శనివారం 30 మే 2020
Karimnagar - May 15, 2020 , 01:48:37

రోణిలనే పంటలేయాలె..

రోణిలనే పంటలేయాలె..

  • ఇగురంతో ఎవుసం జేయాలె..
  • అదును దాటితే అన్నీ నష్టాలె..
  • ఇప్పుడు ఇత్తునం ఏత్తనే ఇంత మిగుల్తది  
  • రోగాలు తక్కువ.. లాగోడి ఎల్లుబాటు
  • తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి
  • ఏడాదికి మూడు పంటలు  
  • ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా కాళేశ్వరం నీళ్లు 
  • ఆలస్యం చేయకుండా సాగితేనే మేలు
  • ముఖ్యమంత్రి పిలుపుతో ముందుకొస్తున్న రైతులు 

ఒక్క కనుకయ్యే కాదు, ఉమ్మడి జిల్లాలోని రైతులంతా ఇదే మాట చెబుతున్నరు. రోహిణిల సాగు మొదలు పెట్టాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుతో సాగుకు సిద్ధమవుతున్నరు. ఇప్పటికే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో నార్లు అలుకుతున్నరు. ఈ కార్తె నుంచి ఎవుసం మొదలు పెడ్తేనే మంచి దిగుబడులు వస్తాయని అంటున్నారు.

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ : ఎవుసంలో ఎన్ని ఆధునిక పద్ధతులు పాటించినా కాలం కలిసిరాక ఏటా ఎంతో మంది రైతులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సమయానికి వర్షాలు పడక, నీటి వసతులు లేక సాగు ఆలస్యంగా ప్రారంభిస్తూ నష్టపోతూనే ఉన్నారు. మేలో వేయాల్సిన వానకాలం పంటలను ఆగస్టు చివరి వరకు వేస్తూ ఆగమవుతున్నారు. చీడపీడల బెడద ఎక్కువై.. దిగుబడులు తక్కువై కనీసం పెట్టుబడులు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మళ్లీ వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయి. మండుటెండల్లోనూ కాళేశ్వరం జలాలతో ఉమ్మడి జిల్లాల్లోని చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. బావులు, బోర్లలో నీళ్లు పైకి వచ్చాయి. చెక్‌డ్యాంలు, ప్రాజెక్టుల కింద కాలువలు గలగలపారుతున్నాయి. వర్షాల కోసం ఎదురు చూడాల్సిన రోజులు పోయాయి. ఈ నేపథ్యంలో మన పూర్వీకులు కార్తెలను అనుసరించి చేసిన సాగు ఇప్పుడు అవసరమని వ్యవసాయ శాస్త్రవేతలు చెబుతున్నారు. రోహిణి కార్తెలో పంటలు వేయడం ప్రారంభిస్తే ప్రకృతికి అనుకూలంగా వ్యవసాయం సాగుతుందని, రైతుకు అన్ని విధాలా మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఈకార్తె నుంచే పంటలు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి ఇటీవల పిలుపునివ్వడం, జిల్లాలో పుష్కలమైన జలాలు అందుబాటులోకి రావడంతో అన్నదాతలు ముందస్తుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటలు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. హుజూరాబాద్‌ డివిజన్‌లో మడులు సిద్ధం చేసుకొని, సంబురంగా నార్లు అలుకుతున్నారు. ఈ కార్తె ఆరంభం నుంచి చాలా చోట్ల నాట్లు వేసేందుకు సన్నద్ధ్దమవుతున్నారు. వీరంతా ఎక్కువగా సన్నరకాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంతో పోలిస్తే రెట్టింపు ఉత్సాహంతో వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. రేపోమాపో రైతుబంధు డబ్బులు రానుండగా, ఎరువులు కొంటామని చెబుతున్నారు.  

రోణిలనే ఆనకాలం పంట షురువైతది. ఈ కార్తెల ఇత్తునం పెడితే పంట మంచిగత్తది. రోణి మొదట్ల నారు అలికితె అనుకున్న దాని కన్న ఎక్కువ వండుతది. పురుగు కూడా తక్కువ అత్తది. సలికాలం అచ్చేలోపల పంట చేతికత్తది. నీళ్లు మంచిగుంటే ఏడాదికి మూడు పంటలు గూడా తీయచ్చు. ఇత్తునం ఎనుకకైతే పాయిదా ఉండదు. లాగోడి (పెట్టుబడి) సుత రాదు. గట్టుకు కట్టెలు మోసినట్టే ఉంటది. మొన్న కేసీఆర్‌ సారు గిదే జెప్పిండు. ఆయన జెప్పిన ముచ్చట నూటికి నూరు పాళ్లు సత్తెం. ఎన్కట మా తాత ముత్తాతలు రోణిలనే పంటలు ఏత్తుండె. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు మస్తచ్చినయ్‌. ఏమాత్రం ఆల్షెం జేయకుండ సాగు మొదలువెట్టాలె.

-ఎలగందల కనుకయ్య, కందుగుల (హుజూరాబాద్‌)

నాణ్యమైన దిగుబడులు వస్తాయి.. 

