శనివారం 06 జూన్ 2020
Karimnagar - May 08, 2020 , 06:35:21

ఇటు రుణమాఫీ.. అటు రైతుబంధు..

ఇటు రుణమాఫీ.. అటు రైతుబంధు..

  • నిధులు విడుదల చేసిన రాష్ట్ర సర్కారు
  • ఆపత్కాలంలోనూ అన్నదాతకు అండ  

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆపత్కాలంలోనూ అన్నదాతకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. పంట రుణ మాఫీతోపాటు వానకాలం సాగుకు అవసరమైన ‘రైతుబంధు’ గ్రాంటును గురువారం సాయంత్రం విడుదల చేసింది. రెండు మూడు రోజుల తర్వాత నేరుగా ఖాతాల్లో జమచేస్తున్నట్లు ఆర్థిక, వ్యవసాయ శాఖ మంత్రులు టీ హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి ప్రకటించడంపై రైతుల్లో హర్షం వ్యక్తమైంది. ఇప్పటికే సుమారు 30 వేల కోట్లు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం, విక్రయించిన నాలుగైదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నది. మరోవైపు ఆర్థిక సంక్షోభం ఉన్నా 25 వేల లోపు పంట రుణాలు తీసుకున్న వారికి ఏకకాలంలో మాఫీ చేస్తున్నది. ఇక లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు ప్రస్తుతం 25 శాతం మాఫీ చేస్తున్నది. ఈ లెక్కన కరీంనగర్‌ జిల్లాలో గతేడాది ఏప్రిల్‌ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య సుమారు 93 వేల మంది ఉండగా, ఇందులో 12 వేలకు పైగా రైతులు 25 వేల లోపు రుణం తీసుకున్నారు. వీరికి ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నారు. మిగతా రైతులకు 25 శాతం మాఫీ చేస్తున్నారు. ఇక రైతుబంధు పథకం కింద వచ్చే వానకాలం సీజన్‌ కోసం ఇప్పుడే గ్రాంటు విడుదల చేశారు. జిల్లాలో గత వానకాలం సీజన్‌లో 1,61,653 మంది రైతులకు 171.65 కోట్ల వరకు రైతు బంధు కింద ఆర్థిక సహాయం అందింది. అయితే ఇప్పుడు రైతుల సంఖ్య పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 1.72 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయని, వీరిలో 1,51,500 మంది ఖాతాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇటు రైతుబంధు, అటు రుణ మాఫీకి సంబంధించిన గ్రాంటు వచ్చే సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఆపత్కాలంలో ఆదుకున్నడు..

కరోనా మహమ్మారి అచ్చినప్పటి నుంచి పైసలకు ఇబ్బందయితంది. మల్ల వానలు కొడితే పనులు ఎట్ల స్టార్ట్‌ చేద్దామని రందిగున్నది. ఇంత ఆపత్కాలంల కూడా రైతుబంధు పైసలు వేస్తున్న సీఎం కేసీఆర్‌ సారు రుణం మరువలేనిది. శానా సంతోషంగ ఉన్నది. ఎంతో మంది రైతులు పెట్టుబడి ఎట్ల అని ఆలోచిస్తున్న టైమ్‌ల పైసలు వేస్తమని చెప్పినంక పాణం నిమ్మలమైంది. 

-పీ శ్రీనివాస్‌, యాదవుల పల్లె (తిమ్మాపూర్‌రూరల్‌)logo