గురువారం 04 జూన్ 2020
Karimnagar - May 10, 2020 , 02:39:28

అంచనాలు తారుమారు.. అగ్గువైన కాయగూరలు

అంచనాలు తారుమారు.. అగ్గువైన కాయగూరలు

  • కాళేశ్వర జలాలతో పెరిగిన కూరగాయల సాగు విస్తీర్ణం
  • ఈ యేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 836 ఎకరాల్లో అదనం 
  • గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన ధరలు 
  • ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి లేకున్నా అదుపులోనే..
  • దళారుల ప్రమేయం లేకపోవడమే ప్రధాన కారణం 
  • నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్న రైతులు 
  • ప్రస్తుత క్రయవిక్రయాలతో ఇద్దరికీ మేలు 

‘లాక్‌డౌన్‌ సమయంలో కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతాయి. సామాన్యులకు చుక్కలు చూపుతాయి. తొక్కోవక్కో.. పప్పో పులుసో తినడం తప్ప మరో గత్యంతరం ఉండదు.’ మొదట్లో అందరూ ఇలానే అనుకున్నా, ఆ తర్వాత ఎవరూ ఊహించనట్లుగా అంచనాలు తలకిందులయ్యాయి. ప్రస్తుతం ఏ మార్కెట్‌లో చూసినా తాజా కాయగూరలు అగ్గువకే దొరుకుతున్నాయి. ఎప్పుడూ అనుకోని విధంగా గతేడాది మేతో పోలిస్తే 30 నుంచి 40 శాతం ధరలు తగ్గాయి. కాళేశ్వర జలాలు కదలిరావడంతో ఉమ్మడి జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగ్గా, గతంతో పోలిస్తే ప్రతి ఎకరాకూ 25 శాతానికిపైగా అధిక దిగుబడులు వచ్చాయి. ఇదే సమయంలో ప్రభుత్వం ధరల నియంత్రణ కమిటీలు వేసి చర్యలు తీసుకోవడం, దళారుల ప్రమేయం లేకపోవడం, ఎగుమతులు తగ్గడంతో రైతులకూ గిట్టుబాటు అవుతున్నది. నేరుగా కర్షకులే వచ్చి విక్రయిస్తుండడంతో వినియోగదారులకూ లాభం కలుగుతున్నది.

- కరీంనగర్‌ ప్రతినిధి/ కరీంనగర్‌ నమస్తే తెలంగాణ

పెరిగిన సాగు విస్తీర్ణం 

గతేడాది యాసంగిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7,305 ఎకరాల్లో కూరగాయలు పండించగా, ఈసారి సాగు విస్తీర్ణం 8,141 ఎకరాలకు చేరింది. అంటే 836 ఎకరాల్లో అదనంగా సాగయింది. పోయినేడు వేసిన తోటల్లో 30 శాతానికిపైగా ఎండిపోయాయి. చాలా ప్రాంతాల్లో మొదట నీళ్లందినా, ఆ తర్వాత తడి లేక వాడిపోయాయి. దిగుబడి కూడా చాలా తగ్గింది. కానీ, ఈసారి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాళేశ్వరం జలాలు రావడంతో భారీగా భూగర్భజలాలు పెరిగాయి. మండుటెండల్లోనూ బావుల్లో ఉబికి వస్తున్నాయి. నీటి వసతి పెరగడంతో రైతులు పెద్దసంఖ్యలో కూరగాయల వైపు ఆసక్తి చూపారు. నూటికి 80 శాతం పల్లెల్లో సాగు చేశారు. దీంతో విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. తోటలకు నీళ్లు సమృద్ధిగా అందుతుండగా, గతంతో పోలిస్తే 25 శాతానికి పైగా దిగుబడి పెరిగింది. 

