మంగళవారం 26 మే 2020
Karimnagar - May 23, 2020 , 02:43:31

ప్రతి చెరువునూ నింపుతాం

ప్రతి చెరువునూ నింపుతాం

ప్రణాళికలు సిద్ధం చేయాలి 

చొప్పదండిలో వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించాలి

ఉన్నతాధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ వెల్లడి

చొప్పదండి: సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి చెరువునూ నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, అలాగే చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధికి రూ.5కోట్ల నిధులతో వెంటనే టెండర్లను పిలిచి పనులు ప్రారంభించాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ వెల్లడించారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించడంపై శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి మొక్క బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి.. మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావుతో మాట్లాడారని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో అవసరమైన చెరువులు, తూములు, కాలువల నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయాలని ఈఎన్‌సీకి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అలాగే అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి ఎడమ, కుడి కాలువల నిర్మాణంపై నివేదిక ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. కాగా, నియోజకవర్గంలో కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లతో గంగాధరలో నారాయణపూర్‌ చెరువు, కొడిమ్యాలలో మైసమ్మ చెరువు, పోతారం చెరువుతో వివిధ గ్రామాలకు నీరందుతున్నదని ఎమ్మెల్యే గుర్తుచేశారు. మరో 14 తూములు ప్రారంభించి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని చెరువు నింపుతామని వెల్లడించారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మార్చుతుండడంతో పాటు అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు హైదరాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యలో కొలిమికుంటలో ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలను చూసిన ఎమ్మెల్యే తన వాహనం నిలిపి, వారితో మాట్లాడారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందునా పని ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


logo