సోమవారం 01 జూన్ 2020
Karimnagar - May 15, 2020 , 01:48:37

పోర్షన్‌కో నల్లా కనెక్షన్‌!

పోర్షన్‌కో నల్లా కనెక్షన్‌!

  • కరీంనగర్‌ బల్దియాలో త్వరలోనే కొత్త పథకానికి శ్రీకారం 
  • అక్రమ నల్లాలకు చెక్‌  nతక్కువ ఫీజులే వసూలు..  

కార్పొరేషన్‌ : ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకువచ్చిన కరీంనగర్‌ నగరపాలక సంస్థ మరో వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది. త్వరలోనే సరికొత్త కార్యక్రమానికి నగర మేయర్‌ వై సునీల్‌రావు శ్రీకారం చుడుతున్నారు. అక్రమ నల్లాలకు చెక్‌ పెట్టడంతోపాటు ప్రతి వ్యక్తికీ సరిపడా నీళ్లు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికీ ఒక్క నల్లా కనెక్షన్‌ మాత్రమే ఇచ్చారు. అయితే, త్వరలోనే ఒక ఇం టికి ఎన్ని పోర్షన్లు లేదా వంట గదులుంటే అన్ని నల్లా కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కనెక్షన్లను తక్కువ ధరకే అందించనున్నట్లు మేయర్‌ పేర్కొన్నారు.

ఇప్పటికే కనెక్షన్లు సరళతరం

కరీంనగర్‌ నగరపాలక సంస్థలో బుధవారమే నల్లా కనెక్షన్‌ అందించే పద్ధతిని సరళీకృతం చేస్తూ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు నల్లా కనెక్షన్‌ తీసుకోవాలంటే లైసెన్స్‌ ఉన్న ప్లంబర్‌ చేత డిజైన్‌ చేయించి, దరఖాస్తు చేస్తే మంజూరు చేసేవారు. దీనికి చెక్‌ పెట్టి నూతనంగా ఒక తెల్ల కాగితంపై నల్లా కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసి.. ఇంటిపన్ను చెల్లింపు రసీదును జత చేసి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తే.. ఆన్‌లైన్‌లోనే కనెక్షన్‌ మంజూరు పత్రాలు జారీ చేసేలా చర్యలు చేపట్టారు. 

ఒకే ఇంటికి ఎన్నైనా నల్లా కనెక్షన్లు

కరీంనగర్‌ బల్దియాలో ప్రస్తుతం ఒక నల్లా కనెక్షన్‌కు బీపీఎల్‌ కింద ఉన్న వారికైతే రూపాయి, ఇతరులకు రూ. 100కే నల్లా కనెక్షన్‌ మంజూరు చేస్తున్నారు. ఒక ఇంటికి రెండో నల్లా కనెక్షన్‌ కావాలంటే రూ.13వేలు డిపాజిట్‌ తీసుకొని కనెక్షన్‌ మంజూరు చేస్తున్నారు. కాగా, ఒక్కో ఇంటిలో అత్యధికంగా కుటుంబాలుంటే నీరు సరిపోకపోవడంతో నల్లాలకు మోటర్లు బిగిస్తున్నారు. అక్రమ మార్గాల్లో కనెక్షన్లు తీసుకుంటున్నారు. దీంతో వీటన్నింటికీ చెక్‌పెట్టేలా మేయర్‌ సునీల్‌రావు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్‌ శాఖ ఎలాగైతే ఎన్ని గదులుంటే అన్ని విద్యుత్‌ మీటర్లు ఇస్తున్నదో అలాగే నల్లా కనెక్షన్‌ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక ఇంటిలో ఎన్ని పోర్షన్లు ఉంటే అన్ని నల్లా కనెక్షన్లు అందించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారికంగా రెండు, మూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. 

అక్రమ కనెక్షన్లకు చెక్‌

ఈ కొత్త పథకం వల్ల నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నల్లా కనెక్షన్లకు చెక్‌ పడనుంది. ప్రస్తుతం నగరంలో బల్దియా లెక్కల ప్రకారం 77 వేల ఇళ్లున్నాయి. అయితే, వీటిలో 44 వేల ఇళ్లకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉన్నాయని లెక్కలు చెబుతుండగా.. విద్యుత్‌ శాఖలో నగరంలోనే లక్ష మేరకు విద్యుత్‌ మీటర్లున్నాయి. ఆ లెక్కన నల్లా కనెక్షన్లు అందించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కుటుంబాలకు అనుగుణంగా నల్లా కనెక్షన్లు ఇవ్వడం వల్ల బల్దియాకు నెలవారీ ఫీజుల రూపంలో ఏటా కోట్లలో ఆదాయం వచ్చే అవకాశముంది.logo