మంగళవారం 26 మే 2020
Karimnagar - May 23, 2020 , 02:43:33

కేసీఆర్‌ సారు చెప్పినట్లే సాగు

కేసీఆర్‌ సారు చెప్పినట్లే సాగు

నియంత్రిత సేద్యానికి జై కొడుతున్న రైతులు

గాదెపల్లి స్ఫూర్తితో కదులుతున్న గ్రామాలు

తాజాగా చెర్లపల్లి, గాగిరెడ్డిపల్లిలో ఏకగ్రీవ తీర్మానాలు

నియంత్రిత సేద్యం చేద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపును రైతులంతా స్వాగతిస్తున్నరు. సీఎం మాట ప్రకారమే సాగు చేస్తామని రాష్ట్రంలోనే తొలిసారిగా మన గాదెపల్లి గ్రామస్తులు రెండురోజుల క్రితం ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నరు. ఇప్పుడు అదే స్ఫూర్తితో మిగతా గ్రామాల కర్షకులు కదులుతున్నరు. శుక్రవారం గంగాధర మండలం చెర్లపల్లి, చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి రైతులు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. సీఎం, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే సుంకె చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, ఆయన చెప్పినట్లే పంటలు వేస్తామని ప్రతిన బూనారు. 

- కరీంనగర్‌, నమస్తే తెలంగాణ/ గంగాధర/ చిగురుమామిడి

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ/ గంగాధర/ చిగురుమామిడి : నియంత్రిత పద్ధతిలో సాగుదామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు యావత్‌ రైతాంగంలో చర్చకు దారితీసింది. ఏకంగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ ముఖ్యమంత్రి మాట మీద ఉంటామని రైతులు ప్రతిన బూనుతున్నారు. సాగునీటి సదుపాయం ఉన్నా.. భూగర్భ జలాలపై ఆధారపడి సాగు చేస్తున్నా.. ఏ ఊరైనా ఒక్కటే మాట అదే ‘సీఎం కేసీఆర్‌ చూపుతున్న నియంత్రిత సాగు బాట’. శుక్రవారం జిల్లాలోని గంగాధర మండలం చెర్లపల్లి(ఆర్‌), చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామాల రైతులు సీఎం కేసీఆర్‌ చెప్పిన పంటలే సాగు చేస్తామని తీర్మానించుకోవడం జిల్లాలో చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదెపల్లి గ్రామ రైతులు బుధవారం తీర్మానం చేయగా, ఈ గ్రామాల్లో రగిలిన స్ఫూర్తి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి ఏ పంటలు వేయమంటే అవే వేస్తామని ఎలుగెత్తిన ఈ గ్రామాలు ఇప్పుడు చరిత్ర అంచుల్లో నిలిచాయి. నియంత్రిత సాగుకు బాటలు వేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల కష్టాలను కళ్లారా చూసిన సీఎం కేసీఆర్‌ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత వారికి పెద్దపీట వేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నారు. 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నారు. పంటకు పెట్టుబడిని ఇస్తున్నారు. ప్రాజెక్టులు అందుబాటులో లేనపుడు సాగుచేసిన పంటలు వేరు.. సమృద్ధిగా నీళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సాగు చేయాల్సిన పంటలు వేరని ఎందరో వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చలు జరిపిన సీఎం కేసీఆర్‌ చివరికి నియంత్రిత పద్ధతిలో సాగు విధానం తేవడం రైతాంగానికి శ్రేయస్కరమని భావించారు. ఈ మేరకు వ్యవసాయ అధికారులతో సమావేశాలు నిర్వహించి ఏ జిల్లాలో ఎలాంటి పంటలు సాగు చేయాలో చెప్పారు. రైతులు డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

చెర్లపల్లికి సమృద్ధిగా నీళ్లున్నా..  

గంగాధర మండలం చెర్లపల్లి(ఆర్‌) గ్రామం ఒకప్పుడు నెర్రెలు బారిన చెరువులు, అడుగంటిన బావులు, ఎండిన పంటలతో కనిపించేది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎల్లంపల్లి నుంచి ఈ ఊరికి మీది ప్రాంతంలో ఉన్న నారాయణపూర్‌ రిజర్వాయర్‌కు నీళ్లు వచ్చాయి. కింది ప్రాంతంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరద కాలువ ఉంది. రెండు వైపులా సమృద్ధిగా నీరు అందుతుండడంతో ఈ గ్రామంలో రెండేళ్లుగా వరి రైతులు బంగారం పండిస్తున్నారు. 240 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో 80 శాతానికిపైగా రైతులే. అందులో 80 శాతం మంది వరే పండిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన కారణంగానే తమకు సాగునీటి కష్టాలు తీరాయని చెర్లపల్లి (ఆర్‌) రైతులు చెబుతున్నారు. నీరు సమృద్ధిగా ఉన్న ఈ గ్రామంలో వరి పండించేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. తమ గ్రామానికి ఇరువైపులా నీళ్లు రావడానికి కారకులైన ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపునకు ఈ పల్లె రైతులు స్పందించారు. కేసీఆర్‌ ఏ పంట వేయమంటే అదే పంట వేస్తామని శుక్రవారం గ్రామంలో రైతులు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. తమ గ్రామంలో వరిలో సన్న, దొడ్డు రకం వడ్లు పండించమన్నా తమకు సమ్మతమేనని, పత్తి సాగు చేయమన్నా చేస్తామని, సీడ్‌ వడ్లు పండించమన్నా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. కంది, పెసర, కూరగాయలు, ఇతర ఏ పంటలు పండించేందుకైనా తాము సిద్ధమంటున్నారు. 

