గురువారం 04 జూన్ 2020
Karimnagar - May 07, 2020 , 02:53:45

‘రోహిణి’లో అలికితేనే రాబడి

‘రోహిణి’లో అలికితేనే రాబడి

  • ప్రారంభంలో నారు పోస్తే అధిక దిగుబడులు
  • కార్తెలకు అనుగుణంగా సాగు.. రైతుకు మేలు
  • నాటి నుంచి నేటి దాకా శాస్త్రవేత్తల అధ్యయనాలివే..
  • తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుతో జోరుగా చర్చ
  • కాలంతో పనిలేకుండా పుష్కలంగా కాళేశ్వరం జలాలు
  • మార్పు అనివార్యం.. అప్పుడే అధిక లాభాలు
  • పూర్వ విధానమే మంచిదనే అభిప్రాయాలు

వానకాలం, యాసంగి పంటల కాలాన్ని ముందుకు తీసుకరావాలి. పూర్వం ఉన్న కార్తెల ప్రకారం పంటలు వేయాల్సిన అవసరమున్నది. రోహిణి కార్తెలోనే వడ్లు అలుకాలి. అందుకోసం అవసరమైతే నేను హుజూరాబాద్‌ వెళ్త. పంటకాలం ముందుకు తీసుకరావాల్సిన అవసరం అనివార్యం. మనం ఇప్పుడు మొగులు మొఖం చూడాల్సిన పని లేదు. మనకు అన్ని చోట్లా అస్యూర్డ్‌ వాటర్‌ ఉన్నది. అందుకే చెబుతున్న. సన్నరకాల ధాన్యం పెరగాలి. వీటికే ఎక్కువ డిమాండ్‌ ఉన్నది. వాటి ద్వారా రైతులకు లాభం జరుగుతుంది. ఈనెల 5న హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పిన మాటలివి. 

-కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

పూర్వ విధానమే ముద్దు.. 

ముఖ్యమంత్రి చెప్పిన మాటలు శాస్త్రవేత్తలతోసహా సమస్త రైతులను ఆలోచింపజేస్తున్నాయి. పూర్వవిధానంలో వ్యవసాయం చేయడం వల్ల జరిగే లాభాలపై అనేక చర్చలు జరుగుతున్నాయి. నిజానికి మన పూర్వీకులు తమ అనుభవాల విజ్ఞానసారాన్ని ఆధారంగా చేసుకొని కార్తెలు నిర్ణయించారు. వాటి ఆధారంగానే వ్యవసాయం చేశారు. కార్తెలకు అనుగుణంగానే పంటలు వేశారు. రోహిణి కార్తె ప్రారంభంలో నార్లు పోసుకుంటే సకాలంలో నాట్లు పడి, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధించేవారు. రాను రాను వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కొన్నేళ్లుగా వర్షాలు ఆలస్యంగా పడుతుండడంతో మే, జూన్‌ నెలల్లో వేయాల్సిన పంటలను ఆగస్టు వరకు వేస్తున్నారు. తద్వారా రైతులు అనేక రకాల నష్టాలను చూస్తున్నారు.

సకాలంలో పంట.. 

ప్రస్తుతం కాళేశ్వరం నీళ్లు కదిలివస్తున్నాయి. తెలంగాణ భూములను దమ్మారా తడుపుతున్నాయి. మండుటెండల్లోనూ చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. బాయిల్లో  ఈతలు కొట్టే స్థాయికి నీళ్లు పైకి వచ్చాయి. చెక్‌డ్యాంలు, చెరువులే కాదు, ప్రాజెక్టుల కింద ఉన్న కాలువలు గలగలపారుతున్నాయి. ఈ నేపథ్యంలో వానల కోసం ఎదురుచూడకుండా అన్నదాతలకు పుష్కలమైన జలాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని రోహిణి కార్తె నుంచే పంటలు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి సూచిస్తున్నారు. రోహిణి కార్తెకు అనుగుణంగా పంటలు వేయడం వల్ల వానకాలం, యాసంగి సీజన్లలో అధిక దిగుబడులు రావడమేకాదు.. అన్నదాతలకు అనేక రకాల మేలు జరుగుతుందన్న సీఎం అభిప్రాయంతో సీనియర్‌ శాస్త్రవేత్తలు ఏకీభవిస్తున్నారు. వానకాలం పంటల కాలం కూడా ముందుకు జరిగితే యాసంగికి కూడా కలిసివస్తుందని, ఇది రైతుకు ఎంతో లాభం చేకూరుస్తుందని చెబుతున్నారు. కాగా కరోనా పరిస్థితులు మారితే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విలేకరుల సమావేశంలో చెప్పినట్లుగానే.. రోహిణి కార్తెలో ఆయన హుజూరాబాద్‌కు వచ్చే అవకాశముందని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తున్నది. 