గతేడాదితో పోలిస్తే తగ్గిన ధరలు

నిజానికి లాక్‌డౌన్‌తో ధరలు ఆకాశాన్నంటుతాయని అందరూ భావించారు. కానీ, ప్రస్తుతం అంచనాలు తలకిందులయ్యాయి. గతంలో ఉమ్మడి జిల్లా రైతులు పండించిన కూరగాయలను హోల్‌సేల్‌గా దళారులే కొనేవారు. కొన్న కూరగాయలను మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ర్టాలకు ఎగుమతి చేసేవారు. దీంతో స్థానికంగా కొరత ఏర్పడి మార్కెట్‌లో ధరలు మండిపోయేవి. ఈ విధానం వల్ల రైతుకు లాభం లేకపోగా, వినియోగదారులపై అదనపు భారం పడేది. కానీ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో దళారీ వ్యవస్థ ప్రమేయం తగ్గింది. రైతులు కూడా తమ పంథాను మార్చుకొని, నేరుగా మార్కెట్‌లోకి వచ్చి విక్రయిస్తున్నారు. దీంతో దళారులకు విక్రయించే ధర కన్నా అధికంగా గిట్టుబాటు అవుతున్నది. గతంలో దళారులకు విక్రయిస్తే.. వారం పది రోజులకోసారి రైతులకు డబ్బులు ఇచ్చే వారు. ప్రస్తుతం ఏ రోజుకారోజు నగదు తీసుకెళ్తున్నారు. 

వినియోగదారులకు మేలు

సాధారణంగా వేసవిలో జరిగే శుభకార్యాలను దృష్టిలో పెట్టుకొని దళారులు కృత్రిమ కొరత సృష్టించే వారు. ఆ కారణంగా కూడా ధరలు పెరిగేవి. కానీ, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు.. అధికారులు జిల్లాల వారీగా ధరల నియంత్రణ కమిటీలు వేసి, పక్కాగా అమలు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే రైతులు పట్టణాల్లో ఎక్కడివారు అక్కడే విక్రయాలు చేసుకునేలా సౌకర్యాలు కల్పించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 22 మినీ మార్కెట్లను అందుబాటులోకి తెచ్చారు. అలాగే మొబైల్‌ కూరగాయల వాహనాలు ఏర్పాటు చేసి, ఇండ్ల  ముందుకు తెచ్చారు. దీంతో వినియోగదారులకు తాజా కూరగాయలు దొరుకుతున్నాయి. ప్రభుత్వ చర్యలు, పెరిగిన సాగునీటి వసతి, అధికారుల ముందుచూపు.. వంటివన్నీ విపత్కర పరిస్థితుల్లో ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చేశాయి.

పైసలు మంచిగనే వస్తున్నయ్‌..

మాకు మూడెకరాలు ఉన్నది. కొంత భూమిల మూడేళ్ల సంది కాయగూరలు పెడ్తున్న. పోయినేడు 15 గుంటల్లో బెండకాయ, వంకాయ పెట్టిన. పండిన కాయల్ని కరీంనగర్‌ తీసుకెళ్లి దళారులకు గంపగుత్తగ అమ్మేది. ఈ సారి ఎకరం 5 గుంటల్ల మళ్లీ బెండ, వంకాయనే వేసిన. కరోనా చెయ్యవట్టి మార్కెట్లు బందైనయ్‌. దళారులు పోయిన్రు. మేమే వెళ్లి అమ్ముతున్నం. ధరలు తక్కువున్నా పోయినసారి లెక్కనే పైసలు మంచిగనే వస్తున్నయ్‌. కొనేటోళ్లకు కూడా ఇబ్బంది ఉంటలేదు. 

- ఆవుల భాగ్య, గోపాల్‌పూర్‌ (కరీంనగర్‌ రూరల్‌)

తెల్లవారు జాము నుంచే పర్యవేక్షణ.. 