గాగిరెడ్డిపల్లి మెట్టప్రాంతమైనా.. 

చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామం పూర్తిగా మెట్టప్రాంతం. బావులు, బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న ఈ గ్రామ రైతులు కూడా సీఎం కేసీఆర్‌ పిలుపుతో నియంత్రిత సాగు పద్ధతి పాటించేందుకు ముందుకు వచ్చారు. మండలంలో మారుమూలన ఉన్న ఈ గ్రామానికి కాళేశ్వరం నీళ్లు వెళ్లే అవకాశం లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు నిండితేనే ఈ ఊరి బావులు, బోర్లలో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. సాగునీటి సదుపాయం లేని ఈ గ్రామంలో భూగర్భ జలాలపై ఆధారపడి 860 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా 346 ఎకరాల్లో వరి సాగు చేస్తారు. పత్తి, మక్కజొన్న పంటలు కూడా పండించే ఈ గ్రామ రైతులు కూడా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో స్పందించారు. నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు ముందుకు రావడం విశేషం. శుక్రవారం ఈ గ్రామంలోనూ స్థానిక సర్పంచ్‌ సన్నీళ్ల వెంకటేశం సమక్షంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ఆయన చెప్పిన పంటలే సాగు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రైతులను లాభాల పట్టించేందుకే సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని ఈ గ్రామ రైతులు గట్టిగా విశ్వసిస్తున్నారు.

ఒకే పంట వేస్తే భూమిల సారం పోతది

యేటా ఒకే పంట వేయడం వల్ల భూమిల సారం తగ్గిపోతది. పంట మార్పిడి చేస్తేనే దిగుబడులు పెరుగుతయ్‌. ఈ పద్ధతిని ప్రభుత్వం స్వయంగా ప్రచారం చేయడం గొప్ప విషయం. నాకు ఐదెకరాలు భూమి ఉంది. సీఎం సారు ఆదేశాల ప్రకారం పంట సాగు చేస్త. వ్యవసాయాధికారులు ఏ పంట వేయాలో ముందే చెప్తే బాగుంటది. డిమాండ్‌ ఉన్న పంటలు సాగు చేయడం మంచిది.

- సింగిరెడ్డి అంజిరెడ్డి, రైతు, గాగిరెడ్డిపల్లి(చిగురుమామిడి)

పూర్తి నమ్మకంతో సాగు చేస్త్తం

ముఖ్యమంత్రిపై ఉన్న నమ్మకంతో పంట మార్పిడి చేయడానికి సిద్ధంగా ఉన్నం. పంటలు బాగా పండి, అన్నదాతల జేబుల్లో సిరులు నిండాలని కేసీఆర్‌ సార్‌ అన్న మాటలు నా లాంటి యువ రైతులకు స్ఫూర్తినిస్తయ్‌. సీఎం సార్‌ ఆలోచన చేసిన్రు అంటే అందులో రైతులకు ఉపయోగపడే మేలుంటదన్న విషయాన్ని గ్రహించాలె. వానకాలం అధికారులు మా ఊల్లె ఏ పంట వేయమని చెప్తె అది వేసేందుకు సిద్ధంగా ఉన్నం.

- జవ్వాజి సంతోష్‌, యువరైతు, చెర్లపల్లి(ఆర్‌), (గంగాధర)

సీఎం ఆలోచన గొప్పదని నిరూపిస్తం

నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని చెప్పిన సీఎం కేసీఆర్‌ సారు మాటే మా మాట. ఎప్పటి విధంగా మూస పద్ధతిలో కాకుండా ఈసారి ఆయన చెప్పినట్లు పంటలు వేయాలని నిర్ణయించుకున్నం. పంటల మార్పిడి విధానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నం. ముఖ్యమంత్రి ఆలోచన విధానం గొప్పదని నిరూపిస్తం.

- దొనుకుంటి ఐలయ్య, రైతు, చెర్లపల్లి(ఆర్‌), (గంగాధర

మంచి ఆలోచన..

సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం రైతులకు ఎంతో ఉపయోగపడుతది. వేసిన పంటనే వేసి రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తున్నది. రైతులకు పంటలపై అవగాహన కల్పించడం సంతోషంగా ఉంది. ఎరువులు, విత్తనాలు నాణ్యమైనవి అందిస్తూ రైతులకు సర్కారు ఇబ్బందులు లేకుండా చేస్తున్నది. నాకున్న ఏడెకరాల భూమిల అధికారులు చెప్పిన పంటనే సాగు చేస్త. అధికారుల సూచనలు పాటిస్త.

- మంద శ్రీనివాస్‌, రైతు, గాగిరెడ్డిపల్లి (చిగురుమామిడి)


logo