శనివారం 06 జూన్ 2020
Karimnagar - May 20, 2020 , 02:00:31

యువసారథి ప్రగతి వారధి

యువసారథి ప్రగతి వారధి

  • 33.35కోట్లతో ఐదు వంతెనల నిర్మాణం 
  • 30లక్షలతో ముస్తాబాద్‌లో సెస్‌ భవనం  
  • ప్రారంభించిన అమాత్యుడు కేటీఆర్‌  
  • సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృత పర్యటన 
  • పోత్గల్‌ స్థానిక నాయకులతో భేటీ 
  • మానేరు ఆయకట్టు కోనసీమగా మారనుందని సంతోషం
  • త్వరలోనే జిల్లాలో 666 చెరువులకు జలకళవస్తుందని వెల్లడి
  • లింగంపల్లిలో టీఆర్‌ఎస్‌ నేత కుటుంబానికి పరామర్శ

ప్రభుత్వ పథకాల అమలులోనే కాదు.. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల్లోనూ సిరిసిల్ల జిల్లాను అగ్రభాగాన నిలుపుతున్నారు ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌. తన నియోజకవర్గంలో సుమారు 33.35 కోట్లతో నిర్మించిన ఐదు వంతెనలకు ఒక్కరోజే ప్రారంభోత్సవాలు చేసి సరికొత్త చరిత్రను సృష్టించారు. సిరిసిల్లలో మంగళవారం విస్తృతంగా పర్యటించి, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పలువురిని పరామర్శించి, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

- సిరిసిల్ల/ముస్తాబాద్‌/ఎల్లారెడ్డిపేట/సిరిసిల్ల రూరల్‌

సిరిసిల్ల/ముస్తాబాద్‌/ఎల్లారెడ్డిపేట/సిరిసిల్ల రూరల్‌: రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ముస్తాబాద్‌, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట పరిధిలో 33.35 కోట్ల నాబార్డు నిధులతో ఐదు వంతెనలను ఒక్కరోజే ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా తంగళ్లపల్లి మండలం భరత్‌నగర్‌ వద్ద 2.50 కోట్లతో నిర్మించిన వంతెనను, ఆ తర్వాత ముస్తాబాద్‌ మండలం తెర్లుమద్ది సమీపంలో 2.50కోట్ల నాబార్డు నిధులతో మరో వంతెనను, 1.40కోట్ల నిధులతో హన్‌మాన్‌నగర్‌ వద్ద, 7.70కోట్లతో నక్కవాగుపై, ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్‌-కొండాపూర్‌ మధ్య ఎగువమానేరు వాగుపై 19.25కోట్లతో నిర్మించిన బహుళార్థక వారధులను ప్రారంభించారు. 

ఎగువమానేరుకు గోదారి జలాలు

అనంతరం ముస్తాబాద్‌లో 30లక్షలతో నిర్మించిన సెస్‌ భవనాన్ని సెస్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ విజయరామారావుతో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం పోత్గల్‌కు వెళ్లారు. హైకోర్టు న్యాయవాది తన్నీరు రమణారావు తండ్రి కిషన్‌రావు ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. స్థానిక నాయకులతో మాట్లాడుతూ, ఎగువమానేరు జలకళపై ప్రస్తావించారు. డిసెంబర్‌ మాసాంతం వరకు ఎగువమానేరును గోదావరి జలాలతో నింపుతామని, దీంతో మానేరు పూర్వపు ఆయకట్టు సస్యశ్యామలం కానుందని సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలోని 666 చెరువులు జలకళను సంతరించుకుంటాయని, మత్స్య కార్మికులతో పాటు ఇతర కులవృత్తిదారులకు మరింత జీవనోపాధి కలుగుతుందని తెలిపారు. ముస్తాబాద్‌-సిద్దిపేట జిల్లా సరిహద్దుల్లో వ్యవసాయ ఉత్పత్తుల హబ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని వెల్లడించారు.

అధైర్యపడవద్దు అండగా ఉంటా.. 

కొండాపూర్‌-నారాయణపూర్‌ బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం లింగంపల్లి గ్రామంలో మంత్రి పర్యటించారు. టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకుడు కుంట బాబు ఇటీవల మృతిచెందగా, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. బాబు ముగ్గురు పిల్లలు జస్వంత్‌, విశ్వంత్‌, శ్రీమన్యును ఓదార్చారు. వారి పేర్లమీద తానే సొంతంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తానని, ఉద్యోగం కల్పించడంతోపాటు డబుల్‌బెడ్రూం ఇల్లును కూడా మంజూరు చేయిస్తానని బాబు భార్య మంజులకు భరోసా ఇచ్చారు. అమాత్యుడి వెంట టీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుక, సర్పంచ్‌ కొత్తపల్లి వాణి తదితరులున్నారు. 

రామన్నకు కృతజ్ఞతలు..

బండలింగంపల్లికి చెందిన మరాఠి వెంకటయ్య-లక్ష్మి దంపతుల కూతురు అనుష్క గుండె చికిత్సకు అమాత్యుడు గతంలో 2లక్షలను మంజూరు చేయించారు. అదేవిధంగా చీకట్ల కనకయ్య-లక్ష్మి దంపతుల కొడుకు పుట్టుమూగకాగా, ఆ బాలుడి చికిత్సకు 5లక్షలను మంజూరు చేయించి అండగా నిలిచారు. మంగళవారం పర్యటనలో భాగంగా గ్రామానికి వచ్చిన మంత్రి రామన్నను వారంతా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని కేటీఆర్‌ ఆప్యాయంగా పలుకరించారు. వారితో ఫొటో దిగారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. 

ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ రంగారావు, టెస్కాబ్‌ చైర్మన్‌ రవీందర్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డే, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగారావు, చిక్కాల రామారావు, జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, సెస్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, ఆర్‌బీఎస్‌ జిల్లా కన్వీనర్‌ గడ్డం నర్సయ్య, ఎంపీపీలు జనగామ శరత్‌రావు, పడిగెల మానస, జడ్పీటీసీలు చీటి లక్ష్మణ్‌రావు, గుండం నర్సయ్య, నాయకులు కల్వకుంట్ల గోపాల్‌రావు, విజయరామారావు, సురేందర్‌రావు, అక్కరాజు శ్రీనివాస్‌, యాది మల్లేశ్‌, బాపురావు, తన్నీరు గౌతంరావు, పూర్ణచందర్‌రావు, జంగిటి అంజయ్య, మాట్ల మధు, వలకొండ వేణుగోపాలరావు, గజభీంకార్‌ రాజన్న, బండి దేవదాస్‌, కొడూరి భాస్కర్‌, పూసపల్లి సరస్వతి, పడిగెల రాజు పాల్గొన్నారు.


logo