గురువారం 28 మే 2020
Karimnagar - May 03, 2020 , 02:58:30

61 చెరువులను నింపుతాం

61 చెరువులను నింపుతాం

  • భూసేకరణ సమస్యలపై ప్రత్యేక దృష్టి n రైతులు సహకరించాలి
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ 
  • మానకొండూరు నియోజకర్గంపై అధికారులతో సమీక్ష 

తిమ్మాపూర్‌, నమస్తే తెలంగాణ/ గన్నేరువరం : కాళేశ్వరం జలాలతో మానకొండూర్‌ నియోజకవర్గంలోని 61 చెరువులను నింపేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి ఎల్‌ఎండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాజెక్టుల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మానకొండూర్‌ శాసనసభా నియోజకవర్గంలో కాళేశ్వరం జలాలు తరలించేందుకు ఎదురవుతున్న ఇబ్బందులు, భూసేకరణ సమస్యలు, జరుగుతున్న పనులు, ఇంకా చేయాల్సిన భూసేకరణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం కుడి కాలువ ద్వారా తోటపల్లికి నీరు ఇస్తున్న విషయం తెలిసిందేనన్నారు. తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి  మానకొండూర్‌ నియోజకవర్గంలోని తిమ్మాపూర్‌, బెజ్జంకి, ఇల్లంతకుంట, మానకొండూర్‌, అలాగే హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని సైదాపూర్‌, చిగురుమామిడి మండలాల్లోని అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇందుకోసం కాలువల నిర్మాణ పనులు సాగుతున్నాయని, దాదాపు 80 శాతం భూసేకరణ పూర్తికావడంతోపాటు ఆ మేరకు పనులు పూర్తవుతున్నాయని తెలిపారు. అయితే.. కొన్ని చోట్ల భూసేకరణ విషయంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు గుర్తించామన్నారు. వాటిపై సర్వే నంబర్ల వారీగా అధికారులతో చర్చించామన్నారు. ఇప్పటికే భూ సేకరణకు సంబంధించి అవార్డు పాస్‌ అయిందన్నారు. రైతులంతా సహకరించి, సదరు భూమిని ఇస్తే ఇంకా పనులను వేగవంతం చేసే ఆస్కారం ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ ఎంత తొందరగా పూర్తి చేస్తే అంతే తొందరగా మానకొండూర్‌ నియోజకవర్గానికి కాళేశ్వరం జలాలు ఇవ్వవచ్చన్నారు. మొత్తం కాలువల నిర్మాణాలు పూర్తయితే.. 61 చెరువులు నిండుతాయని, తద్వారా నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు. దీంతోపాటు అనంతగిరి ప్రాజెక్టు ద్వారా బెజ్జంకి మండలంలోని పలు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడానికి చర్యలు కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంలో మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడినట్లు చెప్పారు. నియోజకవర్గానికి నీళ్లిచ్చేందుకు ఎదురవుతున్న కొన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. వర్షాకాలం ఆరంభం కావడానికి సమయం ఉందని, ఈలోగా అన్ని పనులనూ పూర్తి చేసేందుకు ఈ రోజు జరిగిన సమీక్షలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, సిరిసిల్ల జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, ఆర్డీవో ఆనంద్‌ కుమార్‌, ఎస్‌ఈలు శ్రీకాంత్‌రావు, ఆనంద్‌, సంబంధిత ఈఈలు, డిప్యూటీ ఈఈలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీలకు ట్రాక్టర్ల అందజేత..

గన్నేరువరం మండలంలోని యాస్వాడ, పీచుపల్లి, గోపాలపూర్‌ గ్రామ పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను ఎల్‌ఎండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు  వినోద్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సర్పంచులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మన్మోహన్‌ రావు, సర్పంచులు పీచు చంద్రారెడ్డి, చెన్నాల నగేశ్‌, జక్కనపెల్లి మధూకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo