మంగళవారం 26 మే 2020
Karimnagar - May 22, 2020 , 01:16:52

ఊపందుకున్న ఆధునీకరణ

ఊపందుకున్న ఆధునీకరణ

60.25కోట్లతో నిర్మాణం

 పూర్తయితే 30వేల ఎకరాలకు సాగునీరు 

బీర్‌పూర్‌, ధర్మపురి మండలాలకు మేలు

సారంగాపూర్‌ : బీర్‌పూర్‌ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ ఊపందుకున్నది. లాక్‌డౌన్‌ కారణంగా కూలీల సంఖ్య తగ్గినా ప్రస్తుతం 25శాతం మందితో పనులు కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులతో కలిసి ప్రాజెక్టును ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పరిశీలించి తగు సూచనలు చేయడంతో పనుల్లో వేగం పెరిగింది. ఇందులోకి ఎస్సారెస్పీ డీ-53 కాలువ ద్వారా, వర్షాలు పడినప్పుడు నీరు చేరుతుంది. 0.25టీఎంసీగా ఉన్న ప్రాజెక్ట్‌ సామర్థ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం టీఎంసీకి మార్చేందుకుగానూ రూ.60.25కోట్లు మంజూరు చేసిం ది. మూడేళ్ల కిందట అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత, ప్రాజెక్ట్‌ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం తూము నిర్మాణం పూర్తికాగా, 425 మీటర్ల పొడవు కట్ట పనుల్లో 60శాతం, కట్ట ఎత్తు 18మీటర్లలో 8మీటర్ల దాకా పూర్తయింది. మత్తడి పనులు శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఇందుకోసం గుట్టల్లో బండలను తొలగించారు. మత్తడిని 156 మీటర్ల పొడవు, 16.50 మీటర్ల వెడల్పు, 12.50 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్నారు. మత్తడి ప్రాంతంలోనే భారీ రెడీమిక్స్‌ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఎండకాలంలో పనులు వేగంగా కొనసాగాల్సి ఉన్నా లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో కూలీల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 25శాతం మందితోనే పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు ప్రగతిని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఇటీవల పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 

త్వరలోనే పూర్తిచేస్తాం: చక్రునాయక్‌, రోళ్లవాగు ప్రాజెక్టు డీఈ

రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులను 2020, జూలై చివరి వరకు పూర్తి చేస్తామని భావించినా లాక్‌డౌన్‌ కారణంగా కూలీల సంఖ్య తగ్గి పనుల్లో జాప్యం కలిగింది. ప్రస్తుతం 25శాతం మంది కూలీలతో మత్తడి పనులు చేయిస్తున్నాం. త్వరలోనే ప్రాజెక్టును పూర్తిచేస్తాం. 


logo