గురువారం 04 జూన్ 2020
Karimnagar - May 14, 2020 , 01:25:48

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

  • ధర్మపురిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి
  • మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా మున్సిపల్‌ కౌన్సిల్‌ బడ్జెట్‌ సమావేశం

ధర్మపురి: పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ధర్మపురి మున్సిపల్‌ అధికారులు, పాలకవర్గ సభ్యులను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశించారు. 2020-21 ఆర్థిక సంవత్సరం ధర్మపురి మున్సిపల్‌ బడ్జెట్‌ను మార్చిలోగా ఆమోదించాల్సి ఉండగా, కరోనా ప్రభావంతో వాయిదా పడుతున్న ఈ సమావేశాన్ని బుధవారం కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. 3.46 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, సభ్యులు ఆమోదించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, మేజర్‌ పంచాయతీగా ఉన్న ధర్మపురిని ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేయించి 25కోట్లు మంజూరు చేయించామన్నారు. ప్రస్తుతం ఈ నిధులతో చేపట్టిన పనులు కొనసాగుతున్నాయన్నారు. గతేడాది ఆగస్టు 6న సీఎం కేసీఆర్‌ ధర్మపురిని సందర్శించిన సందర్భంలో పట్టణ అభివృద్ధికి మరో 10కోట్లు ప్రకటించి మంజూరు కూడా ఇచ్చారన్నారు. ధర్మపురి టెంపుల్‌ సిటీ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. పట్టణంలో దాదాపు 50వేల మందికి సరిపడా మంచినీటి ట్యాంకులు నిర్మించుకున్నామన్నారు. మిషన్‌ భగీరథ నీటి సరాఫరలో అంతరాయం ఏర్పడితే రోళ్లవాగు రక్షిత మంచినీటి పథకాన్ని వినియోగించుకోవచ్చన్నారు. రోళ్లవాగుకు మరమ్మతులు ఉంటే పూర్తి చేయించాలని, నిధులిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ధర్మపురిలో తాగునీటి సమస్య రావద్దని సూచించారు. అనంతరం కలెక్టర్‌ రవి ఆదేశాల మేరకు బడ్జెట్‌ వివరాలను కమిషనర్‌ దివ్యదర్శన్‌ రావ్‌ పద్దుల వారీగా చదివి వినిపించారు. అనంతరం చైర్‌పర్సన్‌ సంగి సత్తెమ్మ మాట్లాడుతూ..మంత్రి ఈశ్వర్‌ ఆదేశాల మేరకు పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. చివరగా కలెక్టర్‌ రవి మాట్లాడుతూ, సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలు, మంత్రి ఆదేశాలను నోట్‌ చేసుకున్నామని తెలిపారు.


logo