శనివారం 06 జూన్ 2020
Karimnagar - May 19, 2020 , 02:09:34

రైట్‌.. రైట్‌..

రైట్‌.. రైట్‌..

(కరీంనగర్‌, నమస్తే తెలంగాణ):ఆర్టీసీ ప్రజారవాణాకు సిద్ధమవుతున్నది. సీఎం కేసీఆర్‌ సోమవారం ఆదేశాలివ్వడంతో బస్సులు తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కరోనా నేపథ్యంలో  మార్చి 23 నుంచి విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. కరీంనగర్‌ రీజియన్‌లో వందలాది బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కొన్ని రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి విముక్తి లభిస్తున్నది. అందులో భాగంగా ప్రజా రవాణాకు కూడా సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. సుమారు రెండు నెలలుగా డిపోల్లోనే మూలుగుతున్న బస్సుల కండిషన్‌ను పరీక్షించారు. అవసరమైన వాటికి మరమ్మతులు చేశారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏ విధంగా బస్సులు నడపాలనే విషయంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి  ప్రయాణికుడు భౌతిక దూరం పాటించేలా ఇప్పటికే కొన్ని బస్సుల్లో సీట్లకు మార్కింగ్‌ ఇచ్చారు. కరీంనగర్‌ బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను మున్సిపల్‌ అధికారులు స్థానిక అంబేద్కర్‌ స్టేడియానికి తరలించారు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలోనేటి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నడుపనున్నారు.  హైతరాబాద్‌కు వెళ్లే బస్సులు జేబీఎస్‌ వరకే వెళ్తాయని ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్‌ తెలిపారు.  కరోనా నేపథ్యంలో బస్సెక్కె ప్రయాణికులు కండక్టర్‌ వద్ద శానిటైజర్‌ ఉపయోగించాలని  సూచించారు.  బస్సుల్లో నిలుచుకునేందుకు అనుమతిలేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ నిబం ధనలు పాటించడంతో పాటు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాల్సిందేనని  స్పష్టం చేశారు.  


logo