శనివారం 06 జూన్ 2020
Karimnagar - May 19, 2020 , 02:09:31

సేద్యం.. వినూత్నం

సేద్యం.. వినూత్నం

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ : పంటల సాగుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, రైతు బంధు సమితి ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వానకాలం సీజన్‌ సాగుపై రైతులకు అవగాహన కల్పించాల్సిన విషయాలను చర్చించారు. రైతుబంధు కమిటీల సభ్యులు కథానాయక పాత్రను పోషించాలని ఉద్బోధించారు. పత్తి, వరి, కందులు, కూరగాయలు, పసుపు, ఎండు మిర్చి, సోయాబీన్‌, ఇతర పప్పు దినుసులను ఆయా జిల్లాల పరిధిలోని నేలల సారాన్ని బట్టి పండించాలని సూచించారు. వరి విత్తనాలు సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా అందుబాటులోకి తెస్తామని, మేలైన పత్తి, కంది విత్తనాలు కూడా అందిస్తామన్నారు. వానకాలంలో వరి సాగు చేస్తే సన్నాలను ప్రోత్సహించాలన్నారు. ఏ జిల్లా లో ఎలాంటి సన్న రకాలు అనువైనవో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు వివరించాలని ఆదేశించారు. రైతు వేదికలు పూర్తి కాని చోట నాలుగైదు నెలల్లో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులు ఎక్కడైనా ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయాలని కలెక్టర్లకు సూచించారు. కరీంనగర్‌ జిల్లాలో వచ్చే వాన కాలం సీజన్‌లో సాగు వివరాలు, యాసంగిలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్ల వివరాలను కలెక్టర్‌ శశాంక సీఎం కేసీఆర్‌కు వివరించారు. సీఎం కేసీఆర్‌ సూచలను జిల్లా అధికారులు, రైతు సమన్వయ సమితి బాధ్యులు, రైతులు స్వాగతిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను తప్పక పాటిస్తామని, డిమాండ్‌ ఉన్న పంటలనే పండిస్తామని స్పష్టం చేశారు.

 కూరగాయల సాగును ప్రోత్సహిస్తాం.. 

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ఈసారి కూరగాయల సాగును పెద్ద మొత్తంగా ప్రోత్సహిస్తాం. పంటల మార్పిడి జరగాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకు అనుగుణంగా రైతుల్లో మార్పులు తెస్తాం. జిల్లాలో ఇప్పటికే 2 వేల ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నారు. వాన కాలంలో మరో 2 వేల ఎకరాల్లో అదనపు సాగును ప్రోత్సహిస్తాం. సీఎం కేసీఆర్‌ ముఖ్యంగా మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయించాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖతో కలిసి మా శాఖ కూడా పనిచేస్తుంది. సీఎం ఆలోచనల మేరకు జిల్లాలో ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తాం. అందులో భాగంగా పట్టణాల శివారు గ్రామాల్లో ఎక్కువగా కూరగాయలు సాగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం. 

- శ్రీనివాస్‌, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి (కరీంనగర్‌)


రైతులకు అవగాహన కల్పిస్తాం 

వాన కాలం సాగుకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాలు, సూచనలపై జిల్లా రైతులకు అవగాహన కల్పిస్తాం. జిల్లాలో ఎలాంటి పంటలు సాగు చేయాల్లో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గత వాన కాలంలో జిల్లాలో పత్తి పంట ప్రధానంగా సాగైంది. ఈసారి కూడా పత్తిని ప్రోత్సహించాలని సీఎం చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మక్కజొన్న పంటకు పూర్తిగా డిమాండ్‌ పడి పోతున్నదని, ఈ పంట సాగుకు యాసంగి అనువుగా ఉంటుందని సీఎం చేసిన సూచనలు తప్పకుండా పాటిస్తాం. మక్క జొన్న పంటను తగ్గిస్తాం. దీని స్థానంలో కంది వంటి పప్పు దినుసుల సాగును ప్రోత్సహిస్తాం. వరిలో సన్న రకాలు సాగు చేయాలని సీఎం కోరారు. అందుకు తగినట్లుగానే జిల్లాలో ప్రణాళిక రూపొందిస్తున్నాం. రైతు బంధు సమితుల సహకారంతో పంటల సాగుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తాం.

- వాసిరెడ్డి శ్రీధర్‌, డీఏవో (కరీంనగర్‌)


మంచి రాబడి వచ్చే పంటలు వేద్దాం

రైతుల శ్రేయస్సు కోరుకునే సీఎం కేసీఆర్‌ సూచన మేరకు మంచి రాబడి వచ్చే పంటలే సాగు చేసుకుందం. రైతులకు ప్రయోజనం కలిగే పనులను ముఖ్యమంత్రి చేస్తరు. దేశాని కే ఆదర్శంగా నిలిచే ఎన్నో పథకాలను తెలంగాణ రైతుల కోసం ప్రవేశపెట్టిన ఆయన, మంచి దిగుబడి వచ్చే పంటలు సాగు చేయాలని కోరుకుంటున్నరు.  రైతులు ఆర్థికంగా బాగు పడాలంటే వ్యవసాయాధికారులు, ఆర్బీఎస్‌ సభ్యులు సూచించిన పంటలు సాగు చేయాలి.     

- చీటి వెంకటరావు, ఆర్బీఎస్‌ జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్‌, కోరుట్ల


logo