శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - May 09, 2020 , 01:57:50

తెరుచుకున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు

తెరుచుకున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు

  • పూర్తి స్థాయిలో పనిచేస్తున్న వివిధ శాఖలు
  • పుంజుకుంటున్న రిజిస్ట్రేషన్లు.. రవాణా సేవలు 
  • పెరుగుతున్న మున్సిపల్‌ వసూళ్లు.. విద్యుత్‌ బిల్లుల చెల్లింపు 
  • గాడిన పడుతున్న వ్యాపార సంస్థలు, పరిశ్రమలు
  • పట్టణాల్లో సరి, బేసి విధానంలో షాపులు ఓపెన్‌
  • ఇప్పుడిప్పుడే మొదలైన తాకిడి

జిల్లాల్లో ‘సడలింపు సందడి’ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం    లాక్‌డౌన్‌లో మినహాయింపులు ఇచ్చిన తర్వాత క్రమంగా పూర్వ స్థితి కనిపిస్తున్నది. నిబంధనల ప్రకారం వ్యాపార సంస్థలు,    పరిశ్రమలు తెరుచుకుంటున్నాయి. భవన నిర్మాణ పనులూ  మొదలయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో  అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల సేవలు పుంజుకుంటున్నాయి. విద్యుత్‌ బిల్లులు, మున్సిపల్‌ పన్నులు వసూలవుతున్నాయి. క్రమంగా ప్రజా జీవనం, ప్రభుత్వ పాలన గాడిన పడుతున్నది. ఇప్పుడిప్పుడే రోడ్లపై రద్దీ పెరుగుతున్నది. రాజీవ్‌ రహదారిపై భారీ వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. 

- కరీంనగర్‌/పెద్దపల్లి/సిరిసిల్ల/మంచిర్యాల/ఆసిఫాబాద్‌/నమస్తే తెలంగాణ/జగిత్యాల/జగిత్యాల క్రైం/జగిత్యాల అర్బన్‌

పూర్తి స్థాయిలో ప్రభుత్వ సేవలు..

సడలింపులతో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ సేవలు పెరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్‌, రవాణా శాఖల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తున్నాయి. లాక్‌డౌన్‌లోనూ విధులు నిర్వహించిన వ్యవసాయ శాఖ, ఇప్పుడు పూర్తిస్థాయిలో సేవలందిస్తున్నట్లు డీఏవో వాసిరెడ్డి శ్రీధర్‌ తెలిపారు. ఇటు రెవెన్యూ శాఖ కూడా ఎప్పటిలాగే విధులు నిర్వర్తిస్తున్నది. గ్రామీణాభివృద్ధి సంస్థలో ఉద్యోగుల సందడి కనిపిస్తున్నది. శుక్రవారం అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లను పరిశీలించగా, అనేక శాఖల్లో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తూ కనిపించారు. మాస్కులు ధరించి వచ్చిన ప్రజలకు తమ సేవలందించారు. అన్ని చోట్లా కార్యాలయాల్లోకి వచ్చే వారికి స్క్రీనింగ్‌ టెస్టులు చేస్తున్నారు. హ్యాండ్‌ వాష్‌ చేసుకున్న అనంతరమే అనుమతిస్తున్నారు. మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించేలా చూస్తున్నారు. ‘నో మాస్క్‌.. నో వర్క్‌' విధానాన్ని కొనసాగిస్తున్నారు. 

రవాణాశాఖలో పూర్తి సేవలు..

రవాణా శాఖలో సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌లు పెరుగుతున్నాయి. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని రవాణా శాఖ ఉప కమిషనర్‌ కార్యాలయంలో ఈ నెల 7న 175 మంది వాహనదారులు వివిధ సేవలు పొందగా, సుమారు 2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. శుక్రవారం స్లాట్‌ బుకింగ్స్‌ రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి. ఈ రోజు 380 మంది బుకింగ్‌ చేసుకోగా రవాణా శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సేవలందించారు. సుమారు 4 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. జగిత్యాల జిల్లాలో ప్రస్తుతం 20 వరకు రిజిస్ట్రేషన్లు చేశామని డీటీవో శ్యాం నాయక్‌ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఎనిమిది వాహన రిజిస్ట్రేషన్లు కాగా, సిరిసిల్లలో 18 లర్నింగ్‌, 13 పర్మినెంట్‌ లైసెన్సులు ఇచ్చారు. మరో మూడు వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేశారు. మంచిర్యాల జిల్లాలో శుక్రవారం 39 లైసెన్స్‌లు జారీ చేశారు. మరో 11 ఇతర రిజిస్ట్రేషన్లు, ఎనిమిది ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, 2 పర్మిట్లు జారీ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో వినియోగదారులు ఇప్పుడిప్పుడే స్లాట్‌ బుకింగ్‌ చేసుకుంటున్నారు. 

