శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - May 21, 2020 , 00:44:12

ఈత కెళ్తున్నారా జాగ్రత్త

ఈత కెళ్తున్నారా జాగ్రత్త

  •  జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలు గాల్లోకి..
  •  ఇటీవల మంచిర్యాల జిల్లాలో ఇద్దరు చిన్నారుల మృతి
  •  తల్లిదండ్రులకు కడుపు కోత

వేసవి వచ్చిందంటే చాలు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈతకు వెళ్లేందుకు సరదా పడుతుంటారు. కొందరు ఈత రాకున్నా చెరువులు, కాలువలు, కుంటల్లో, వ్యవసాయబావుల్లో దిగి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఇటీవల మంచిర్యాల జిల్లా మాడవెల్లిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడగా కన్నోళ్లకు కడుపు కోతే మిగిలింది. అందుకే ఎండకాలంలో పిల్లలు బయటికి వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఈత సరదా కాస్తా విషాదంగా మారకుండా జాగ్రత్తపడాల్సిన అవసరముంది.      

- చిగురుమామిడి/ గంగాధర

జాగ్రత్తలు లేకే ప్రమాదాలు..

ముఖ్యంగా సెలవుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు బయటకు వెళ్లేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. వచ్చీరాని ఈతతో బావుల్లో, కుంటల్లో, కాలువల్లోకి దిగి తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామంలో ఇటీవల ఈత రాక వ్యవసాయబావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. తాజాగా కన్నెపల్లి మండలం మాడవెల్లి గ్రామంలో ఇద్దరు చిన్నారులు కాలువలో స్నానానికి వెళ్లి ఈత రాకపోవడంతో చనిపోవడం ఆ కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది.

కాల్వలు మరీ ప్రమాదకరం..

ఈతకు వెళ్లే వారు కాలువల వైపు వెళ్లకపోవడం మరీ మంచిది. ఇది చెరువులు, కుంటల కంటే ఎక్కువ ప్రమాదకరం. కాలువల నీటి ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేం. ఈత రాని వారే కాదు.. ఈత వచ్చిన వారు దిగినా కొట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదు. ఈత తెలియని వాళ్లు అస్సలే వెళ్లకూడదు. కాలువల గేట్ల వద్ద నీరు పైకి నిశ్చలంగా కనిపించినా అడుగుభాగంలో ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. అందుకే వాటిలో దిగకపోవడమే శ్రేయస్కరం. అలాగే పాత బావుల్లోకి వెళ్లకూడదు. వీటి దరులు కూలిపోయే అవకాశం ఉంటుంది. అలాగే బావుల్లో కార్బన్‌డయాక్సైడ్‌ వ్యాపించి ఉండవచ్చు.

నీటిలో పడితే ఇలా చేయాలి..

చెరువులు, కాలువల్లో పడి చిక్కుకుపోయిన వ్యక్తిని గుర్తించి బయటకు తీయగానే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించాలి. గుండె కొట్టుకోకుంటే ఛాతిపై నొక్కాలి. వీలైనంత త్వరగా దగ్గరలో ఉన్న దవాఖానకు తరలించాలి. నీటిలో నుంచి బయటకు తీయగానే వెంటనే పడుకోబెట్టాలి. పొట్టపై మెల్లగా నొక్కి నీళ్లను బయటకు తీయాలి. బాధితుడికి శ్వాస ఆడకపోతే తోటి వ్యక్తులు నోటి ద్వారా శ్వాస అందించాలి. ప్రథమ చికిత్స సమయంలో బాధితుడిని ప్రశాంతమైన, విశాలమైన ప్రాంతంలో ఉంచాలి. ఆ తర్వాత దవాఖానలో అర్హులైన వైద్యులతో చికిత్స అందించాలి.


logo