సోమవారం 21 సెప్టెంబర్ 2020
Karimnagar - May 25, 2020 , 01:46:56

అవసరమైన పంటలే వేయాలి

అవసరమైన పంటలే వేయాలి

 మార్కెట్లో డిమాండ్‌ ఉన్న వాటినే సాగు చేయాలి 

 నియంత్రిత పద్ధతిపై సందేహాలు అక్కరలేదు

 నూతన వ్యవసాయ పద్ధతులు అలవర్చుకోవాలి 

 జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

 మంత్రులు ఈటల, కొప్పుల, గంగుల 

 కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల వ్యవసాయ సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై సమీక్ష  

 పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ అధ్యక్షులు, కలెక్టర్లు

మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలని, మనకు అవసరమైన వాటినే పండించుకోవాలని రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ పిలుపునిచ్చారు. రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణుల అభిప్రాయం మేరకే రాష్ట్రంలో నియంత్రిత వ్యవసాయ విధానాన్ని సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని, దీనిపై సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించిన ‘వ్యవసాయ సమగ్ర ప్రణాళిక రూపకల్పన’పై ప్రజాప్రతినిధులు, అధికారులతో ముగ్గురు మంత్రులు సమీక్ష నిర్వహించారు. నియంత్రిత సేద్యంపై దిశానిర్దేశం చేశారు. 

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: మార్కెట్‌లో డిమాండ్‌తో పాటు మనకు అవసరమైన పంటలు వేయాలని మంత్రలు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ రైతులకు సూచించారు. మూడు జిల్లాల సమీక్ష అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఐదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి గోదావరి నీళ్లను బీళ్లకు మళ్లించారని తెలిపారు. మొట్ట మొదటిసారి నియంత్రిత పద్ధతిలో సాగును అమలు చేస్తున్నారని, ఈ విధానం దేశానికే దిక్సూచీగా మారబోతున్నదని చెప్పారు.

సాగు ప్రణాళికలు సమర్పించిన కలెక్టర్లు

సమావేశంలో ఏ జిల్లాలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగువుతున్నాయో ఆయా జిల్లాల కలెక్టర్లు మంత్రులకు వివరించారు. కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక మాట్లాడుతూ జిల్లాలో 73 శాతం నీటి పారుదల ప్రాంతం ఉన్నదని, 5.25 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉండగా 2019 వాన కాలంలో 3.28 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారని, ఇప్పుడు 3.50 లక్షల ఎకరాల వరకు వెళ్లే అవకాశం ఉందన్నారు. 60 శాతం వరి, 28 శాతం పత్తి సాగుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 76 క్లస్టర్ల పరిధిలో రైతు వేదికలకన్నింటికీ స్థలాలు గుర్తించామని చెప్పారు.

  • జగిత్యాల కలెక్టర్‌ రవి మాట్లాడుతూ, గత వానకాలంలో 2.31 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, ఇప్పుడు 2.28 లక్షల ఎకరాలకు ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఇందులో 1.14 లక్షల ఎకరాల్లో సన్న రకాలు సాగు చేస్తామని అన్నారు. గత సీజన్‌లో 52 వేల ఎకరాల్లో మక్క సాగు చేశామని, ఈసారి స్వీట్‌ కార్న్‌ సాగు చేసేందుకు ప్లాన్‌ చేశామన్నారు. జిల్లాలో 71 క్లస్టర్లకు స్థలాల ఎంపిక పూర్తి చేశామని చెప్పారు. జిల్లాకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధం చేస్తున్నామని, జూన్‌, జూలై నెలలకు సరిపడా ఎరువులు పీఏసీఎస్‌, డీలర్ల స్థాయికి చేరుకున్నాయని వివరించారు. 
  •  పెద్దపల్లి కలెక్టర్‌ సిక్తా మాట్లాడుతూ 1.92 లక్షల ఎకరాల్లో వరి సాగుకు ప్రణాళిక వేసినట్లు తెలిపారు. 60 శాతం బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్‌ రకాల సాగుకు రైతులను సమాయత్తం చేస్తున్నామన్నారు. 396 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి, భాను ప్రసాద్‌రావు అడిగిన ప్రశ్నలకు మంత్రులు, కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు సమాధానాలు చెప్పారు.. సమావేశంలో పెద్దపల్లి ఎంపీ బోడకుంట వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్‌, రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, దాసరి మనోహర్‌ రెడ్డి, కోరుకంటి చందర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ అధ్యక్షులు విజయ, పుట్ట మధూకర్‌, వసంత, నగర మేయర్‌ వై సునీల్‌రావు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ సీఈ శంకర్‌, అధికారులు పాల్గొన్నారు.

