శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - May 08, 2020 , 06:35:24

గ్రీన్‌జోన్‌ దిశగా కరీంనగర్‌

గ్రీన్‌జోన్‌ దిశగా కరీంనగర్‌

  • ఇక మిగిలింది ఒక్కరే..
  • కట్టుదిట్టంగా కరోనా కట్టడి
  • కంటైన్‌మెంట్‌ ఏరియాల ఎత్తివేత..  
  • ఇప్పటి వరకు 546 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు..
  • సడలింపుల నడుమ తెరుచుకున్న షాపులు

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తేతెలంగాణ: జిల్లాలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇక్కడ చేపట్టిన వైరస్‌ నియంత్రణ చర్యలను సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌లోకి వచ్చిన జిల్లాలో క్రమంగా కంటైన్‌మెంట్‌ ఏరియాలను ఎత్తివేశారు. మార్చిలో ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులు, మర్కజ్‌ ప్రార్థనలకు  వెళ్లి వచ్చిన వారి కారణంగా జిల్లాలో 19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మంది కోలుకుని హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు.  ఒక్కరు మాత్రమే హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 546 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా, 522 మందికి నెగెటివ్‌ వచ్చింది. 19 మందిలో కరోనా లక్షణాలు బయటపడగా, చికిత్స తర్వాత 18మందికి నెగిటివ్‌ వచ్చింది. మిగతా వారి రిపోర్ట్స్‌ రావాల్సి ఉంది. 

ఇండోనేషియన్లతో వెలుగులోకి..

ఇండోనేషియా మతప్రచారకుల రాకతో జిల్లాలో పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. వారు తిరిగిన ముకరంపుర, కశ్మీర్‌గడ్డ ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించిన అధికారులు వైరస్‌ కట్టడికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. వైరస్‌ అదుపులోకి వచ్చిన తరుణంలో హుజూరాబాద్‌కు చెందిన కొందరు మర్కజ్‌కు వెళ్లి రావడంతో వారిలోనూ కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన ఆదేశాల మేరకు కరీంనగర్‌లోని ముకరంపుర, మంకమ్మతోట, సాహెత్‌నగర్‌, హుజూరాబాద్‌లోని మార్కెట్‌ ఏరియా, సిద్ధార్థనగర్‌, కాకతీయకాలనీ, మామిండ్ల్లవాడను కంటైన్‌మెంట్‌ ఏరియాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో 1.32 లక్షల మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. 14 రోజులుగా పాజిటివ్‌ కేసులు లేకపోవడంతో కంటైన్‌మెంట్‌ జోన్లను ఎత్తివేశారు. అయినప్పటికీ 69 బృందాలతో ఇప్పటికీ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌వో వెల్లడించారు. 

తక్కళ్లపల్లి ఘటనతో కలకలం..

జిల్లాలో పరిస్థితి చక్కబడుతున్న తరుణంలో జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన వృద్ధుడికి నగర శివారులోని ఓ దవాఖానలో క్యాన్సర్‌కు చికిత్స అందిస్తుండగా ఆయనలో కరోనా లక్షణాలు బయటపడ్డ ఘటన జిల్లాలో మరోసారి కలకలం రేపింది. ఆయనకు చికిత్స అందించిన వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది సహా ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్న 17 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. వీరితో కలిపి జిల్లాలో ఇప్పటికీ 134 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇతర రాష్ర్టాలు, జిల్లాల్లో ఉన్న వారు స్వస్థలాలకు వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మున్ముందు హోం క్వారంటైన్‌లో ఉండే వారి సంఖ్య పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. 

21 రోజులు కేసుల్లేకుంటే గ్రీన్‌జోన్‌లోకి..

జిల్లాలో కొత్త కేసులు నమోదు కానట్లయితే ఆరెంజ్‌ నుంచి గ్రీన్‌జోన్‌లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. గత నెల 15న కరీంనగర్‌లోని సాహెత్‌నగర్‌లో చివరిసారిగా కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. వరుసగా 21 రోజు లు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకానట్లయితే గ్రీన్‌ జోన్‌గా ప్రకటించాల్సి ఉంటుంది. జగిత్యాల వృద్ధుడి కేసుకు జిల్లాలో లింక్‌ ఉండడంతో ఈ అవకాశం లేకుం డా పోయిందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఆ రెంజ్‌ జోన్‌లో ఉన్న జిల్లాలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు కొన్ని సడలిస్తుండడంతో జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ముఖ్యంగా కరీంనగర్‌లోని వ్యాపారాలు కొనసాగించేందుకు సరి, బేసి సంఖ్యలో దుకాణాలకు అనుమతులు ఇస్తున్నారు. ఇదే సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 


logo