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో జలాలు పుష్కలంగా ఉన్నాయి. అంతటా భూగర్భ జలాలు పెరిగాయి. బావులు, బోర్లలో నీళ్లున్నాయి. ఇప్పుడు రైతులు వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు. వరి, మక్క, పల్లి, జొన్న, పత్తి, తదితర పంటలు ఏవైనా రోహిణి కార్తెలో వేసుకునేందుకు మన జిల్లాలో అనువైన పరిస్థితులున్నాయి. ముఖ్యంగా వరిలో దీర్ఘకాలిక సన్న రకాలు సాగు చేయడం వల్ల అనేక లాభాలుంటాయి. నారు, పైరు ఆరోగ్యంగా ఎదుగుతుంది. చీడ పీడల ప్రభావం ఉండదు. నాణ్యమైన దిగుబడులు వస్తాయి. కాలాన్ని వదిలి సాగు చేయడం వల్ల మొక్కలు బలహీనంగా ఉంటాయి. మొక్క ఎదిగే సమయంలో అధిక వర్షాలు కురిసి నష్టపోవచ్చు. నార్లు ఇప్పుడే పోసుకుంటే ఎంత దీర్ఘకాలిక పంటైనా అక్టోబర్‌ వరకు చేతికి వస్తుంది. ఆలస్యంగా సాగు ప్రారంభిస్తే నవంబర్‌ వరకు ఆగాల్సి వస్తుంది. ఇది యాసంగి పంటలపై ప్రభావం చూపుతుంది. డిసెంబర్‌, జనవరిలో యాసంగి పంటలు విత్తుకుంటే మార్చి, ఏప్రిల్‌లో చేతికివస్తాయి. మరీ ఆలస్యమైతే మేలో కోతకు వస్తాయి. మన ప్రాంతంలో మార్చి 15 నుంచి ఏప్రిల్‌ నెలాఖరు వరకు కచ్చితంగా వడగళ్లు పడుతాయి. ఈ కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి. కొందరైతే కృత్తిక కార్త్తెలోనే అంటే మే 15 వరకే నార్లు పోసుకుంటారు. ఇలాంటి రైతుల పంటలు త్వరగా చేతికి వస్తాయి. పూర్వంలెక్క కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తే శుభ పరిణామమే. రోహిణిలో సాగు ప్రారంభిస్తే కాలం కలిసి వస్తుంది. 

- డాక్టర్‌ అరుణశ్రీ, కరీంనగర్‌ ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్‌ 

కాళేశ్వరం నీళ్లస్తయనే నమ్మకంతోనే..

గతంల ఎవుసం పనులు మొదలువెట్టాలంటే వర్షం కోసం ఎదురుచూసేటోళ్లం. ఇప్పుడు వర్షంతోటి సంబంధం లేకుండ సాగు చేస్తున్నం. కాళేశ్వరం నీళ్లస్తయనే నమ్మకం ఉంది. కేసీఆర్‌ సారు వల్లనే నీళ్ల రంది పోయింది. రోణిల నారలుకుడు నా చిన్నతనంల జూసిన. మళ్ల ఎనుకటి లెక్క రోణిల నాట్లు వేసే రోజులు అచ్చినయి. ముందుగాల నాటేస్తే పంట మంచిగ పండుతది. 

- మోర్తాల అశోక్‌, కందుగుల (హుజూరాబాద్‌)

రోణి పంటతోని కరువు తీరేది..

ఎన్కట సావనం నెలల కరువు ఉండేది. రోణిల ఏసిన పంటతోని అడ్లగింజలు అత్తుండె. ఆ కరువు లేకుండా పోతుండె. అప్పట్ల మే నెలలనే నార్లు వోద్దుం. వరేసుటానికి పొలం సాఫ్‌ జేద్దుం. పెంట, వెంపరాకు, వేపాకు, పాలకొడిసె ఆకులు తెచ్చి పొలంల ఏద్దుం. గుంటుక (దౌర) కొట్టి, నీళ్లు వెట్టి నాలుగైదు సార్లు దున్నదుం. ఇత్తునాలను ఇండ్లళ్లనే తయారు చేస్కుందుం. రోణిల ఏసిన పంటకు పురుగు వట్టుడు, చెడగొట్టు వానలు పడుడు ఉండయి. యాతాలు, మోటలతోని పొలానికి నీళ్లు పెడ్దుం. రాన్రాను కాలం సక్కగ లేక ఆనలు ఎప్పుడువడ్తయో తెల్వకుంట అయ్యె. నీళ్లు లేక ఆనలు అచ్చినప్పుడే పంటలు ఎయ్యవడ్తిమి. ఇప్పుడు కేసీఆర్‌ సారు చెయ్యవట్టి ఎక్కడ సూసినా నీళ్లు కనిపిస్తున్నయి. ఎనుకటి రోజులు యాదికస్తున్నయి. ఈ సారి ఆనలు అచ్చినా రాకున్నా రోణ్లెనే పంటలు ఎయ్యాల్నని సూత్తున్న. ఆనలు కొట్టకున్నా పంటలకు నీళ్లత్తయన్న నమ్మకంతోని ఉన్న.

- కోల లచ్చయ్య, మల్లాపూర్‌ (గంగాధర)logo