పెరుగుతున్న వసూళ్లు..

వివిధ శాఖల ద్వారా పన్నులు, బిల్లుల వసూళ్లు కూడా పెరుగుతున్నాయి. కరీంనగ ర్‌ జిల్లాలో ఈ నెల 23.09 కోట్ల డిమాండ్‌ ఉండగా, ఇప్పటి వరకు 82 లక్షలు వసూలయ్యాయి. గురువారం 18 లక్షలు, శుక్రవారం 22 లక్షల వరకు వసూలైనట్లు అధికారులు తెలిపారు. ఇక మున్సిపల్‌ పన్నుల వసూళ్లు కూడా గాడిలో ప డుతున్నాయి. ఈనెల 7న 11 లక్షలు కాగా, శుక్రవారం 8 లక్షలు వసూలయ్యా యి. మిగతా జిల్లాల్లోనూ ఇప్పుడిప్పుడే అన్ని రకాల బిల్లులు వసూలవుతున్నాయి. 

బిజీ అవుతున్న పరిశ్రమలు..

లాక్‌డౌన్‌తో దాదాపు 45 రోజులు మూతబడిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. కరీం‘నగరం’లోని పారిశ్రామిక వాడ పద్మనగర్‌లో శుక్రవారం దాదాపు 60 శాతానికిపైగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన సీడ్‌ ప్రాసెస్‌ యూనిట్లు ఎక్కువగా నడుస్తున్నాయి. పద్మనగర్‌లోని పవర్‌ లూం పరిశ్రమలు క్రమంగా ఓపెన్‌ అవుతున్నాయి. కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లోని గ్రానైట్‌ పరిశ్రమ కూడా తెరుచుకుంటున్నది. ఇక్కడ వందలాది మంది కార్మికులు విధుల్లో చేరుతున్నారు. అలాగే అన్ని జిల్లాల్లో ఆటో మొబైల్‌ రంగానికి చెందిన పరిశ్రమలు, కార్ఖానాలు కూడా ఓపెన్‌ అవుతున్నాయి. ఇక భవన నిర్మాణ పనులు కూడా వేగవంతమయ్యాయి. ఇందుకు అవసరమైన ఇసుక రీచ్‌లు తెరుచుకుంటున్నాయి. నిర్మాణ రంగానికి అవసరమైన సిమెంట్‌, స్టీల్‌ దుకాణాలు మొదలవుతున్నాయి. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని పారిశ్రామికప్రాంతాలు బిజీగా మారాయి. ఎన్టీపీసీలోని టీఎస్టీపీపీ, గోదావరిఖనిలోని ఆర్‌ఎఫ్‌ఎసీఎల్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సిరిసిల్ల కార్మికక్షేత్రంలో సాంచాల సప్పుళ్లు మొదలయ్యాయి. నేత కార్మికులు సంతోషంగా పనులు చేసుకుంటున్నారు.

గాడిన పడుతున్న వ్యాపారాలు..

మండల కేంద్రాలు, గ్రామాల్లోని దుకాణాలు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. బల్దియాల్లో వ్యాపార సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో నిత్యావసర దుకాణాలు, వ్యవసాయ ఆధారిత షాపులు, మద్యం షాపులు, నిర్మాణ రంగ దుకాణాలను చేర్చారు. వీటిని నిర్వహించుకునేందుకు ఎలాంటి అనుమతులూ అవసరం లేదు. ఇక బీ కేటగిరీలో బట్టలు, చెప్పుల దుకాణాల వంటివి చేర్చారు. వీటిలో ప్రతిరోజూ 50 శాతం మాత్రమే నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ఇందుకు సరి, బేసి విధానంలో ఆయా దుకాణాలకు నంబర్లు వేశారు. నెలలో సరి సంఖ్య తేదీ వచ్చిన రోజు సరి సంఖ్య.. బేసి సంఖ్య రోజు బేసి సంఖ్య దుకాణాలను తెరుస్తున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వర్క్‌షాపులు, వెల్డింగ్‌, ఎలక్ట్రికల్‌ షాపులు, భవన నిర్మాణాలకు సంబంధించి సిమెంట్‌, స్టీల్‌, ప్లంబింగ్‌, కార్పెంటర్‌ షాపులను తెరుస్తుండగా, వినియోగదారులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన షాపులను తెరవడంతో రైతులు తమకు కావాల్సినవి కొనుగోలు చేస్తున్నారు. ఇక మెడికల్‌ షాపులు, నిత్యావసర దుకాణాలు మొదటి నుంచి తెరిచే ఉంచుతుండడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగడం లేదు. ఇక సీ కేటగిరీలో చేర్చిన హోటళ్లు, స్కూళ్లు, సినిమా హాళ్లు, జిమ్ములపై ఆంక్షలు కొనసాగుతుండడంతో వాటిని తెరవడం లేదు.

