గురువారం 04 జూన్ 2020
Karimnagar - May 11, 2020 , 02:52:00

నిల్వ నీరు పారబోసి.. కుండీలు శుభ్రం చేసి..

నిల్వ నీరు పారబోసి.. కుండీలు శుభ్రం చేసి..

  • మంత్రి కేటీఆర్‌ పిలుపునకు స్పందించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
  • ప్రతి ఆదివారం ‘పది గంటలకు పది నిమిషాలు’కు విశేష స్పందన

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌ : దోమల వల్ల వ్యాపించే సీజనల్‌ వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు చేపట్టిన ప్రతి ఆదివారం ‘పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆదివారం మంత్రి, విప్‌, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇండ్లలో పరిశుభ్రత పనులు చేపట్టారు. కరీంనగర్‌లోని తన నివాసంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, తన సతీమణి స్నేహలతతో కలిసి గార్డెన్‌ వర్క్‌ చేశారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ హైదరాబాద్‌లోని తన నివాసంలో పూలకుండీలోని నీటిని కుమారుడు సుహాన్‌తో కలిసి తొలగించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మెట్‌పల్లిలోని తన ఇంటిలో, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ తన ఇంటి ఆవరణలో పారిశుధ్య పనులు చేశారు. రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తన నివాసంలో తొట్ట్టిల్లో నిల్వ ఉన్న నీటిని పారబోశారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు తన ఇంట్లోని పాత కూలర్‌ను శుభ్ర పరిచారు. సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాగజ్‌నగర్‌ పట్టణంలోని తన నివాసంలో కూలర్‌లోని నీటిని తొలగించారు. కరీంనగర్‌లోని 59వ డివిజన్‌లో మేయర్‌ సునీల్‌రావు పలు ఇండ్లను సందర్శించి నిల్వ ఉన్న నీటిని పారబోశారు. జగిత్యాల జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత తన ఇంటి ఆవరణలో పారిశుధ్య పనులు చేశారు. రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ తమ ఇంటిలో పూలమొక్కలను సరిచేశారు. కరీంనగర్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలోని కుండీల్లో నిల్వ ఉన్న నీటిని, తడి చెత్తను కలెక్టర్‌ శశాంక తొలగించారు. క్యాంపు కార్యాలయంలో జగిత్యాల కలెక్టర్‌ రవి నీటి కుండీలను శుభ్రం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తన ఇంటి పరిసరాలను, కూలర్‌ శుభ్రం చేశారు. 

కరీంనగర్‌ డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌ తమ ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. కొత్తపల్లిలో మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు హుజూరాబాద్‌లోని 7వ వార్డులో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల తమ ఇండ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని పారబోశారు. జమ్మికుంటలో మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు 24 వార్డులో చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు. జగిత్యాల క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ రాజేశం నీటి కుండీలను శుభ్రం చేశారు. మెట్‌పల్లిలో మున్సిపల్‌ అధ్యక్షురాలు రాణవేణి సుజాత, కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, రాయికల్‌లో మున్సిపల్‌ అధ్యక్షుడు మోర హనుమాండ్లు, జగిత్యాలలో మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి, ఉపాధ్యక్షుడు గోలి శ్రీనివాస్‌, కోరుట్లలో మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో కమిషనర్‌ ఆయాజ్‌ పారిశుధ్య పనులు చేశారు. పెద్దపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ మమతారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, వైస్‌ చైర్మన్‌ నజ్మీనా సుల్తానా మోబిన్‌తో కలిసి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. సుల్తానాబాద్‌ పట్టణంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సునీత, వైస్‌ చైర్‌పర్సన్‌ బిరుదు సమత, కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, మంథనిలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ పరిశుభ్రతా పనులు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌ అంజయ్య, సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, చైర్‌పర్సన్‌ జిందం కళ, వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవి తమ ఇండ్లను, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ గడ్డం నర్సయ్య, ప్రజాప్రతినిధులు తమ వార్డుల్లో పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. మంచిర్యాల మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య పూలకుండీలను శుభ్రం చేశారు. కమిషనర్‌ స్వరూపారాణి ప్లాస్టిక్‌ వస్తువులను శుభ్రం చేశారు. బెల్లంపల్లి మున్సిపల్‌ అధ్యక్షురాలు జక్కుల శ్వేత దంపతులు తమ ఇంటి పరిసరాల్లోని చెత్తను తొలగించారు. 


logo