శనివారం 06 జూన్ 2020
Karimnagar - May 18, 2020 , 01:57:57

గలగలా గోదారి..ఊరూరా వరిసిరి..

గలగలా గోదారి..ఊరూరా వరిసిరి..

ఎదురెక్కుతూ.. పంపుహౌస్‌ల్లో ఉవ్వెత్తున ఎగుస్తూ.. సొరంగ మార్గాల్లో జలజలా జారుతూ.. గ్రావిటీ కాలువల ద్వారా గలగలా పారుతూ.. గోదారి పొలాల వెంట పరుగులు తీసింది. చెరువులను నింపుతూ, భూగర్భజలాలను పెంచుతూ.. నేలతల్లికి జలాభిషేకం చేసింది. ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం’తో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమైంది. వానకాలానికి మించి ఈ యాసంగిలో 7,92,576 ఎకరాల్లో వరి సాగు కాగా, ఊరూరా ధాన్యపు సిరులు పండాయి. ఊహించని స్థాయిలో దిగుబడులు రాగా, ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. విక్రయించిన వారంలోపే డబ్బులు పడుతుండగా, రైతుల్లో ఆనందం కనిపిస్తున్నది.

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో కాళేశ్వరం జలాలు సిరులు కురిపించాయి. గత ఖరీఫ్‌తో పోలిస్తే 1.07 లక్షల ఎకరాల్లో అదనంగా సాగు కాగా.. 2.62 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అదనంగా వచ్చే అవకాశాలున్నాయి. యాసంగి సీజన్‌లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 60 టీఎంసీల నీటిని లిఫ్ట్‌ చేసి శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయం నుంచి దిగువమానేరు ప్రాజెక్టు (ఎల్‌ఎండీ) ద్వారా ఆయకట్టుకు నీరందించారు. ఇదే సమయంలో ఎస్సారెస్పీ పునర్జీవం పథకం కింద వరద కాలువను నింపారు. దీంతో భూగర్భ జలాలు పెరగడం, కాలువలో మోటార్లు ఏర్పాటు చేయడం, తూముల ద్వారా వందలాది చెరువులు నింపడం వల్ల సుమారు లక్ష ఎకరాల వరకు సాగయింది. గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 180 రోజుల పాటు కాకతీయ కాలువ నిరంతరంగా పారింది. అంతేకాదు, ఈ కాలువ ద్వారా 6,100 క్యూసెక్కుల నీళ్లు వదలడం కూడా ఈసారే సాధ్యమైంది. ఇవేకాదు, ఉమ్మడి జిల్లాలోని 4,365 చెరువుల కింద ఈ సారి 70,461 ఎకరాల్లో వరి సాగయింది. గత యాసంగి సీజన్‌లో ఈ చెరువుల కింద 29,454 ఎకరాలు మాత్రమే సాగు కాగా, ఈ సారి 41,007 ఎకరాలు అదనంగా సాగయింది. మొత్తంగా నాలుగు జిల్లాల్లో 7,92,576 ఎకరాలు వరి సాగు చేయగా, గత ఖరీఫ్‌తో పోలిస్తే 1.07 లక్షల ఎకరాల్లో అదనంగా సాగయింది. 2.62 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అదనంగా వచ్చే అవకాశమున్నది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం నిండుకుండలా మారడంతో కరువునేల అయిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగు పెరిగింది. అలాగే, కరీంనగర్‌ జిల్లాలో విత్తనోత్పత్తి పెరిగింది. సుమారు 1.60 లక్షల మెట్రిక్‌ టన్నుల సీడ్‌ వస్తుందని అంచనా వేయగా, పెద్దపల్లి జిల్లాలోనూ పెద్ద ఎత్తున సీడ్‌ ఉత్పత్తి జరిగింది. logo