బుధవారం 03 జూన్ 2020
Karimnagar - May 07, 2020 , 02:53:52

బల్దియాల్లో సరి-బేసి

బల్దియాల్లో సరి-బేసి

  • షాపులకు నంబర్ల కేటాయింపు 
  • తేదీల వారీగా దుకాణాల నిర్వహణ 
  • ‘నో మాస్క్‌.. నో సేల్స్‌'
  • నిబంధనలు పాటించాల్సిందే

కరీంనగర్‌/ జగిత్యాల/ పెద్దపల్లి/ సిరిసిల్ల/ మంచిర్యాల ప్రతినిధులు/ కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతోపాటు మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. పెద్దపల్లి గ్రీన్‌జోన్‌లో ఉండగా, మిగతా ఐదు జిల్లాలు ఆరెంజ్‌ జోన్లలో ఉన్నాయి. రోజువారీగా స్క్రీనింగ్‌ టెస్టులు, పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక కొత్త కేసులు నమోదు కానట్లయితే గ్రీన్‌ జోన్‌లోకి వచ్చే అవకాశాలున్నాయి. బుధవారం నుంచి గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సడలింపులు ఇచ్చారు. కంటైన్‌మెంట్‌ జోన్‌గా ఉన్న తక్కళ్లపల్లి మినహా అంతటా మినహాయింపులిచ్చారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య సంస్థలన్నింటికీ సడలింపులు ఇవ్వడంతో దుకాణాలు తెరిచారు. బల్దియాల్లో సరి, బేసి విధానంలో షాపులకు అనుమతులు ఇస్తున్నారు. 44 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరిచారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తెరవాలని సీఎం ఆదేశించడంతో బుధవారం అన్నిచోట్ల కార్యాలయాల్లో ఉద్యోగులు పనిచేస్తూ కనిపించారు. రిజిస్ట్రేషన్లు, మోటర్‌ వాహనాల రిజిస్ట్రేషన్లు ఇలా అనేక శాఖల ఉద్యోగులు విధుల్లోకి వచ్చారు. రాజన్న సిరిసిల్లలో మరమగ్గాలు, డైయింగ్‌లు, వార్పిన్లు, సైజింగులు నుంచి ప్రారంభం కాగా, కార్మికులు సంతోషంగా విధుల్లో చేరారు.

రోజు విడిచి రోజు షాపులు..

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఆరు జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల పరిధిలో దుకాణాలను తెరిచే విషయంలో సరి, బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒకరోజు 50 శాతం, మరుసటిరోజు 50శాతం షాపులు తెరిచేలా ప్రణాళికాబద్ధంగా మున్సిపల్‌ అధికారులు ముందుకుసాగుతున్నారు. బుధవారం నుంచి దుకాణాలను గుర్తించి నంబర్లు వేశారు. నెలలోని సరి సంఖ్య తేదీల్లో సరి నంబర్‌, బేసి తేదీల్లో బేసి నంబర్‌ ఉన్న షాపులు కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సూచిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు షాపులను ఓపెన్‌ చేయవచ్చని నిర్దేశించారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఇదే పద్ధతిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దుకాణాల వద్ద భౌతికదూరం కోసం నాలుగు అడుగుల దూరంలో గుర్తులు కేటాయించనున్నారు. షాపులకు వెళ్లి వచ్చే దారుల్లో శానిటైజర్‌ బాటిళ్లను ఏర్పాటు చేయనున్నారు. తలుపులు, ఎలివేటర్లను తాకకుండా ఎరుపు రంగు వేయనున్నారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థలో బీ కేటగిరీ షాపుల నంబరింగ్‌ విధానాన్ని మేయర్‌ సునీల్‌రావు పరిశీలించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపుల యజమానులు కేటాయించిన తేదీల్లోనే దుకాణాలను తెరవాలని కార్పొరేషన్‌ కమిషనర్‌ క్రాంతి విలేకరుల సమావేశంలో సూచించారు.  

మూడు కేటగిరీలు..

సరి, బేసి విధానం అమలునకు షాపులన్నింటినీ మూడు కేటగిరీలుగా (ఏ, బీ, సీ) విభజించారు. ఏ కేటగిరీలో నిత్యావసరాలు, మెడికల్‌, నిర్మాణ రంగానికి సంబంధించిన, మద్యంషాపులు ఉంటాయి. ఈ దుకాణాలన్నీ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయి. సీ కేటగిరీలో హోటళ్లు, సినిమా హాల్స్‌, ఫంక్షన్‌హాల్స్‌, స్కూల్స్‌, జిమ్స్‌, స్టేడియాలు, ఆలయాలు, ప్రార్థన మందిరాలు, తదితరాలు వస్తాయి. లాక్‌డౌన్‌ వేళ వీటిని తెరిచేందుకు వీలు లేదు. కాగా, ఏ, సీ కేటగిరీల్లోకి రాని అన్ని దుకాణాలు ‘బీ’లో ఉంటాయి. ఉదాహరణకు బట్టలు, చెప్పులు, తదితర అన్ని షాపులు వస్తాయి. 

మాస్క్‌ లేకపోతే..

దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. లేనివారికి ఎలాంటి సామగ్రీ విక్రయించరాదు. అదేవిధంగా భౌతికదూరం పాటించాలని అధికారులు సూచించారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచాలన్నారు.   

నిర్ణీత తేదీల్లోనే షాపులు తెరవాలి : కలెక్టర్‌ శశాంక

మున్సిపాలిటీల పరిధిలో సరి-బేసి విధానంలో కేటగిరీల వారీగా నిర్ణీత తేదీల్లోనే దుకాణాలు తెరిచేలా చూడాలని అధికారులను కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ, బీ, సీ కేటగిరీలవారీగా దుకాణాలకు నంబర్లు కేటాయించాలని సూచించారు. దుకాణాదారుల మధ్య విభేదాలు రాకుండా చూడాలన్నారు. సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ, షాపులకు నంబర్లు వేసే సమయంలో అధికారులు అందుబాటులో ఉండరని, డివిజన్ల వారీగా నంబరింగ్‌ చేసే షాపుల వివరాలు అందించాలన్నారు. డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ పీ అశోక్‌, కరీంనగర్‌, హుజూరాబాద్‌ ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.logo