రోడ్డెక్కుతున్న వాహనాలు..

లాక్‌డౌన్‌ సమయంలో పూర్తిగా నిలిచి పోయిన వాహనాలు రెండు రోజులుగా రోడ్డెక్కుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఎప్పటిలాగే ఆంక్షలుండగా, దీంతో ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోడ్లపై వాహనాలు తిరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే రోడ్లపై రద్దీ పెరుగుతున్నది. రాజీవ్‌ రహదారిపై లారీల రాకపోకలు పెరిగాయి. పరిమిత సంఖ్యలో ప్రయాణికులతో నగరంలో ఆటోలు నడిచాయి. ఆరెంజ్‌ జోన్‌లో ఉన్న జిల్లాలో జనజీవనం క్రమంగా గాడిలో పడుతున్నది.  పుంజుకుంటున్న భూముల రిజిస్ట్రేషన్లు..

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు తాకిడి మొదలైంది. రెండు రోజుల్లోనే ఈ శాఖ ద్వారా ఆదాయం పెరిగింది. ఆయాచోట్ల స్క్రీనింగ్‌ టెస్టులు చేసిన అనంతరం కార్యాలయాల్లోకి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా చూస్తున్నారు. కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం ఇస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలో 119 రిజిస్ట్రేషన్ల ద్వారా 22,90,373 వరకు ఆదాయం వచ్చిందని, మొదటి రోజు 48, రెండో రోజు 71 రిజిస్ట్రేషన్లు జరిగాయని కరీంనగర్‌ అర్బన్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ డీ అశోక్‌ తెలిపారు. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు పుంజుకునే అవకాశముందని చెప్పారు. జగిత్యాల జిల్లావ్యాప్తంగా 26 రిజిస్ట్రేషన్లు అయినట్లు సబ్‌ రిజిస్ట్రార్‌ నరేశ్‌ తెలిపారు. పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మొత్తంగా 96 రిజిస్ట్రేషన్లు చేయగా, 18లక్షల 49వేల 470 ఆదాయం వచ్చింది. సిరిసిల్ల, వేములవాడ ఆఫీసుల్లో 38 రిజిస్ట్రేషన్లు కాగా, 12,77,465 ఆదాయం సమకూరింది. అలాగే మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రస్తుతం 35 నుంచి 40 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీధర్‌ రాజు వెల్లడించారు. ఆసిఫాబాద్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో 30 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కాగా, 1,90,035 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.  

రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి 

జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. గతంలో 70 నుంచి 80 వరకు భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం 35 నుంచి 40 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. భూమి అమ్మేవారు, కొనేవారు, ముగ్గురు సాక్షులు, దస్తావేజు లేఖరి ఇలా కేవలం ఐదుగురిని మాత్రమే అనుమతిస్తున్నాం. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. దీంతో ప్రక్రియ నెమ్మదిగా చేస్తున్నాం. ప్రజలు నిరభ్యంతరంగా వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. కానీ లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. మాస్కులు ధరించి మాత్రమే కార్యాలయానికి రావాలి. లేకపోతే రిజిస్ట్రేషన్లు చేయం. 

- శ్రీధర్‌ రాజు, సబ్‌ రిజిస్ట్రార్‌ (మంచిర్యాల)

కొంత ఊరట..

లాక్‌డౌన్‌తో ఇన్నిరోజులు స్టీల్‌ వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. భవన నిర్మాణరంగానికి సడలింపు ఇవ్వడంతో 46 రోజుల తర్వాత దుకాణం తెరిచినం. కొంత ఊరట లభించింది. కనీ, స్టీల్‌ కొనుగోళ్లు ఇప్పుడు ఆశించిన మేర లేవు. నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయినవారు మాత్రమే కొనేందుకు వస్తున్నరు.  

-శ్రీనాథ్‌, ఐరన్‌ హార్డ్‌వేర్‌ మర్చంట్‌ (జగిత్యాల)

ఆర్డర్లు తీసుకుంటున్నం..

యాసంగిలో ట్రాక్టర్‌, ఇతర విడిభాగాలకు మంచి గిరాకీ ఉంటది. మార్చిలో ట్రాక్టర్ల కోసం కొందరు రైతులు ఆర్డర్‌ ఇచ్చిన్రు. వాటిని మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా నుంచి తీసుకురావాలె. లాక్‌డౌన్‌తో దిగుమతి సాధ్యం కాలేదు. ఇప్పుడు వ్యవసాయరంగానికి ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడంతో రైతుల వద్దకు వెళ్లి ఆర్డర్లు తీసుకుంటున్నం.  

-రాజేందర్‌, ట్రాక్టర్‌ షోరూం యజమాని (జగిత్యాల)logo