శనివారం 30 మే 2020
Karimnagar - May 06, 2020 , 01:54:47

నగరంలో ఇక రోజూ తాగునీరు

నగరంలో ఇక రోజూ తాగునీరు

  • ‘నిత్యం నీటి సరఫరా’కు కసరత్తు
  • విజయవంతంగా మొదలైన ట్రయల్న్‌
  • మరో వారం, పది రోజుల్లో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు
  • రాష్ట్రంలోనే తొలి కార్పొరేషన్‌గా రికార్డుల్లోకి ఎక్కనున్న కరీంనగర్‌ 
  • మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • ‘వెల్‌డన్‌ మినిస్టర్‌ సాబ్‌' అంటూ గంగులకు ట్విట్టర్‌ ద్వారా రామన్న అభినందనలు  
  • నగరవాసులకు తప్పనున్న తిప్పలు 

తలాపునే 24 టీఎంసీల సామర్థ్యంగల లోయర్‌ మానేరు డ్యాం ఉన్నా.. గత ప్రభుత్వాలు మాత్రం కరీంనగర వాసులకు నిత్యం తాగునీరందించలేకపోయాయి. ఏటా ఎండాకాలంలో నీటి కోసం తండ్లాడినా చోద్యం చూశాయి. ఈ కష్టాల నుంచి శాశ్వతంగా విముక్తులను చేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘నిత్యం నీటి సరఫరా’కు 2017లో శ్రీకారం చుట్టారు. పైలెట్‌ ప్రాజెక్టుగా నగరాన్ని ఎంపిక చేసి, 110 కోట్లను మంజూరు చేశారు. ఆ మేరకు దశలవారీగా పనులు పూర్తికాగా.. మంగళవారం మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు ట్రయల్న్‌ ప్రారంభించారు. దీనిపై ‘వెల్‌డన్‌ మినిస్టర్‌ సాబ్‌' అంటూ గంగులకు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా అభినందనలు తెలుపగా.. నగర ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు.

- కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ 


పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక..

కరీంనగర్‌ తలాపునే లోయర్‌ మానేరు డ్యాం ఉన్నా.. నగరం మాత్రం దశాబ్దాలుగా నీటి కొరతను ఎదుర్కొన్నది. 24.034 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌ ఉన్నా.. ఎండాకాలం వచ్చిందంటే నగరవాసులు నీటి కోసం కష్టాలు పడేవారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు నడువక, మున్సిపల్‌ నుంచి నీళ్లు రాక ఎన్నో ఇబ్బందులు పడేవారు. స్వరాష్ట్ర ఆవిర్భావం తదుపరి ఈ కష్టాలకు విముక్తి కల్పించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అప్పటి ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్‌ ఈ విషయంలో కీలక పాత్ర పోషించారు. ఆ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో అర్బన్‌ మిషన్‌ భగీరథ కింద నిత్యం నీటిసరఫరాకు చర్యలు తీసుకోవడానికి 2017లో శ్రీకారం చుట్టారు. అందుకోసం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 110 కోట్లను మంజూరు చేస్తూ అప్పట్లోనే ఉత్తర్వులు జారీచేశారు. 

యుద్ధ ప్రాతిపదికన పనులు..

అప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న మంచినీటి సరఫరాను ఒకవైపు క్రమబద్ధీకరిస్తూనే.. మరోవైపు నిత్యం నీటి సరఫరా కోసం కావాల్సిన పనులను కొనసాగిస్తూ వచ్చారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని సమీక్షించడంతోపాటు.. ఈ మధ్యకాలంలో యుద్ధప్రాతిపదికన పనులు చేయించారు. నిత్యం నీటి సరఫరా కోసం.. 110 కోట్లతో చేపట్టిన పనుల ద్వారా 2030 వరకు నీటి సమస్యలుండకుండా చర్యలు తీసుకున్నారు. కొత్తగా 36 ఎంఎల్‌డీ (మిలియన్స్‌ లీటర్‌ పర్‌ డే) సామర్థ్యం గల ఫిల్టర్‌ బెడ్‌ను కొత్తగా నిర్మించారు. దీంతో పాత కొత్త కలిపి ప్రస్తుతం రోజుకు ఫిల్టర్‌ బెడ్‌ (నీటిశుద్ధి కేంద్రాలు) సామర్థ్యం 84 ఎంఎల్‌డీలకు చేరింది. ప్రస్తుతం నీటి సరఫరాకు అనుసరిస్తున్న పాత విధానానికి స్వస్తి చెప్పి.. గ్రావిటీ ద్వారా నగరంలోని అన్ని ట్యాంకులకూ నీళ్లు వచ్చేందుకు వీలుగా నగరంలోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని గుట్టపై 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను నిర్మించారు. అందుకోసం ఫిల్టర్‌బెడ్‌ నుంచి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వరకు 7.7 కిలో మీటర్ల మెయిన్‌ పైపులైన్‌, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి నగరంలో వివిధ రిజర్వాయర్ల గ్రావిటీ ద్వారా నీరు వచ్చేందుకు వీలుగా 19 కిలోమీటర్ల పైపులైన్లు, రిజర్వాయర్‌ నుంచి డిస్ట్రిబ్యూషన్‌ కోసం.. 110 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్‌ పైపులతోపాటు రాంనగర్‌, హౌసింగ్‌ బోర్డుల్లో నూతనంగా రిజర్వాయర్లు నిర్మించారు. నీటి సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు ఫిల్టర్‌ బెడ్‌ వద్ద 375 హెచ్‌పీ సామర్థ్యం గల 6 మోటర్లు ఏర్పాటు చేయగా.. అందులో రెండు స్టాండ్‌బైగా వినియోగించనున్నారు. ఏదైనా విద్యుత్‌ సమస్య ఉత్పన్నమైనా.. నీటిసరఫరాలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఫిల్టర్‌ బెడ్‌వద్ద 2000 కేవీ సామర్థ్యం గల జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్టు కింద జరిగిన ఏర్పాట్ల ద్వారా 2030 వరకు నగర జనాభా ఆరు నుంచి ఏడు లక్షలకు పెరిగినా ఒక్కొక్కరికి 150 లీటర్ల చొప్పున ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. 

కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభానికి ఏర్పాట్లు.. 

నగరంలో నిత్యం నీటి సరఫరాకు సంబంధించిన ట్రయల్న్‌న్రు మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు ప్రారంభించారు. వారం పదిరోజుల్లో అధికారికంగా మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో నిత్యం నీటి సరఫరా ఇచ్చే కార్పొరేషన్‌గా కరీంనగర్‌ చరిత్రలోకి ఎక్కనుండగా, మంగళవారం మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ట్రయల్న్‌ ప్రారంభోత్సవ ఫొటోలను పెడుతూ.. ‘వెల్‌డన్‌ మినిస్టర్‌ సాబ్‌' అంటూ మంత్రి గంగుల కమలాకర్‌కు అభినందనలు తెలిపారు. అలాగే మేయర్‌ సునీల్‌రావుకు కంగ్రాట్స్‌ తెలిపారు. దశాబ్దాలుగా నగరవాసులు ఎదుర్కొంటున్న నీటి కష్టాలను దూరం చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రేమను కరీంనగర్‌పై చూపారని, ఆ మేరకు.. పనులు పూర్తిచేసి ప్రజలకు అతి త్వరలోనే నిత్యం నీళ్లు ఇస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఆ తదుపరి 24 గంటల పాటు నీళ్లు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుడుతామన్నారు. కరీంనగర్‌ నగర ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకొన్నామని, అందులో భాగంగా ట్రయల్న్‌ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ఒక ప్రకటన విడుదలచేశారు.

నీటి ఇబ్బంది లేకుండా చేస్తాం

  • నగరవాసులకు సీఎం ఇచ్చిన వరం
  • మంత్రి గంగుల కమలాకర్‌

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌లోని మహిళలు ఇకపై మంచినీటి కోసం ఇబ్బందులు పడకుండా ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేయనున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కరీంనగర్‌ శివారు మానేరు డ్యాం సమీపంలోని ఫిల్టర్‌బెడ్‌ వద్ద నిత్యం నీటి సరఫరాకు సంబంధించి ట్రయల్‌ రన్‌ను మంగళవారం కలెక్టర్‌ శశాంక, మేయర్‌ వై సునీల్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ఆడబిడ్డలు నీటి కోసం ఇబ్బందులు పడద్దన్న ఆలోచనతోనే సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తు చేశారు. భగీరథ ద్వారా ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో నీరందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మొదటి సారిగా కార్పొరేషన్‌ పరిధిలో కరీంనగర్‌లో రోజూ మంచినీటి సరఫరా చేయగలుగుతున్నామని తెలిపారు. నగరంలో రోజూ నీటిసరఫరాకు 50 ఎంఎల్‌డీ నీటి అవసరం ఉంటుందని, దీనిని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీర్చిదిద్దుకున్నామన్నారు. ఇది పూర్తిగా సీఎం కేసీఆర్‌ నగర ప్రజలకు ఇచ్చిన వరంగా భావిస్తున్నామన్నారు. నిత్యం నీటి సరఫరా కార్యక్రమాన్ని త్వరలోనే మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుంటామన్నారు. ఇది విజయవంతమైన తర్వాత నగరంలో 24 గంటల నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో రోజు నీటి సరఫరా చేసేందుకు పనులు పూర్తి చేయించిన అధికారులందరికీ అభినందనలు తెలిపారు. మేయర్‌ వై సునీల్‌రావు మాట్లాడుతూ ప్రజలందరికీ ఇది శుభదినమన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ప్రజలకు మంచినీటి రోజూ అందిస్తామని తెలిపారు. డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, నగర కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు, ఎల్‌ అండ్‌ టీ ప్రాజెక్టు మేనేజర్‌ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. నగరంలోని మీ సేవ కార్యాలయంలో రిసోర్స్‌ పర్సన్లకు మంత్రి నిత్యావసర సరుకులు అందజేశారు.


logo