింహాచారికి నచ్చజెప్పారు. ఆ ఇంట్లోనే వృద్ధురాలిని ప్రత్యేకంగా ఓ గదిలో ఉంచాలని సూచించారు. ఎట్టకేలకు దిగివచ్చిన నర్సింహాచారి తన తల్లి శ్యామలను ఇంట్లోకి రానిచ్చాడు. కాగా స్థానికులు ‘కరోనా కాలం ఏం చేద్దాం’ అంటూ నిట్టూర్చారు.logo