బుధవారం 03 జూన్ 2020
Karimnagar - May 18, 2020 , 01:55:28

పంట మార్పిడితోనే లాభాలు

పంట మార్పిడితోనే లాభాలు

రామడుగు/ కార్పొరేషన్‌ : పంట మార్పిడితోనే రైతులు అధిక లాభాలు పొందవచ్చని, డిమాండ్‌ ఆధారంగా పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ రైతులకు సూచించారు. ఈ మేరకు రామడుగు మండలంలోని తిర్మలాపూర్‌లో యువరైతు కట్ల శ్రీనివాస్‌ సాగు చేస్తున్న అంజీర తోటను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ పండ్ల తోటలు, చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. శ్రీనివాస్‌ ఉన్నత ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామానికి వచ్చి భూమి కౌలుకు తీసుకొని బ్రౌన్‌టర్కీ అంజీర సాగు చేయడం, సీఎం కేసీఆర్‌ ఆలోచనలను అమలు చేస్తుండడం అభినందనీయమన్నారు. రైతులు కేవలం వరి ధాన్యమే కాకుండా ఇతర పంటలు సాగు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆలోచన చేస్తున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల పండ్లు, ధాన్యాలను పండించి స్పూర్తిని ఇవ్వాల్సిన సమయం ఇదేనన్నారు.

‘బతుకమ్మ’ కథనంతో అనేక ఫోన్‌కాల్స్‌

ఈ సందర్భంగా రైతు శ్రీనివాస్‌ వినోద్‌కుమార్‌కు వివరించారు. ఇటీవల ‘నమస్తే తెలంగాణ బతుకమ్మ’ మేగజైన్‌లో పంటసాగుపై కథనం ప్రచురితమైందని, దీంతో రాష్ట్రం నలు మూలలనుంచి తనకు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ అపోలో దవాఖానలో పనిచేసే వైద్యులు ఫోన్‌ చేసి బ్రౌన్‌టర్కీ పండ్లతో సిరప్‌ తయారు చేస్తే తనకు అందించాలని కోరినట్లు తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ రైతును రాజును చేయాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పానికి రైతు శ్రీనివాస్‌ అంజీర సాగుతో చేయూతనందిస్తున్నారని తెలిపారు. కేవలం ఆరేండ్లలోనే కాళేశ్వరం జలాశయం ద్వారా యావత్‌ తెలంగాణకు నీరందించి సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ కలిగేటి కవిత, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌, సింగిల్‌ విండో చైర్మన్లు వొంటెల మురళీకృష్ణారెడ్డి, దూలం బాలగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు గంట్ల వెంకటరెడ్డి, సాగి మహిపాల్‌రావు పాల్గొన్నారు.

ఎంత సంపాదించినా సృష్టి ముందు తక్కువే

సమాజంలో ఎవరు ఎంత సంపాదించినా సృష్టి ముందు తక్కువేనని ప్రస్తుత పరిస్థితులు నిరూపించాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. అంబేద్కర్‌ స్టేడియంలో దాత చెన్నమనేని హనుమంతరావు అందించిన రూ.లక్ష సహకారంతో నిత్యావసరాల సరుకుల పంపిణీ చేశారు. బియ్యంతో పాటు 11 రకాల వస్తువులతో కూడిన సరుకులను 50 కుటుంబాలకు అందించినట్లు చెప్పారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్‌ పిలుపుమేరకు ‘ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు పరిశుభ్రత కోసం’ కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో నిల్వ ఉన్న నీటిని పారబోశారు. రానున్న వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్‌ శశాంక, నగర మేయర్‌ వై సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు రవీందర్‌సింగ్‌, రమణారావు, వైద్యులు జగన్‌మోహన్‌రావు, కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. 


logo