కరోనా నేపథ్యంలో కలెక్టర్‌ శశాంక ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచే పర్యవేక్షిస్తున్నాం. 3.30 నుంచి 4.30 గంటల వరకు మార్కెట్లోకి ఏ రకం కూరగాయలు ఎన్ని క్వింటాళ్లు వచ్చాయి? ఆ రోజు డిమాండ్‌ ఏమిటి? అని పరిశీలించి, ఏ రోజుకారోజు ధరలు నియంత్రిస్తున్నాం. అన్ని చోట్లా మినీ మార్కెట్లు అందుబాటులోకి తెచ్చాం. ముఖ్యంగా కరీంనగర్‌లోనే 16 మినీ మార్కెట్లు ఏర్పాటు చేశాం. ఇప్పుడు 13 చోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. 12 మొబైల్‌ కూరగాయల వాహనాలు ఏర్పాటు చేస్తే, ఇప్పుడు 8 పనిచేస్తున్నాయి. అంతేకాకుండా నేరుగా రైతులు విక్రయించుకునే విధంగా గ్రామాల్లో ప్రచారం చేశాం. వాళ్లే నేరుగా వచ్చి అమ్ముకునేలా సదుపాయాలు కల్పించాం. ధరలు నియంత్రణకు ఇవన్నీ కారణాలుగా చెప్పవచ్చు.. 

- వీ పద్మావతి, కరీంనగర్‌ జిల్లా మార్కెటింగ్‌ అధికారి (కరీంనగర్‌) 

35గుంటల్ల సాగు చేసిన..

గతంలో కంటే ఈసారి కూరగాయలు రెట్టింపు సాగు చేసిన. గతంల 10 గుంటల్లో బెండకాయ, 10 గుంటల్లో టమాట పండించిన. అప్పుడు దళారుల వల్ల సరిగా గిట్టుబాటు రాకపోయేది. ఈ సారి నీటి సౌకర్యం ఉందని 35 గుంటల వరకు కూరగాయలు వెట్టిన. 10 గుంటల్ల అల్చంత, 10 గుంటల్ల టమాట, 15 గుంటల్ల బెండ సాగు చేసిన. నేరుగా ప్రజలకు అమ్ముతున్నం. అట్ల అమ్మితే మాకు లాభమైతంది.

- ఊరడి నాంపెల్లి, గోపాల్‌పూర్‌ (కరీంనగర్‌రూరల్‌)

జిల్లా అవసరాలకే వినియోగం.. 

ఈ సారి కూరగాయల సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో కంటే 25 శాతం దిగుబడి కూడా పెరిగింది. కరోనా నేపథ్యంలో కూరగాయలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం లేదు. దిగుబడి పూర్తిగా స్థానిక అవసరాలకే వినియోగం అవుతున్నది. ధరలు ఇప్పటి వరకైతే నియంత్రణలోనే ఉన్నాయి. మరీ కనిష్ఠ స్థాయికి పడిపోలేదు. రైతులకు ఎలాంటి నష్టం ఉండడం లేదు. పట్టణ మార్కెట్లకు తేకుండా ఇప్పుడు చాలా మంది రైతులు ఆయా గ్రామాల్లోనే తిరుగుతూ కూరగాయాలు విక్రయిస్తున్నారు.  

- శ్రీనివాస్‌, జిల్లా హార్టికల్చర్‌ అధికారి (కరీంనగర్‌)

సాగు, ఆదాయం రెండూ పెరిగినయ్‌.. 

నేను డిగ్రీ దాకా చదివిన. నాకు ఓదెలలో రెండు ఎకరాల భూమి ఉన్నది. నాలుగేళ్లుగా ఉద్యాన పంటలు వేస్తున్న. బావి ఉన్నా నీళ్లు ఎల్లక ప్రభుత్వం ఇచ్చిన డ్రిప్‌ సాయంతోనే సాగు చేస్తున్న. కానీ ఈ యేడు ఎస్సారెస్పీ నుంచి నీళ్లు రావడంతో భూగర్భ జలాలు పెరిగినయ్‌. మా బావిలో నీళ్లు ఎల్లుతున్నయ్‌. అందుకే ఈ యేడు టమాట, బీర అదనంగా వేసిన. దిగుబడి బాగానే వస్తున్నది. లాక్‌డౌన్‌ నుంచి రైతులకు సర్కారు అనుమతి ఇవ్వడంతో గోదావరిఖని, కరీంనగర్‌లోని వ్యాపారులకు హోల్‌సేల్‌గా అమ్ముతున్న. మంచి ఆదాయం వస్తంది. పెట్టుబడి పోను ఎకురానికి 80వేల పైనే మిగులుతున్నయ్‌. 

- పనాస అశోక్‌, ఓదెల


logo