శనివారం 06 జూన్ 2020
Karimnagar - May 12, 2020 , 01:41:27

సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి

సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి

  • కొనుగోళ్లపై ప్రత్యేకాధికారులను నియమించాం
  • కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
  • కాళేశ్వరం నీళ్లతో అధిక దిగుబడులు
  • రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ 
  • జమ్మికుంటలో మక్కల దిగుమతి కేంద్రం ప్రారంభం

జమ్మికుంట: సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థ మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసిన మక్కల నిల్వ కోసం ఆబాది జమ్మికుంట శివారులోని 20వేల మెట్రిక్‌ టన్నుల కెపాసిటీ గల స్నేహ ఫీడ్‌ గోదాములను లీజ్‌కు తీసుకోగా, అందులో దిగుమతి కేంద్రాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. మక్కలను క్లీన్‌ చేసి నిల్వ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాళేశ్వరం నీళ్లతో చివరి ఆయకట్టు వరకు పంటలు సమృద్ధిగా పండాయని, కనీవినీ ఎరుగని రీతిలో దిగుబడులు వచ్చాయన్నారు. అయితే కొన్న ధాన్యం, మక్కల నిల్వల కోసం గోదాములు సరిపోవడం లేదని తెలిపారు. మిల్లుల్లో నిల్వలకు ఇబ్బందులుంటే మార్కెట్‌ యార్డులోని షెడ్స్‌లో స్టోరేజీ చేయిస్తామని చెప్పారు. అవసరమైతే ప్రైవేట్‌ గోదాములను లీజుకు తీసుకుంటామని, రైతులకు ఇబ్బందుల్లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ధాన్యం, మక్కల కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని, కొనుగోలు కేంద్రానికో ప్రత్యేకాధికారిని నియమించామని గుర్తుచేశారు. ధాన్యం, మక్కల్లో బెండ్లు, మట్టి, నల్ల గింజలు, తాలు లేకుండా చూసుకొని కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అనవసరంగా రైతులను ఇబ్బందులు పెట్టే మిల్లర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోళ్లు, దిగుమతిలో జాప్యాన్ని క్షమించేది లేదని స్పష్టంచేశారు. అకాల వర్షాలకు ధాన్యం, మక్కలు తడిసే ఆస్కారం ఉందని, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కొనుగోళ్లలో వేగం పెంచి ముందుకు సాగాలని కోరారు. మంత్రి వెంట టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, కేడీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రమేశ్‌, రైస్‌ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, జడ్పీటీసీ డాక్టర్‌ శ్యాం, పీఏసీఎస్‌ అధ్యక్షులు సంపత్‌, సంపత్‌రావు, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, ములుగు జిల్లాల మార్క్‌ఫెడ్‌ డీఎం మహేశ్‌, ఏడీఏ ఆదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


logo