మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - May 29, 2020 , 01:35:36

వడ్లే.. వడ్లు

వడ్లే.. వడ్లు

 జిల్లాలో ఊరూరా ధాన్యపు సిరులు

 ఇప్పటికే 3.06 లక్షల టన్నుల సేకరణ

 రూ.562.63 కోట్లతో కొనుగోళ్లు

 మానకొండూర్‌, గంగాధరలో అత్యధికం

కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఈసారి యాసంగిలో ధాన్యపు రాసులు కురిపించాయి. ఇప్పటికే రూ.562.63 కోట్ల పంటను రైతులు విక్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలకు ఇంకా పెద్ద మొత్తంలో ధాన్యం దిగుబడులు వస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్‌ ప్రబలుతున్న ప్రత్యేక పరిస్థితుల్లో కొనుగోళ్లు ప్రారంభించిన అధికారులు ఎక్కడా ఎలాంటి ఆటంకాలూ లేకుండా కేంద్రాలను కొనసాగిస్తున్నారు. 3.60 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ లక్ష్యం కాగా, 3.06 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించారు.

- కరీంనగర్‌, నమస్తే తెలంగాణ

ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత జిల్లాలో మొదటిసారి యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో అగ్గి తెగులు, మెడవిరుపు తెగులు కారణంగా తాలు వచ్చినప్పటికీ అనేక ప్రాంతాల్లో ఆశించిన రీతిలో దిగుబడి వచ్చింది. ఫలితంగా కొనుగోలు కేంద్రాలను ధాన్యం ముంచెత్తింది. గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో దిగుబడులు పెరిగాయి. మార్చి చివరి వారంలో కొనుగోళ్లు ప్రారంభించిన అధికారులు 3.60 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ లక్ష్యంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. ఐకేపీ, ప్యాక్స్‌, డీసీఎంఎస్‌, మె ప్మా, హాకా సంస్థల ద్వారా 338 కేంద్రాలు తెరిచారు. వాటి ద్వారా ఇప్పటి వరకు రూ.562.63 కోట్ల విలువైన 3,06,713 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటికే 145 కేంద్రాల్లో కొనుగోళ్లు ముగిసాయి. మిగతా కేం ద్రాల్లో ఇంకా కొనుగోళ్లు జరుపుతున్నారు. కరో నా నేపథ్యంలో పలు ఆటంకాల మధ్య కొనుగోళ్లు ప్రారంభించిన అధికారులు, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా కొవి డ్‌-19 నిబంధనలు పాటిస్తూ ము గింపు దశకు తెచ్చారు. కేంద్ర ప్రభు త్వం గన్నీ బ్యాగులు అందించకు న్నా స్థానిక మిల్లులు, రేషన్‌ దుకాణాల్లో సేకరించి అవసరానికి వాడుకున్నారు. కొనుగోళ్లు సజావుగా సాగేందుకు కలెక్టర్‌ శశాంక ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌, పౌరసరఫరాల శాఖ అధికారులు అనునిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. 

రూ. 562.63 కోట్ల ధాన్యం సేకరణ

జిల్లాలో ఇప్పటి వరకు 53,630 మంది రైతుల వద్ద రూ.562.63 కోట్ల విలువైన 3,06,713 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 48,360 మంది రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. 35,154 మంది రైతులకు సంబంధించిన రూ.346.45 కోట్లు ఇప్పటికే చెల్లింపులు జరిపారు. ఇంకా, కేవలం 13,206 మంది రైతులకు సంబంధించిన రూ.121.13 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగుదు జమ చేస్తున్నారు.

కొనసాగుతున్న కొనుగోళ్లు 

జిల్లాలో 79 ఐకేపీ కేంద్రాల ద్వారా 87,714.180, ప్యాక్స్‌ కేంద్రాల ద్వారా 1,86,383.186, 41 డీసీఎంఎస్‌ కేంద్రాల ద్వారా 28,126.400, ఒక మెప్మా కేంద్రం ద్వారా 2,610.000, హాకా ద్వారా 1,880.080 చొప్పున ఇప్పటి వరకు 3,06,713.846 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ధాన్యం నిల్వలను ఎప్పటికప్పుడు తరలించేందుకు అన్ని చర్యలు తీ సుకుంటున్నారు. అన్ని ఏజెన్సీల ద్వారా ఇప్పటి వరకు సేకరించిన ధాన్యంలో 3,05,084.506 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించారు. ఇంకా కేవలం 1,629.340 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కేంద్రాల్లో ఉందంటే అధికారులు ఎంత వేగంగా తరలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇతర జిల్లాలతో కలిపితే పెరుగుదల.. 

ఇతర జిల్లాల నుంచి ఇక్కడి మిల్లర్లకు ధాన్యం కేటాయించారు. ఫలితంగా జిల్లా మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు పెరుగుతున్నాయి. ఆయా జిల్లాల్లో సామర్థ్యం మేరకు మిల్లులు లేక పోవడంతో ఈ కేటాయింపులు చేస్తున్నారు. నిర్మల్‌ నుంచి 1.60 లక్షల మెట్రిక్‌ టన్నులు కేటాయించగా ఇప్పటి వరకు 20,804, ఖమ్మం నుంచి 50 వేల మెట్రిక్‌ టన్నులు కేటాయించగా 34,135, మంచిర్యాల నుంచి 20 వేల మెట్రిక్‌ టన్నులు కేటాయించగా 4,500, వరంగల్‌ అర్బన్‌ నుంచి 20 వేల మెట్రిక్‌ టన్నులు కేటాయించగా 2,605.200 చొప్పున ఇప్పటి 62,044 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తరలించారు. ఈ జిల్లాల నుంచి మన మిల్లర్లకు 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించినట్లు అధికారులు తెలిపారు. 

రెండు మండలాల్లో అత్యధికం 

జిల్లాలోని మానకొండూర్‌, గంగాధర మండలాల్లో అత్యధికంగా ధాన్యం దిగుబడులు వచ్చాయి. మానకొండూర్‌ మండలం ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఆయకట్టు పరిధిలో ఉండగా గంగాధరకు వరదకాలువ, ఎల్లంపల్లి ద్వారా కొత్తగా కాళేశ్వరం జలాలు అందాయి. యాసంగిలో మానకొండూర్‌ మండలంలో 15,129 ఎకరాల్లో వరి సాగు చేయగా 29,895.68 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. గంగాధరలో 15,802 ఎకరాల్లో వరి సాగు చేయగా 29,829.64 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇంకా అనేక మండలాల్లో 25 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి దాటింది. శంకరపట్నం, కరీంనగర్‌ రూరల్‌ మండలాల్లో అంచనాలకు మించి ధాన్యం దిగుబడులు వచ్చాయి. శంకరపట్నంలో 4,697 ఎకరాల్లో వరి సాగు చేయగా 11,762.70 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ, ఇప్పటికే 13,567.37 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇక కరీంనగర్‌రూరల్‌లో 5,893 ఎకరాల్లో సాగు చేశారు. 14,143.63 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా ఇప్పటికే 22,045.90 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తంగా ఇప్పటికే 93.34 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశారు. ఇంకా 21,659.00 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 


logo