ఆదివారం 31 మే 2020
Karimnagar - May 12, 2020 , 01:41:28

కార్యాలయాలు కళకళ

కార్యాలయాలు కళకళ

  • పూర్తిస్థాయిలో తెరుచుకున్న ప్రభుత్వ ఆఫీసులు 
  • మాస్కులు ధరించి విధులకు హాజరైన ఉద్యోగులు
  • భౌతిక దూరం పాటిస్తూ సేవలు

జగిత్యాల/ పెద్దపల్లి/ మంచిర్యాల/ కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్ర సర్కారు ఆదేశాలతో గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ తిరిగి తెరుచుకున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర శాఖలే పనిచేసినా, సోమవారం నుంచి వందశాతం ఆఫీసులూ ఓపెన్‌ అయ్యాయి. 50 రోజుల తర్వాత పూర్తి స్థాయి సిబ్బందితో కళకళలాడాయి. కలెక్టరేట్లలోని విద్య, వ్యవసాయ, పంచాయతీరాజ్‌, ట్రెజరీ, సహకార శాఖలతోపాటు తదితర శాఖలు పూర్తిస్థాయిలో పనిచేశాయి. అధికారులు, ఉద్యోగులు సుధీర్ఘకాలం తర్వాత ఆఫీసులకు చేరుకొని, మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వర్తించారు. అన్నిచోట్లా శానిటైజర్లు, సబ్బులు, నీటి బకెట్లు ఏర్పాటు చేశారు. ప్రజలను మాస్కులు ఉంటేనే కార్యాలయాల్లోకి అనుమతించారు. నెలన్నర తర్వాత విధులకు హాజరైన కొందరు ఉద్యోగులు మాట్లాడుతూ, అంటువ్యాధి భయంతో ఇన్ని రోజులూ విధులు నిలిచిపోతాయని, జనజీవనం స్తంభించి పోతుందని ఊహించలేదని వ్యాఖ్యానించారు. మరికొందరూ, ఇంకా భయంగానే ఉందని చెప్పారు. నెలన్నర తర్వాత విధులకు రావడం కొత్త అనుభూతిని, అనుభవాన్ని ఇస్తున్నదని పేర్కొన్నారు.

పూర్తిస్థాయిలో విధులు.. 

ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి కార్యాలయంలో పూర్తిస్థాయిలో పని చేస్తున్నం. మాస్కులను తప్పనిసరిగా వాడుతున్నం. భౌతిక దూరం పాటిస్తున్నం. అన్ని పనులనూ సక్రమంగా చేస్తున్నం. కార్యాలయానికి వచ్చే వారు కూడా నిబంధనలు పాటించాలి. 

- దినకర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, విద్యా శాఖ (కరీంనగర్‌)

ఇవ్వాళే ఆఫీసుకు కళ.. 

లాక్‌డౌన్‌తో ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతబడ్డయ్‌.  మా ఆఫీసు మాత్రం 50 శాతం ఉద్యోగులతో నడిచింది. ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ఇవ్వాళే  మా కార్యాలయం పూర్తిస్థాయి ఉద్యోగులతో కళకళలాడుతున్నది. జాగ్రత్తగా విధులు నిర్వర్తిస్తున్నం. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే లోపలికి వస్తున్నం. మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటిస్తున్నం. పనులపై వచ్చే వారికి మాస్కులు ఉంటేనే అనుమతిస్తున్నం. 

- విజయలక్ష్మి, రూర్బన్‌ డీపీఎం, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (పెద్దపల్లి)  logo