శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - May 29, 2020 , 01:33:33

దూదిపూలు పూయాలి.. సన్నాలు మెరవాలి..

దూదిపూలు పూయాలి.. సన్నాలు మెరవాలి..

అందరూ ఒకే రకం పంటేస్తే మునుగుతం. కొనేటోళ్లు లేక లాగోడి సుతం ఎల్లక ఆగమైతం. ఇగురంతో ఎవుసం జేస్తేనే గట్టెక్కుతం. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలు వేస్తేనే ఇంత లాభపడుతం. ఇదీ రాష్ట్ర సర్కారు సరికొత్త నినాదం. నియంత్రిత సేద్యంవైపు మళ్లించి, రైతులను రాజులను చేయడమే ముందున్న లక్ష్యం. అందుకు అనుగుణంగానే జిల్లాల వారీగా వానకాలం పంటల ప్రణాళిక ఖరారు కాగా, రైతాంగం సమాయత్తమవుతున్నది. ‘కేసీఆర్‌ మాటే.. మా బాట’ అంటూ ఊరూరా ప్రతిజ్ఞలు చేస్తూ, ముందుకు ‘సాగు’తున్నది.    

   - కరీంనగర్‌, నమస్తే తెలంగాణ

 కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ‘సన్నాలు పం డాలె.. దూది పూలు పూయాలె.. ’ అంటూ సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన నియంత్రిత సేద్యంపై ఉమ్మడి జిల్లా రైతులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వరి సాగుకు కేంద్ర బిందువుగా, తెలంగాణ ధాన్యాగారంగా పేరుగాంచిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నేడు మారిన వానకాలం పంటల వైపు ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాల వారీగా ప్రణాళిక ఖరారు కాగా, ఆ మేరకు సమాయత్తమవుతున్నారు. గతంలో ఇక్కడ దొడ్డు రకం వరితో పాటు, మక్క అధికంగా పండించేవారు. అయితే మక్కకు అంతర్జాతీయంగా ఆదరణ లేకపోవడం తో రైతులకు మద్దతు ధర రావడం లేదు. అలాగే దొడ్డురకం ధాన్యం విషయంలో కూడా మార్కెట్‌ సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు సన్న రకాలను పండించాలని, డిమాం డ్‌ ఉన్న పంటలే వేసేందుకు సిద్ధమవుతున్నారు. 


అదనుకు ముందే పంటలు.. 

గత ప్రభుత్వాల పట్టింపులేమితో చిక్కిశల్యమైన రైతన్న పరిస్థితి స్వరాష్ట్రంలో పూర్తిగా మారిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, 24 గంట ల ఉచిత కరెంటు, అదునుకు ముందే అందే పెట్టుబడి సాయంతో ఇవ్వాళ ధాన్యపు సిరులు కురిపిస్తున్న రైతులు అదునుకు ముందే కేసీఆర్‌ చెప్పిన నియంత్రిత సేద్యానికి శ్రీకారం చుట్టారు. ఎరువులు, విత్తనాలు ముందుగానే రావడం, కాళేశ్వరంతో పుష్కలంగా జలవనరులుండడం, మండు వేసవిలోనూ చెరువులు నిండుకుండలుగా మారడంతో రోహిణి కార్తెలో నారు పోసుకుంటున్నారు. జిల్లాల వారీగా మారిన వానకాలం పంటల ప్రణాళిక ప్రకారం నియంత్రిత సేద్యంవైపు కదులుతున్నారు. పంట చేలను సిద్ధం చేసుకొని, ఎరువులు, విత్తనాలు తెచ్చుకునే పనిలో పడ్డారు. 

సన్నాలు, పత్తిదే అగ్రభాగం.. 

నియంత్రిత సేద్యంలో భాగంగా వానకాలం ప్రణాళిక జిల్లాల వారీగా ఖరారు కాగా, ఇందులో మక్కను పూర్తిగా పక్కకు పెట్టి, వరి, పత్తికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో కాకుండా మారిన విధానం ప్రకారం వరిలో ప్రధానంగా సన్న రకా లు, తెలంగాణ సోనా, జై శ్రీరాం పంటలు సాగు చేసేలా ఏర్పాట్లు చేశారు. అలాగే పత్తి పంటపైనా దృష్టి పెట్టారు. కంది, పెసరకు ఎక్కువ ప్రా ధాన్యత ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయిల్‌పాం పంటను విరివిగా పెంచాలని నిర్ణయించడంతోపాటు ఊరూరా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

ఊరూరా ప్రతిజ్ఞలు.. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో రైతులు కదులుతున్నారు. ‘సీఎం సారు చెప్పిన పంటలు వేస్తం. లాభాలు పండిస్తం’ అంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ధర్మపురి మండలం గాదెపల్లిలో తీర్మానం చేయగా, మిగతా పల్లెల అన్నదాతలు అదే బాటలో నడుస్తున్నారు. ఇప్పటికే పెద్దసంఖ్యలో జై కొడుతున్నారు.


logo