ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - May 29, 2020 , 01:33:28

తండ్రికి పిండ ప్రదానం చేస్తూ మృత్యు ఒడికి..

తండ్రికి పిండ ప్రదానం చేస్తూ మృత్యు ఒడికి..

చెరువులో పడి కొడుకు మృతి

12 రోజుల వ్యవధిలోనే తండ్రీకొడుకుల మరణం 

కరీంనగర్‌ క్రైం : తండ్రికి పిండప్రదానం చేస్తూ అతని పెద్దకొడుకు కాలుజారి చెరువులో పడి మృత్యువాత పడ్డాడు. 12 రోజుల వ్యవధిలోనే తండ్రీ కొడుకులు మరణించడంతో ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది. కొత్తపల్లి చెరువు వద్ద జరిగిన ఈ ఘటన సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని హిందూపురికాలనీకి చెందిన అన్‌రెడ్డి కొండల్‌రెడ్డి 12 రోజుల క్రితం మృతి చెందాడు. ద్వాదశ దినకర్మ సందర్భంగా అతని కొడుకు కురేందర్‌రెడ్డి(38) బుధవారం శ్రాద్ధ కర్మలు నిర్వహించి పిండాలను కొత్తపల్లి చెరువులో కలిపేందుకు సోదరుడు ప్రణవేందర్‌రెడ్డితో కలిసి వెళ్లాడు. శాస్ర్తోక్తంగా పిండాలను చెరువులో కలిపి స్నానం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి నీట మునిగాడు. ఈత రాకపోవడంతో కేకలు వేయడంతో సోదరుడు ప్రణవేందర్‌రెడ్డి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. వెంటనే అతన్ని బయటికి తీసి హుటాహుటిన దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే కొన ఊపిరితో ఉన్న కురేందర్‌రెడ్డి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. తండ్రికి శ్రార్ద కర్మలు నిర్వహించిన కొడుకు కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుడి సోదరుడు ప్రణవేందర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపల్లి ఎస్‌ఐ ఎల్లాగౌడ్‌ తెలిపారు. నీట మునిగి ఈత రాకపోవడం వల్లే మృతిచెందాడని, అతని మరణంలో ఎలాంటి అనుమానమూ లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


logo