బుధవారం 03 జూన్ 2020
Karimnagar - May 18, 2020 , 01:55:26

కూలీకి ఉపాధి.. పొలానికి తడి..

కూలీకి ఉపాధి.. పొలానికి తడి..

ఎస్సారెస్పీ కాలువలకు పూర్వవైభవం రానుంది. కాలువల్లో నీరు ఉరకలెత్తి చివరి ఆయకట్టు భూములను సైతం ముద్దాడేలా ఆధునీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఉపాధి హామీ కింద మరమ్మతులు చేపట్టి అటు కాలువలను తీర్చిదిద్దడంతోపాటు కూలీలకు చేతినిండా పనికల్పించాలనే బహుళ ప్రయోజనాలతో ఈ నిర్ణయం తీసుకోగా,  మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రత్యేక చొరవతో తొలుత పైలెట్‌ ప్రాజెక్టు కింద ధర్మపురి నియోజకవర్గంలోనే పనులు చేయనున్నారు. ఆరు మండలాల పరిధిలో 500 కిలోమీటర్ల పొడువున ఉన్న మెయిన్‌, మైనర్‌, సబ్‌ మైనర్‌ కాలువలను తీర్చిదిద్దబోతున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఎస్సారెస్పీ కాలువలైన డీ53 (మెయిన్‌ కెనాల్‌, మైనర్‌ కెనాల్‌), డీ83/ఏ, డీ83/ఏ, 9ఎల్‌, డీ83/ఏ, 12ఎల్‌, డీ83/ ఏ, 13ఎల్‌, డీ83/బీ, డీ83/బీ9ఎల్‌, 12/ ఆర్‌, డీ83/బీ 13ఎల్‌, డీ83/బీ 7ఆర్‌, డీ83/బీ 19ఎల్‌, డీ 83/బీ, డీ64 మెయిన్‌ కెనాల్‌తో పాటు మైనర్‌ కెనాల్‌, డీ64/11ఎల్‌, డీ64/10ఆర్‌, డీ64/7ఆర్‌ 1ఎల్‌ కాలువలతో పాటు రోళ్ల వాగు, బోలిచెరువు డిస్ట్రిబ్యూటరీలు, తదితర కాలువల మరమ్మతులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కాలువల్లో ఏర్పడ్డ బుంగ లు, పూడికతీత, పెరిగిన ముళ్ల పొదలు, రాళ్ల తొలగింపు పనులు చేపట్టనున్నారు. నేటి నుం చి పదిహేను రోజుల పాటు పనులు కొనసాగనుండగా, వెల్గటూరు, ధర్మారం మండలాల్లో సోమవారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పనులను ప్రారంభించనున్నారు. 

 ప్రజాప్రతినిధులకూ బాధ్యతలు

కాలువ మరమ్మతులకు సంబంధించి ఎస్సారెస్పీ అధికారులు, ఉపాధిహామీ సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు సైతం భాగస్వాములవ్వాలని మంత్రి ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం సైతం చేశారు. ఆయా గ్రామ శివారుల్లో జరిగే పనుల్లో గ్రామ ప్రజాప్రతినిధులతో పాటు టీఆర్‌ఎస్‌ నేతలూ పాలు పంచుకోవాలని సూచించారు. 


logo