బుధవారం 27 మే 2020
Karimnagar - May 14, 2020 , 01:25:44

ధాన్యం రవాణాకు ఆర్టీసీ గూడ్స్‌

ధాన్యం రవాణాకు ఆర్టీసీ గూడ్స్‌

  • కరీంనగర్‌ జిల్లా అధికారుల ఆలోచన
  • అందుబాటులోకి పది డీజీటీ బస్సులు 
  • ఈనెల 31 వరకు సేవలు
  • ప్రస్తుతం మూడు మండలాలకు అందుబాటులో వాహనాలు 

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ/గంగాధర : లాక్‌డౌన్‌తో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) సేవలు నిలిచిపోయాయి. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చి, కోట్లలో ఆదాయం సమకూర్చిన బస్సులు మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లా అధికారులు ఈ సంస్థకు పని కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పది డిపోలకు సంబంధించి పది డిపో గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (డీజీటీ) వెహికిల్స్‌ను ధాన్యం రవాణాకు వినియోగిస్తున్నారు. ఈ యేడు భారీ మొత్తంలో వచ్చిన దిగుబడులను తరలించేందుకు వాహనాల కొరత లేకున్నా, ఆర్టీసీకి ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో జిల్లా అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ ఈ ఆలోచన చేశారు. ప్రస్తుతం గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల్లోని కొనుగోలు కేంద్రాల పరిధిలో ఈ వాహనాలను ఉపయోగిస్తున్నారు. బుధవారం గంగాధర వ్యవసాయ మార్కెట్‌లో పీఏసీఎస్‌ నిర్వహిస్తున్న కేంద్రానికి పది డీజీటీ వాహనాలు వచ్చాయి. ఇక్కడ సేకరించిన ధాన్యాన్ని కేటాయించిన మిల్లులకు తరలించాయి. ఒక్కో బస్సులో 240 నుంచి 250 బస్తాలను తరలించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్‌ఎం పీ జీవన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, పది డీజీటీ వాహనాలను ఈ నెల 31 వరకు వినియోగించాలని అదనపు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఇతర ప్రైవేట్‌ వాహనదారులతో అగ్రిమెంట్‌ చేసుకున్న విధంగానే తమ సంస్థకు సివిల్‌ సప్లయ్స్‌ ద్వారా చెల్లింపులు జరుపుతారని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్లనే ఇందుకు వినియోగిస్తున్నామని తెలిపారు.

మన జిల్లాలోనే వినియోగిస్తున్నాం.. 

జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం. ప్రతి సీజన్‌లో ప్రైవేట్‌ వాహనాలకు కోట్లలో ట్రాన్స్‌పోర్ట్ట్‌ చార్జీలు చెల్లిస్తున్నాం. కరోనా నేపథ్యంలో ఆర్టీసీకి పనిలేకుండా పోయింది. కార్గో సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే డీజీటీ వాహనాలు డిపోల్లో నిరుపయోగంగా ఉన్నాయని తెలుసుకున్నాం. వీటిని ధాన్యం రవాణాకు వినియోగించుకోవాలని అనుకున్నాం. ఆర్టీసీ అధికారులను సంప్రదిస్తే వారు సంతోషంగా అంగీకరించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న పది డీజీటీ వాహనాల సేవలను మన జిల్లాలోనే వినియోగించుకుంటున్నాం.

- జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌, కరీంనగర్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ logo