  • ప్రణాళికాబద్ధంగా వ్యవసాయం : మంత్రి ఈటల

మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ, రైతులు ప్రణాళికాబద్ధమైన వ్యవసాయం చేసేలా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు భరోసా వచ్చిందని, ఏ భూమిలో ఏ పంట వేసుకోవాలో, ఎంతెంత వేసుకోవాలో తెలియజేయాలని సూచించారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమీ క్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌ జిల్లాకు సంబంధించి కొన్ని సూచనలు చేశారని, ఎక్కువగా సీడ్‌ ఉత్పత్తి చేయాలని సీఎం కోరారని గుర్తుచేశారు. వరిలో సన్న రకాలను ఎక్కువగా ప్రోత్సహించాలని, వానకాలంలో మక్కజొన్నకు బదులుగా కంది, పత్తి సాగు చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. నియంత్రిత సాగు విధానం ద్వారా ప్రతి రైతుకు రైతు బంధు అందే విధంగా క్లస్టర్‌ స్థాయిలో పంటల ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గొప్ప సంస్కరణలు తెచ్చే ప్రతిసారి కొంత భయం, సందేహాలు ఉండడం సహజమని, అయితే రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కేంద్రం ఆధీనంలో ఉండే ఎఫ్‌సీఐ వద్ద దొడ్డు రకం బియ్యం నిలువలు పెరిగి పోతున్నాయని, రాబోయే రోజుల్లో దొడ్డు రకానికి కనీస మద్దతు ధర ఇవ్వక పోవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. నీటి వసతి పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో సన్న రకాలను పండించాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో వచ్చే వాన కాలం సీజన్‌కు విత్తనాలు, ఎరువులు సమకూర్చుతున్నామని వెల్లడించారు.

డిమాండ్‌ను బట్టి వేయాలి : మంత్రి గంగుల  

మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి రైతులు పంటలు సాగు చేయాలని మరో మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. అలా చేసినపుడే వ్యవసాయం మరింత లాభదాయకంగా మారుతుందని సీఎం కేసీఆర్‌ విశ్వసిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని, ఈ కారణంగా నిండు ఎండకాలంలో కూడా చెరువులు మత్తడి దునుకుతున్నాయని చెప్పారు. కొత్తపల్లి మండలం నాగులమల్యాలలోని ఊర చెరువే ఇందుకు నిదర్శనమన్నారు. కొత్తపల్లి మండలంలోని 8 గ్రామాల్లో ఏడు వేల ఎకరాలకు సాగు నీరు అందుతోందన్నారు. ఎండ కాలంలో చెరువులు మత్తళ్లు దునకడమనేది అరుదైన విషయమని, అది తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. ముందుగా నాట్లు వేసుకునేందుకు కాకతీయ, వరద కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఎగువ కాకతీయ కాలువ పరిధిలోని డీ-87, డీ-89, డీ- 90 కాలువలకు చివరి ఆయకట్టుకు గతంలో నీళ్లందేవి కాదని, ఇప్పుడు పుష్కలంగా నీళ్లు ఉన్నందున చివరి వరకు వెళ్లేలా కాలువలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సీడ్‌ కంట్రోల్‌ విధానం లేక గత సీజన్‌లో రైతులు నష్టపోయారని, వడ్లలో 1153, 1156 వంటి విత్తనాల్లో నాణ్యత లోపం కారణంగా తాలు వచ్చిందని, ఈ విత్తనాలను ప్రభుత్వం నిషేధించిందని చెప్పారు.

దేశానికే దిక్సూచి : మంత్రి కొప్పుల

నియంత్రిత సాగు విధానం త్వరలో దేశానికే దిక్సూచిగా మారుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అభిప్రాయపడ్డారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా పంటలు సాగుచేయడమనేది వ్యవసాయంలో సరికొత్త పద్ధతిగా ఆయన అభివర్ణించారు. సీఎం కేసీఆర్‌కు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి ఉన్నదని, గతంలో కాలువల కింద భూములు ఉన్నా చుక్క నీరు రాని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు చివరి ఆయకట్టు వరకు నీటిని తరలించేందుకు కాలువల కోసం జిల్లాకు రూ.100 కోట్లు ఇస్తానని సీఎం కేసీఆర్‌ చెప్పారని తెలిపారు. చాలా ప్రాంతాలకు నీళ్లు అందుతున్నాయని, అయినా కొన్ని ప్రాంతాల్లోని చెరువులకు రావడం లేదని, అలాంటి వాటిని గుర్తించి ఏ విధంగా వాటిని నింపవచ్చో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. కాలువలకు నీళ్లు వస్తున్నాయనే విషయంలో గ్రామాలు, మండలాల్లో చర్చలు జరగాలని ఆకాంక్షించారు. నియంత్రిత సాగు విధానం దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జరగలేదని, రాష్ట్రంలోనే తొలిప్రయత్నంగా జరుగుతోందని, క్లస్టర్ల వారీగా సాగుకు సన్నద్దం చేయాలని అధికారులకు సూచించారు.


logo