దిగుబడి పెరుగుతుంది.. 

మన పూర్వీకులు తమ విజ్ఞానసారాన్ని వినియోగించి కార్తెలు నిర్ణయించారు. ప్రతి కార్తెకూ ఒక ప్రాధాన్యత ఉంది. మే చివరి వారంలో ప్రారంభమయ్యే రోహిణి కార్తెలో విత్తునాటే ఏ పంటైనా సరే.. అక్టోబర్‌ నెల చివరి నాటికి చేతికొస్తుంది. సదరు పంటలకు రోగాలను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఖర్చు తగ్గుతుంది. పంటపై చలి ప్రభావం కూడా ఉండదు. కంకి బాగా వేస్తుంది. మంచి దిగుబడి వస్తుంది. 150 రోజులకు చేతికొచ్చే సన్నరకాల వడ్ల నారును రోహిణిలో పోస్తే, పంట అక్టోబర్‌లో చేతికి వస్తుంది. అక్టోబర్‌ తదుపరి వచ్చే పంటలపై చలి ప్రభావం కనిపిస్తుంది. కంకి లోలోపలే ఉండి పోతుంది. తాలు ఎక్కువగా వస్తుంది. తెగుళ్లు కూడా ఎక్కువగా ఆశిస్తాయి. నివారణకు మందులు వినియోగించడంతో రైతుకు ఆర్థిక భారం పెరుగుతుంది. దిగుబడి తగ్గుతుంది. రోహిణిలో నాటిన విత్తనాలకు ఆ తదుపరి కాలంలో నాటిన విత్తనాల దిగుబడులను చూస్తే.. సుమారు 15 నుంచి 20 శాతం పంట దిగుబడిలో తేడా ఉంటుంది. అలాగే, వర్షాలు కురిసిన తర్వాత అందరూ ఒకేసారి పంటలు వేయడం వల్ల కూలీల సమస్య ఉంటుంది. ఎరువుల కొరత  ఏర్పడే అవకాశమున్నది. మన పూర్వీకులు నిర్ణయించిన కాలం ప్రకారం వానకాలం పంటలు వేస్తే.. ఎన్నో సమస్యలను అధిగమించవచ్చు. నాణ్యమైన దిగుబడితోపాటు అన్నదాతలకు అన్నిరకాలుగా మేలు జరుగుతుంది. తెలంగాణలో ప్రస్తుతం వర్షాలతో సంబంధం లేదు. ప్రస్తుతం పుష్కలమైన సాగునీరు ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్లు, రైతులు రోహిణిలోనే సాగును ప్రారంభిస్తే అన్ని రకాలుగా మేలు చేకూరుతుంది. 

- డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, సీనియర్‌ శాస్త్రవేత్త (కృషి విజ్ఞాన కేంద్రం)

ఆలస్యంతో అన్నీ నష్టాలే.. 

