బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - May 28, 2020 , 05:22:21

‘జలసిరి’సిల్ల

‘జలసిరి’సిల్ల

  • ‘సమగ్ర జల నిర్వహణ విధానం’లో దేశానికే జిల్లా రోల్‌మోడల్‌ 
  • కరువు కోరల నుంచి జలసిరులు 
  • ముఖ్యమంత్రి ఆరేళ్ల కృషి ఫలితం
  • జిల్లాలో ఎక్కడ చూసిన పుష్కలంగా నీళ్లు
  • ఏడాదిలో ఆరు మీటర్లకుపైగా పైకి చేరిన భూగర్భ జలాలు 
  • తాజాగా జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం
  • ఐఏఎస్‌ల శిక్షణ అంశంగా ‘జిల్లా వాటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’ ఎంపిక 
  • మంత్రి కేటీఆర్‌ హర్షం
  • సీఎం జల నిర్వహణ నమూనాకు గుర్తింపని కితాబు

కరీంనగర్‌ ప్రతినిధి/ సిరిసిల్ల, నమస్తే తెలంగాణ : బావుల్లో కనుచూపు మేర కనిపించని భూగర్భజలాలు.. నెర్రెలు వారిన భూములు.. ఎండిపోయిన దుమ్మురేగిన వాగులు.. పూడిక పోయిన ఒర్రెలు.. గతంలో మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిపించేవి. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఆరేళ్లలో చేపట్టిన సమగ్ర జల నిర్వహణ విధానంతో ఎంతో మార్పు వచ్చిం ది. భూగర్భజలాల పెరుగుదల కోసం.. కొన్నేళ్లుగా చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూర దృష్టి ఒకవైపు.. వెంట పడి పనులు చేపిస్తూ.. కరువు నేలకు వీలైనంత తొందరగా జలసిరులు అందేలా మంత్రి కేటీఆర్‌ తీసుకుంటున్న చర్యలు మరోవైపు కలిపి.. చేస్తున్న కృషికి నిదర్శంగా జిల్లాలో జలసిరులు పారుతున్నాయి. ఇంటింటికీ తవ్విన ఇంకుడు గుంతలు, ఉపాధిహామీ పనులు, వాటర్‌ షెడ్ల నిర్మాణం, మిషన్‌ కాకతీయ కింద చెరువులను పునరుద్ధరించడం, సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం వంటి వాటితో పుష్కలమైన నీళ్లు వచ్చాయి. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పెద్ద సంఖ్యలో చెరువులు నిండువేసవిలోనూ మత్తడి దూకుతున్నాయి. అలాగే శ్రీ రాజరాజేశ్వర జలాశయంతో జిల్లా ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇల్లంతకుంట, ముస్తాబాద్‌ మండలాల వరకు గోదావరి జలాలు వెళ్లాయి. వరదకాలువ ప్రాజెక్టు ద్వారా పలు మండలాలు లబ్ధి పొందుతున్నాయి. ఇలా విభిన్న కోణాల్లో వస్తున్న జలాలు.. భూగర్భ జలాలు పెరగడానికి కారణమవుతున్నాయి. అంతేకాదు, కాళేశ్వరం ఎత్తిపోథల పథకంలో పలు పనులు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయితే జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుంది. 

ఏడాదిలోనే ఆరు మీటర్ల పైకి  భూగర్భజలాలు..

జిల్లాలో భూగర్భ జల మట్టాలు వేసవిలో సైతం పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే బాగా పెరిగాయని భూగర్భ జలశాఖ ఈ నెల 20న విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. నీటి సంవత్సరాన్ని (2019-2020) ఏటా జూన్‌ నుంచి మరుసటి యేడాది మే వరకు లెక్కిస్తారు. జిల్లాలో ఏప్రిల్‌-2019లో 17.78 మీటర్లలో ఉండగా ఈ యేడాది ఏప్రిల్‌ 2020లో 11.75 మీటర్లకు పాతాళగంగ పైకి పెరిగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్ల జిల్లాలో ఆరుమీటర్లు పైకి భూగర్భజలాలు పెరిగాయి.

జాతీయ స్థాయిలో రోల్‌ మోడల్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కృషితో క్రమంగా జిల్లా నలుమూలల వచ్చిన నీటి వల్ల ఏడాదిలో ఏకంగా ఆరు మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయి. ప్రస్తుతం ఇది దేశాన్ని ఆశ్చర్యంలోకి నెట్టడమేకాదు,. రోల్‌మోడల్‌గా మారింది. పెరిగిన భూగర్భజలాలు.. దీనికోసం తీసుకున్న చర్యలపై ఆసక్తి చూపిన లాల్‌ బహదూర్‌శాస్త్రి అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇందుకు గల కారణాలు తెలుపాలని జిల్లా కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ను కొద్దినెలల క్రితం కోరింది. ఆ మేరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ వీడియో చిత్రీకరించి పంపించారు. నిజానికి కలెక్టర్‌ వెళ్లాలి. కానీ, కరోనా నేపథ్యంలో.. వెళ్లలేకపోయారు. అయినా అకాడమీ భూగర్భజలాల పెరుగుదల.. జలనిర్వహణ కోసం తీసుకున్న చర్యలను పూర్తిగా పరిశీలించింది. ఆ మేరకు.. వాటర్‌ మేనేజ్‌మెంట్‌పై అధ్యయనం కోసం జిల్లాను ఎంపిక చేసింది. దీనిపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే తెలంగాణ జలవిధానంపైన అధ్యయనాలు జరుగుతాయని సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలు నేడు వాస్తవ రూపం దాలుస్తున్నాయని చెప్పారు. ముస్సోరి అకాడమీ జిల్లాను అధ్యయనం చేస్తూ యువ ఐఏఎస్‌ అధికారులకు శిక్షణ ఇవ్వడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన కృషికి గుర్తింపుగా ఆయన పేర్కొన్నారు.

జిల్లా ప్రజలకు గర్వకారణం 

అఖిలభారత అధికారులు నిర్వహిస్తున్న శిక్షణలో సిరిసిల్ల వాటర్‌మేనేజ్‌మెంట్‌పై వివరించడం ఇది జిల్లా ప్రజలకు గర్వకారణం. ముఖ్య మంత్రి కేసీఆర్‌ దార్శనీకత, కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో గోదావరి జలాల రాకతో భూగర్భజలాలు పెరిగి కరువు, దుర్భిక్షం తొలగిపోయింది. 

- కృష్ణభాస్కర్‌, కలెక్టర్‌ రాజన్న సిరిసిల్ల 


logo