గురువారం 28 మే 2020
Karimnagar - May 24, 2020 , 00:35:09

ఎండ ప్రచండం

ఎండ ప్రచండం

ఉమ్మడి జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు

గరిష్ఠంగా 47డిగ్రీలకు ఉష్ణోగ్రతలు 

పొద్దంతా వడగాలులు, రాత్రిళ్లు ఉక్కపోత

తట్టుకోలేకపోతున్న జిల్లావాసులు

సడలింపు ఇచ్చినా ఇండ్లకే పరిమితం 

మధ్యాహ్నం వేళ కర్ఫ్యూ వాతావరణం

కరీంనగర్‌/పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/జగిత్యాల: ఎండలు దంచి కొడుతున్నాయి. సోమవారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుండగా, అప్పుడే హీటెక్కిస్తున్నాయి. మొన్నటి వరకు 42, 43 డిగ్రీలు మాత్రమే ఉన్న ఉష్ణోగ్రతలు, శనివారం గరిష్ఠంగా 47డిగ్రీలకు చేరాయి. పెద్దపల్లి జిల్లాలో కాల్వశ్రీరాంపూర్‌లో నమోదు కాగా, జగిత్యాలలో 46.5 డిగ్రీలకుపైనే నమోదయ్యాయి. కరీంనగర్‌ జిల్లాలో 45, రాజన్న సిరిసిల్లలో 43 డిగ్రీలు రికార్డు కాగా, ఉదయం 7గంటల నుంచే భగభగలు మొదలవుతున్నాయి. తొమ్మిది గంటల కల్లా ప్రతాపం మొదలై, మధ్యాహ్నం అగ్గి కుర్తంది. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినా రోడ్డెక్కెందుకు జనం భయపడుతున్నది. అంతటా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తున్నది. వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా ప్రజలు అల్లాడిపోతున్నారు. తొమ్మిది గంటల తర్వాత ఇళ్లలోంచి బయటకు రాలేకపోతున్నారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు, నెత్తికి క్యాపులు, రుమాళ్లు వాడుతున్నారు. ఎండలు తీవ్రతరం కావడంతో ఉపాధి, ఇతర కూలీలు తెల్లవారుజామునే పనుల్లోకి వెళ్లి 11గంటలకల్లా తిరుగుముఖం పడుతున్నారు. తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎండలో ఎక్కువ సేపు ఉంటే వడదెబ్బ తగలి ముప్పు ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకొని చల్లపూటే పనులు ముగించుకోవాలని సూచిసున్నారు. ఎక్కువగా మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, బయటకు వెళ్లాల్సి వస్తే రక్షణ చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటివి వడదెబ్బ లక్షణాలని, అలాంటి సమయంలో వెంటనే తగు చర్యలు తీసుకోవాలంటున్నారు. పిల్లల విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఎండాకాలంలో ముఖ్యంగా టైఫాయిడ్‌, పచ్చకామెర్లు, కడుపునొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాల బారిన పడే ప్రమాదముంది. కాబట్టి మధ్యాహ్న సమయంలో ఎక్కువ బయట తిరగకపోవడం మంచిది. 


logo