పూర్వకాలం నుంచి రోహిణి కార్తెను సాగు ఆరంభానికి అనుకూలమైన కాలంగా గుర్తించారు. ఈ కార్తెలో వానకాలం పంటలు ప్రారంభిస్తే తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణస్థితికి అనుకూలంగా, అధిక దిగుబడులు వచ్చే అవకాశముందని భావించేవారు. మే మొదటి వారం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. జలాశయాల నుంచి నీరు ఆవిరిగా మారి, సంవహన వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నది. మే చివరి వారం నుంచి జూన్‌ మొదటి వారం (రోహిణి కార్తె)లో వర్షాలు కురిసే పరిస్థితుల్లో వానకాలం పంటను వేసేవారు. జూన్‌ మొదటి నుంచి ప్రారంభమైతే, గరిష్ఠంగా 150 రోజుల్లో అంటే అక్టోబర్‌ తొలివారంలోనే పంట చేతికి వస్తుంది. ఇది రైతాంగానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. అయితే, కొన్ని దశాబ్దాలుగా వర్షాలు సకాలంలో కురవకపోవడం, బావుల్లో నీరు అడుగంటిపోయిన నేపథ్యంలో మే చివరి వారం కాదు కదా, జూలై, ఆగస్టు తొలివారం వరకు నార్లు పోసే పరిస్థితి వచ్చింది. ఇలా చేస్తే పంట దిగుబడి ఎక్కువగా రావడం లేదు. తెలంగాణలో సెప్టెంబర్‌ చివరి వారం వరకు అనుకూల శీతోష్ణస్థితి కనిపిస్తుంది. అదనుపై వర్షాలు నమోదవుతాయి. అక్టోబర్‌ మధ్యవారం తర్వాత చలికాలం మొదలై, నవంబర్‌ మధ్యవరకు ఉష్ణోగ్రత పడిపోతుంది. జూన్‌ ఆఖరు, జూలై, ఆగస్టు తొలివారాల్లో వేసిన పంటలు, చలికాలంలో తీవ్రంగా దెబ్బతింటాయి. చీడపీడలు ఆశిస్తాయి. పూత, కంకి సరిగ్గా ఉండదు. దిగుబడి తగ్గిపోతుంది. ఈ పంటల కోతలు డిసెంబర్‌లో పూర్తవుతాయి. ఆ వెంటే రైతులు యాసంగి సాగుకు సిద్ధపడాల్సి వస్తుంది. వానకాలం పంట అవశేషాలు కుళ్లిపోకముందే యాసంగి పంట ఆరంభిస్తే భూమికి సారం చేకూరదు. ఇక డిసెంబర్‌ చివర, జనవరిలో వేసిన యాసంగి పంటలు మే నెల మధ్యలో కోతకు వస్తాయి. ఇది రైతులకు తీవ్ర ఇబ్బందికరం. ఏప్రిల్‌ నుంచి వడగండ్లు పడుతాయి. మేలో వీటి తీవ్రత ఎక్కువ. ఈ నేపథ్యంలో రైతులు పంటలు నష్టపోవాల్సి వస్తుంది. ఏప్రిల్‌, మేలో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఎండలు నమోదవుతాయి. ఈ పరిస్థితుల్లో వరికి నీరందించడం కష్టమవుతుంది. మే మధ్యలో యాసంగి కోతలు పూర్తి చేసుకునే రైతులు, జూన్‌ నుంచి మళ్లీ అదే పొలంలో వానకాలం సీజన్‌ సాగుకు సిద్ధపడాల్సి ఉంటుంది. ఇది సరికాదు. అందుకే రైతులు రోహిణిలోనే సేద్యం ఆరంభిస్తే, రెండు పంటలు సాగు చేసుకోవచ్చు. సీఎం కేసీఆర్‌ చెబుతున్న సన్నరకాలను సైతం గరిష్ఠంగా 150 రోజుల్లో పండించవచ్చు. అక్టోబర్‌ తొలివారంలోనే పంట చేతికి వస్తుంది. మూడు వారాలపాటు భూమి ఆరబెట్టడంతో భూ సారం పెరుగుతుంది. నవంబర్‌ తొలివారంలో యాసంగి పంట ఆరంభిస్తే, 125 రోజుల్లో పంట తీయవచ్చు. మార్చి 15వ తేదీ వరకు యాసంగి పంట సైతం చేతికి వస్తుంది. దీంతో రైతులకు వడగండ్ల బాధ తప్పుతుంది. మార్చి రెండోవారం నుంచి మే మూడో వారం వరకు వానకాలం పంట కోసం భూమిని సిద్ధం చేయవచ్చు. వానకాలం, యాసంగి పంటలు ఇలా పద్ధతి ప్రకారం సాగు చేస్తే, తెలంగాణలో రైతులు అధిక దిగుబడితోపాటు నాణ్యమైన పంటను పొందవచ్చు. 

- డాక్టర్‌ ఉమారెడ్డి, ఏడీఆర్‌ (పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం)logo