గురువారం 28 మే 2020
Karimnagar - May 11, 2020 , 02:51:59

అమ్మ రాదురా కన్నా.. నేనున్నారా నాన్నా..

అమ్మ రాదురా కన్నా.. నేనున్నారా నాన్నా..

అభం శుభం తెలియని పిల్లలు. ఒకరికి పద్నాలుగేళ్లు, మరొకరికి పదమూడేళ్లు, ఇంకొకరికి ఐదేళ్లు. తల్లిదండ్రులే లోకం. కళ్లముందు కనిపించి, మురిపించిన ఆ తల్లిదండ్రులు ఇప్పుడు లేక గాగిరెడ్డిపల్లికి చెందిన చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అల్లారుముద్దుగా పెంచిన నాన్న మంద సదానందం మూడు నెలల క్రితం అనుకోని రీతిలో లోకం విడిచివెళ్లగా, కంటికిరెప్పలా కాపాడుకున్న తల్లి స్వప్న కిడ్నీ సంబంధ వ్యాధితో కన్నుమూసింది. తాను చనిపోతున్నానని తెలిసిన ఆ మాతృమూర్తి, చివరిక్షణంలో బిడ్డలతో కుమిలిపోయింది. ‘ఇక నేనుండను. మనకెవరూ లేరు. మీకు మీరే భరోసా. కష్టపడి చదివి ప్రయోజకులు కండి. తమ్మున్ని మంచిగ చూసుకోండ్రి.’ అని చెప్పి వెళ్లిపోయింది. అమ్మ చెప్పిన మాటలను పదే పదే తలుచుకుంటూ కన్నీరు పెడుతున్న పెద్ద కూతురు అశ్రిత, చిన్న కూతురు స్ఫూర్తి, ‘మమ్మీ, డాడీ ఏరి’ అని అడుగుతున్న తమ తమ్ముడు రిష్వంత్‌కు సమాధానం చెప్పలేక కుమిలికుమిలి రోదిస్తున్నారు. తమ్ముడిని లాలిస్తూ, అమ్మానాన్నల్ని మరిపిస్తున్నారు. అనాథలైన ఈ నిరుపేద చిన్నారులు ఆపన్నహస్తం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.

  - చిగురుమామిడిlogo