బుధవారం 03 జూన్ 2020
Karimnagar - May 21, 2020 , 00:44:11

20 గుంటలు.. నెలకు రూ. 40వేలు

20 గుంటలు.. నెలకు రూ. 40వేలు

  •  పందిరి సాగు.. ఆదాయం బాగు
  •  ఆదర్శంగా నిలుస్తున్న రాజన్నపేట రైతు శంకర్‌

ఎల్లారెడ్డిపేట: వినూత్న ఆలోచనా విధానం.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం.. ప్రభుత్వ ప్రోత్సాహం వెరసి ఉన్న కొద్దిపాటి భూమితోనే అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన సుంకూరి శంకర్‌. పందిరిసాగు చేపట్టి లాభాలను గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. బతుకుదెరువు కోసం 19 సంవత్సరాల పాటు గల్ఫ్‌ బాట పట్టిన శంకర్‌ 2013లో ఇంటికి చేరుకున్నాడు. ఉన్న ఎకరం భూమిలనే ఎవుసం చేయాలని నిశ్చయించుకున్నాడు. మొదటగా వరి సాగు చేసినా బోరులో సరిగా నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డాడు. ఈ నేపథ్యంలోనే కొత్తగా కూరగాయలు పండించాలని భావించాడు. అందులో భాగంగా పందిరి సాగు కోసం 2016లో భార్య రజిత పేరు మీద మహిళా సంఘం ద్వారా రూ.లక్ష రుణం తీసుకున్నాడు. ఆ సొమ్ముతో 20 గుంటల భూమిలో పందిరి వేయించాడు. తక్కువ నీటిని వినియోగించుకునేలా డ్రిప్‌ ఏర్పాటు చేశాడు. కేవలం రూ.5 వేల ఖర్చుతో కూరగాయల సాగుకు పూనుకున్నాడు. బీర, కాకర, సొరకాయ, అలుసందతో పాటు అంతర్గత పంటలుగా టమాట, గోరుచిక్కుడు, బెండకాయ, కొత్తిమీర, ఉల్లిపంటలను వేశాడు. ఏకకాలంలో కాకర, బీర 20 కిలోల చొప్పున పండితే అల్చంత 15 కిలోలు, ఆనిగపుకాయలు 50, టమాటాలు 20 కిలోలు, గోరుచిక్కుడు, బెండకాయ 10కేజీల చొప్పున దిగుబడి వస్తున్నదని, తద్వారా రోజుకు రూ.15 వందల నుంచి రూ.2 వేల వరకు వస్తున్నాయని, నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల ఆదాయం వస్తున్నదని శంకర్‌ రజిత దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


logo