శనివారం 06 జూన్ 2020
Karimnagar - May 16, 2020 , 03:11:05

ధాన్యం రవాణాకు కార్గో సేవలు

ధాన్యం రవాణాకు కార్గో సేవలు

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ : ధాన్యం రవాణాకు ఆర్టీసీ కార్గో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మూడు రోజుల క్రితం నుంచే 12 డీజీటీ (డిపో గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టు) వాహనాలు ఉమ్మడి జిల్లాలో నడుస్తుండగా, కొత్తగా కరీంనగర్‌ రీజియన్‌కు 19 బస్సులు రాబోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఇవి వినియోగంలోకి రాగా, శుక్రవారం జగిత్యాల జిల్లాకు రెండు కార్గో వాహనాలు చేరుకున్నాయి. ప్రస్తుతం వీటిని ఎరువుల రవాణాకు వినియోగిస్తున్నట్లు ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్‌ తెలిపారు. శనివారం నాటికి మరో 17 వాహనాలు వస్తాయని, స్థానిక అవసరాలకు అనుగుణంగా జిల్లాల వారీగా కేటాయిస్తామని వెల్లడించారు. ఈ నెల 13 నుంచి 12 డీజీటీ వాహనాలను ధాన్యం తరలింపునకు వినియోగిస్తున్నారు. ఇందులో రెండు సిరిసిల్ల జిల్లాలో, మిగతా పది కరీంనగర్‌ జిల్లాలో నడుస్తుండగా, రెండు రోజులుగా చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో ధాన్యం రవాణా కోసం ఉపయోగిస్తున్నారు.

రైతుల శ్రేయస్సు కోసమే.. అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం

జగిత్యాల : జిల్లాలో రైతుల కోసమే కార్గో సర్వీసులను వినియోగిస్తున్నామని అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం పేర్కొన్నారు. జగిత్యాల డిపో పరిధిలో రెండు కార్గో బస్సులను ఆర్‌ఎం జీవన్‌ ప్రసాద్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. వాటిని ప్రస్తుతం ఎరువుల రవాణాకు వినియోగిస్తున్నామని, జిల్లా కేంద్రం నుంచి కథలాపూర్‌ మండలం భూషణ్‌రావుపేటకు ఎరువుల బస్తాలను తరలించామని చెప్పారు.  మున్ముందు ధాన్యం రవాణాకు ఉపయోగిస్తామని తెలిపారు. జిల్లాలో 5లక్షల టన్నుల ధాన్యం సేకరణ కొనుగోలు కాగా, ఇప్పటివరకు 2.60 లక్షల టన్నులు సేకరించామని, ఇందులో 10 టన్నుల ధాన్యం రవాణా చేయవచ్చన్నారు. జగిత్యాల డిపోలో శానిటైజర్‌ యూనిట్‌ను ఆర్‌ఎం ప్రారంభించారు. ఇక్కడ జిల్లా వ్యవసాయాధికారి సురేశ్‌, డీసీవో రామానుజాచారి, మార్క్‌ఫెడ్‌ అధికారి దివ్యభారతి, డీఎం జగదీశ్వర్‌ పాల్గొన్నారు.


logo